– నేనూ నా పోస్టుకు రాజీనామా చేస్తా : సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు సవాల్
– కిషన్‌రెడ్డి నుంచి అధికారికంగా బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘రేవంత్‌రెడ్డీ దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేరు…బీసీని సీఎం చేరు..నేనూ నా పోస్టుకు రాజీనామా చేస్తా. మరొకరికి అవకాశమిస్తా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు సవాల్ విసిరారు. తమ పార్టీ బీసీ నేత మోడీని ప్రధానిని చేసిందనీ, కేంద్ర క్యాబినెట్‌లో 29 మంది బీసీ మంత్రులున్నారని చెప్పారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ బీసీలకు అన్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. ఓబీసీలే బీజేపీ ఓటు బ్యాంకు అని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు కల్పించి బీసీలకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. అక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నుంచి అధికారికంగా ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. బీజేపీలో కార్యకర్త నుంచి అధ్యక్ష స్థాయి వరకు ఎదిగాననీ, తన పనిని చూసే అధిష్టానం పదవి ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలతో విసుగు చెందిన ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఆరు గ్యారంటీలు..420 హామీలతో ప్రజలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదనీ, అడుక్కునే పరిస్థితి ఉందని సీఎం మాట్లాడటం తగదన్నారు. తెలంగాణకు ఇప్పటిదాకా 12.90 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనీ, కోటా కంటే అదనంగా 2 మెట్రిక్ టన్నులిచ్చిందని వివరించారు. దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. యూరియా కొరత అంటూ కేంద్రంపై కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ పెట్టింది సామాజిక న్యాయ సభ కాదనీ, ప్రధాని మోడీని, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలను తిట్టడానికి పెట్టిన సభ అని విమర్శించారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన అవినీతిలో మునిగితేలడం తప్ప ఏమీ లేదనీ, ఏఐసీసీ అంటే ఆలిండియా చీటింగ్ కమిటీ అని ఆరోపించారు. ఇంత తక్కువ కాలంలో ప్రజల వ్యతిరేకత కూడగట్టుకున్న రాష్ట్ర సర్కారును తాను చూడలేదనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనే గెలవని ఖర్గే ఇక్కడకొచ్చి తెలంగాణలో వంద సీట్లు గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ సర్కారుపై ధర్మ యుద్ధం మొదలుపెట్టామనీ, వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యేలు, 15 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి దక్కడం ఖాయమని చెప్పారు. రాజాసింగ్ రాజీనామాపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో అనేక న్యాయ సమస్యలున్నాయనీ, రాష్ట్ర సర్కారు బిల్లు చేసి తమ పార్టీపై తోసేసిందని విమర్శించారు. బీసీ బిల్లు అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు సపోర్టు చేశారని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్..రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రం కట్టే పన్నుల్లో 50 శాతాన్ని కేంద్రం తిరిగి ఇస్తున్నదని చెప్పారు.
దమ్ముంటే రాజీనామా చేసి బీసీని సీఎం చెయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES