Monday, July 7, 2025
E-PAPER
Homeమానవిఅదేప‌నిగా చూస్తున్నారా

అదేప‌నిగా చూస్తున్నారా

- Advertisement -

నేటి ఆధునిక యుగాన్ని స్మార్ట్‌ ఫోన్‌ ఏలేస్తోంది. ఫోన్లో రీల్స్‌ చూడటం ఒక వ్యసనంగా మారింది. ఏ కాస్త తీరిక దొరికినా స్మార్ట్‌ ఫోన్‌ తెరలకు అతుక్కుపోతున్నారు. రీల్స్‌ని, షాట్స్‌ని, వీడియోలను గంటల తరబడి చూస్తున్నారు. దీంతో విలువైన సమయం వృధా కావడమే కాదు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు దీనికి బానిసలుగా మారుతున్నారు. ఇలా రీల్స్‌ని అతిగా చూసే అలవాటు కళ్లకు హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. షార్ట్‌ వీడియోలను అతిగా చూడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో, వాటి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం మైదానంలో ఉల్లాసంగా ఆడుకోవాల్సిన పిల్లలు స్మార్ట్‌ ఫోన్లలో బందీ అయ్యారు. ఆఫీసు వర్క్‌, ఇతర పనులు చేసి ఇంటికి వచ్చాక పెద్దవాళ్లు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపవలసిన క్షణాలు సెల్‌ఫోన్‌కే కేటాయిస్తున్నారు. అంతే కాదు నలుగురితో కలిసి ఉన్నప్పుడు సరదాగా నాలుగు మాటలు మాట్లాడటం మానేసి దానితోనే కాలక్షేపం చేస్తున్నారు.

నిశ్శబ్దపు మహమ్మారి
అదే పనిగా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో రీల్స్‌, షాట్స్‌ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందంటున్నారు నిపుణులు. దీంతో ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉందని, మరీ ముఖ్యంగా చిన్నారులు, యువతలో దృష్టిలోపాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అధిక స్క్రీన్‌ టైంతో కంటిపై పడే డిజిటల్‌ ఒత్తిడి ఓ నిశ్శబ్దపు మహమ్మారిగా కంటి చూపును దెబ్బతీస్తుందని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా రీల్స్‌ చూస్తూ గంటల తరబడి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అతుక్కుపోవడంతో పిల్లల్లో కళ్లు పొడిబారిపోవటం, హాస్వ దృష్టి పెరగటం, కళ్లు ఒత్తిడికి గురికావడంతో పాటు చిన్న వయసులోనే మెల్లకన్ను రావటం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.


నియంత్రణ లేకుంటే
కంటిన్యూస్‌గా స్మార్ట్‌ ఫోన్‌ చూడడం వల్ల కంటి సమస్యలు, జనరల్‌ హెల్త్‌, మెంటల్‌ హెల్త్‌ దెబ్బతింటుంది. పిల్లలు ఒక్కసారి దీనికి అలవాటు పడ్డారంటే బయట ప్రపంచమంతా మర్చిపోయి సెల్‌ఫోన్‌తోనే కాలం గడిపేస్తున్నారు. కొంత మంది పిల్లల్లో మాటలు కూడా రావడం లేదు. దీనివల్ల పేరెంట్స్‌తో పిల్లలకు మంచి రిలేషన్‌ ఉండదు. రీల్స్‌ కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే ఉండవచ్చు. కానీ కంటి ఆరోగ్యంపై అవి చూపే ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుందంటున్నారు నిపుణులు. చిన్న ఆకర్షణీయమైన రీల్స్‌ను ఎక్కువసేపు దృష్టి నిలిపేలా డిజైన్‌ చేస్తున్నారని, స్థిరంగా అలా చూడటం వల్ల కనురెప్ప బ్లింకింగ్‌ రేటు 50 శాతం తగ్గుతుందని పలు అధ్యయానాల్లో వెల్లడైంది. ఈ సమస్య కళ్లు పొడిబారడానికి, దృష్టి లోపాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈ అలవాటు నియంత్రణ లేకుండా కొనసాగితే మాత్రం దీర్ఘకాలిక దృష్టి సమస్యలకు, శాశ్వత కంటి సమస్యలకు దారితీస్తుందని వివరించారు.


