– చట్టాల రద్దుతో భవిష్యత్‌లో మరిన్ని ప్రమాదాలు
– యాజమాన్యాల పట్ల ప్రభుత్వాల ఉదారభావం : సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఎంపీ రాజారాం సింగ్
– సిగాచి ఫ్యాక్టరీ సందర్శన, బాధితులకు పరామర్శ
నవతెలంగాణ-పటాన్ చెరు
పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలతో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందనీ, ఈ చట్టాల నిర్వీర్య ఫలితమే సిగాచి ఘటన అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ బీహార్ రాష్ట్రం కరాకట్ ఎంపీ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రాజారాం సింగ్ అన్నారు. ఈ చట్టాల రద్దుతో భవిష్యత్‌లో మరిన్ని సిగాచి ఘటనలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో సిగాచి ఘటన పెద్దదని, యాజమాన్యమే ఈ ఘటనకు బాధ్యత వహించాలని, కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని శనివారం ఎంపీ రాజారాం సింగ్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్ మంజిల్, నైనాలశెట్టి మూర్తి సందర్శించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రాజారాం సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ యజమాన్యాల పట్ల ప్రభుత్వాలు ఉదారభావంతో వ్యవహరిస్తున్నాయనీ, దాని ఫలితంగానే కార్మికులు శ్రమ దోపిడీతోపాటు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రమాదాల్లో యాజమాన్యం అందించే సాయంతోపాటు ప్రభుత్వ సహాయం కూడా అధికంగా ఉండాలని, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికుల విషయంలోనూ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, రాష్ట్ర కమిటీ సభ్యులు నూనవత్ వీరు నాయక్, ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యదర్శి రొయ్యల రాజు, నాయకులు మహంకాళి శ్రీనివాస్ ఉన్నారు.
కార్మిక చట్టాల నిర్వీర్య ఫలితమే సిగాచి ఘటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES