– కొత్త సైకిళ్లపై పొలం వైపు వెళ్లి..
నవతెలంగాణ-ఆదిలాబాద్‌రూరల్
కొత్త సైకిళ్ల సంబరం పిల్లల ప్రాణం తీసింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లాక.. సైకిళ్లు తొక్కుకుంటూ పొలం వైపు వెళ్లిన అక్కాతమ్ముడు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడిపోయి మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. లంక స్వామి, గీత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. శనివారం ఉదయం భార్యాభర్తలు పొలం పనికి ఎడ్ల బండిపై వెళ్లారు. అయితే, శుక్రవారం వారి పిల్లలు వినూత్న(12), విధాత(9)కు కొత్త సైకిళ్లు కొనిచ్చారు. ఆ సంబరంతో వారు శనివారం సైకిళ్లపై పొలం వైపు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో పిల్లలు కనబడకపోవడంతో కటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గాలిస్తుండగా పొలానికి వెళ్లే దారిలో గ్రీన్ వ్యాల్యూ రోడ్డు పక్కన నీటి గుంతలో సైకిల్ కనిపించింది. వెంటనే నీటి గుంతలో గ్రామస్తులు వెతకడంతో పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. సైకిళ్లపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడిపోతే.. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ఇద్దరూ మృతిచెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
నీటి గుంతలో పడి అక్కాతమ్ముడు మృతి
- Advertisement -
- Advertisement -