బ్లూలైట్‌ ప్రభావం
రోజూ గంటల తరబడి స్క్రీన్స్‌కు అతుక్కుపోయే పిల్లల్లో ముందస్తూ మయోపియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు కూడా స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూ లైట్‌కు గురికావడం వల్ల తరచు తలనొప్పి, మైగ్రేట్‌, నిద్రలేమి వంటి సమస్యల బారిన పడుతున్నారని వివరించారు. సెల్‌ఫోన్‌ అధికంగా వినియోగించడం వల్ల కంటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. రీల్స్‌ లాంటివి చూసేటప్పుడు ఒంటరిగా చీకటి గదిలో కూర్చోని దాన్ని తదేకంగా చూడడం వల్ల కంటికి స్ట్రెయిన్‌ వస్తుంది. దీంతో కంటిలోని చిన్న చిన్న కండరాలైన సీలియరీ మజల్స్‌ కంటిన్యూగా పని చేయాల్సి వస్తుంది. దీంతో కళ్లు మంట, దురద, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి.


వాస్తవాన్ని మర్చిపోయి
స్మార్ట్‌ఫోన్‌ని గంటల తరబడి చూడటం వల్ల కంటి సమస్యలతో పాటు సామాజిక, మానసిక ఇబ్బందులు సైతం పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సెల్‌ఫోన్లో అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే సమాచారాన్ని అదే పనిగా చూస్తూ ఉండటం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మెల్లకన్ను, కంటి చూపు మందగించటం వంటి సమస్యల తాకిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే నిరంతరం రీల్స్‌ చూడటం వల్ల సామాజిక ఒంటరితనం, మానసిక అలసట, మానసిక ఇబ్బందులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా రీల్స్‌లో మునిగిపోవడంతో వాస్తవిక ప్రపంచాన్ని విస్మరించటం, కుటుంబ సంబంధాలు దెబ్బతినటం, చదువు, చేసే పనిపై దృష్టి తగ్గటం వంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు.


నియమాలు పెట్టుకోండి
స్మార్ట్‌ ఫోన్‌లో నిరంతరాయంగా మనం చూసే రీల్స్‌లో కృత్రిమ కాంతి, వేగవంతమైన దృశ్య మార్పులు కంటిపై దుష్ప్రభావాన్ని చూపతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌పై గడిపే సమయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ చూసే టైంను తగ్గించడం, ఫోన్‌ ఛార్జింగ్‌ బెడ్‌రూంలో కాకుండా దూరంగా లేదా ఇంకొక రూంలోనో పెట్టుకోవాలి. తర్వాత టైం చూడడానికి, అలారం కోసం నార్మల్‌ గడియారాన్ని వాడుకోవాలి. నిద్ర లేచిన తర్వాత ఒక గంట వరకు ఫోన్‌ చూడకూడదు అనే నియమం పెట్టుకోవాలి. ఎక్కువ సమయం రీల్స్‌ చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు 20-20-20 రూల్స్‌ పాటించడం అన్ని విధాల మేలని నిపుణులు అంటున్నారు. ప్రతి 20 నిమిషాల ఒకసారి 20 సెకన్లు విరామం తీసుకోవాలి. ఆ టైంలో 20 మీటర్ల దూరంలో వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి లేదా గంటకు ఐదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ఇక అదే పనిగా ఫోన్‌ చూడకూడదని, మధ్య మధ్యలో కనురెప్పల్ని ఆర్పుతూ ఉండాలని వివరించారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా స్క్రీన్‌ బ్రేకులు తీసుకోవాలని, ఈ జాగ్రత్తలు ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -