Monday, July 7, 2025
E-PAPER
Homeదర్వాజప్రజల పక్షాన నిలిచినవాడే నా హీరో..

ప్రజల పక్షాన నిలిచినవాడే నా హీరో..

- Advertisement -

పేదరాశి పెద్దమ్మ ఒంగోని తుడుస్తా ఉంటే వీపుకి ఆకాశం తగిలేదంట. చీపురు, చాట ఎత్తి కొడితే ఆకాశం అంత ఎత్తుకి పోయిందంట. ఆ పెద్దమ్మ కథల కాణాచి’ అని ప్రారంభమవుతుంది ప్రసాద్‌ సూరి నవల ‘మైరావణ’. ఇది విశాఖ జిల్లా తీరప్రాంతాల్లో చేపలు పట్టే బెస్త వాళ్ళ జీవిత కథ. వాళ్లలో వాడ బలిజలు అనే కులం ఉంది. ముఖ్యంగా, ఇది వాళ్ళ జీవన పోరాటం. ఈ సమరంలో హీరో మైరావుడు. అతన్ని ఒక జానపద కథానాయకుడిని చేసి, అతన్నో గుర్రం ఎక్కించి, సముద్రతీరంలో, కొండ వాలుల్లో, పల్లెటూరి ప్రేమ గాలుల్లో కథను పరిగెత్తించాడు రచయిత. కథ చెప్పడానికి ఓ ప్రత్యేకమైన టెక్నిక్‌ని పనిగట్టుకుని వాడాడు. నాలుగు కథలను కలిపి ఒక గట్టి తాడును పేనినట్టుగా కథనం నడిపించాడు ప్రసాద్‌ సూరి. పేద మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఈ పాతికేండ్ల యువకుడు… తన రెండో నవలకే ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నవతెలంగాణ దర్వాజతో ప్రసాద్‌ సూరి ముచ్చట్లు…


మొదటి నవలా మై నేమ్‌ ఈజ్‌ చిరంజీవి పాక్షిక స్వగతమైతే, రెండవ నవలకు ఇంత పెద్ద కాన్వాస్‌ తీసుకోవడానికి కారణం?


ఒక రచన చెయ్యాలని కానీ… అది కూడా ఒక నవల రాసి నవలా రచయితని అనిపించుకుంటాను అనుకోలేదు. నా పేరుతో ఒక పుస్తకం అచ్చులో చూసుకోవాలనే సరదాతో రాయడం మొదలుపెట్టా. కానీ ఏం రాయాలి, ఎలా రాయాలి? లాంటి బేసిక్‌ ప్రశ్నలతో మొదలైంది ప్రయాణం. ఏవేవో రాద్దాం అని ఆలోచించి, అవన్నీ రాయడానికి తగిన విషయ పరిజ్ఞానం లేక ఆగిపోయిన ఒక స్తబ్దత లోంచి వచ్చిన ఆలోచనే ‘నా కథనే నవలగా ఎందుకు రాయకూడదు?’ అని. నా జీవితం గొప్పది కాబట్టి రాయాలనుకోలేదు. ఒక పాఠకుడు ఆసక్తిగా చదువుకునే ఒక కథ లాంటి జీవితం నాకు ఉందనిపించింది. అంటే పందొమ్మిదేళ్ళకే నేనేదో విస్తృతమైన జీవితం అనుభవించేసాను అని కూడా కాదు. కానీ రాయాలనే ఆ దుగ్ధ నన్ను నిద్రపోనిచ్చేది కాదు. అలా నా కథకి కొంత కల్పన జోడించి నేను పెరిగిన వాతావరణాన్ని, నేను చూసిన మనుషుల్ని, నా టీనేజ్‌ జీవితంలో నేను ఎదుర్కున్న కొన్ని విచిత్రమైన అనుభవాలని నాకు తోచిన విధంగా ఒక నవలగా రాశాను.

అది మై నేమ్‌ ఈజ్‌ చిరంజీవి. కొందరు దాన్ని జె డీ శాలింజర్‌ ‘క్యాచర్‌ ఇన్‌ ద రై’తో పోల్చారు. అది కూడా దాదాపు ఇలాంటి కథే అని విన్నాను. ఇప్పటిదాకా చదవలేదు.


ఈ నవల రాస్తున్న క్రమంలోనే ఒక పూర్తి కల్పిత కథ రాయాలి. అందులో మా మత్స్యకారుల జీవితాన్ని, మరీ ముఖ్యంగా మా వాడబలిజల జీవితాన్ని, చరిత్రని ఒక ఆసక్తికరమైన వినోదదాయకమైన కథగా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా దగ్గర మెటీరియల్‌ అయితే ఉంది గానీ కథ ఎలా చెప్పాలో అన్నదానికి ఒక పాన్‌ ఇండియన్‌ సినిమా పరిష్కారం చూపించింది.

ఇది ఒక జానపద కథానాయకుడి కథలా, ఓ జానపద, చారిత్రక నవలగా.. చరిత్రని, వర్తమానాన్ని కలుపుతూ మన దేశపు గత వందేళ్ల చరిత్రని నేపథ్యంగా చేసుకుని ఓ మూడు తరాల కథ చెప్పాలని ఆలోచన వచ్చింది. తెలుగులో ఇప్పుడు అనేక నేపథ్యాల నుంచి రచయితలు వాళ్ళ సమూహాల చరిత్రని సాహిత్యంలో కథ, కవితల రూపంలో రికార్డు చేస్తున్నారు. అలా మా వాడబలిజ సమాజపు చరిత్రని, జీవనాన్ని, కష్టాన్ని సాహిత్యంలో రికార్డు చెయ్యాలని అనిపించింది. అందుకు నాకు నవల అయితేనే ఎక్కువ స్కోప్‌ ఉందనిపించింది.


నవలకు తీసుకున్న కాన్వాస్‌ పెద్దది. దాదాపు వందేళ్ళ చరిత్ర. కాని నవల పేజీల పరంగా చూస్తే చిన్నది. అంత పెద్ద కాన్వాస్‌కి ఈ నవల న్యాయం చేసిందా?


ఈ సబ్జెక్ట్‌కీ, నవలకీ నేను న్యాయం చేశానా? ఒక పెద్ద నవలగా రాయాలనే దీన్ని మొదలుపెట్టాను. నాకు కూడా విక్రమ్‌ చంద్ర sacred games, gregory david roberts, shantaram లాంటి పెద్ద నవలలు అంటే చాలా ఇష్టం. ఆ నవలలు రాయడానికి వాళ్ళకి దొరికిన ప్రోత్సాహం నాకు దక్కలేదు. ఆ రచయితలకి యూనివర్సిటీల గ్రాంట్లు, కొన్ని సంస్థలు ఫండింగ్‌ కూడా చేస్తాయి. అవసరమైన పుస్తకాలు కొనుక్కోవచ్చు. నాలుగు ఊర్లు తిరిగి, నలుగురిని కలిసి మాట్లాడి, నాలుగు కొత్త విషయాలు తెలుసుకొని నవలలో వాటిని పెట్టొచ్చు. ఇక్కడ నేను హైదరాబాద్‌లో ఒక కళాశాల విద్యార్థిగా రేపు ఎలా రా? అనే సమస్యల మధ్య ఈ నవల రాశాను. నాకు సర్వైవలే పెద్ద సమస్య. ఇక ఫీల్డ్‌ రిసెర్చ్‌ కుదరని పని. నాకు ఆ సహకారం అంది వుంటే ఇంకొంచెం పెద్ద నవల వచ్చేది.

ఉదాహరణకు ఈ నవలలో ఒక పోర్షన్‌ 1940ల నాటి బర్మా (మయన్మార్‌) లోని రంగూన్‌ లో జరుగుతుంది. వాస్తవంగానైతే నేను ఫీల్డ్‌ రీసెర్చ్‌ చేసి అక్కడి తెలుగువాళ్లతో మాట్లాడి రాద్దాం అనుకున్నాను. కానీ సాధ్యమే కాలేదు. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్‌ కి ఇమ్యాజినేషన్‌ జోడించి రాశాను. అయినా దీన్ని వీలైనంత బాగా రాయడానికే ప్రయత్నించాను. లేదా న్యాయం చెయ్యడానికి ప్రయత్నించాను.


అయినా తెలుగులో సాహిత్య సృజన అనేది ఒక వ్యక్తిగతమైన ఆసక్తిగా తప్ప, ఇన్స్టిట్యూషనల్‌ ప్రాక్టీస్‌గా ఎప్పుడూ లేదు. క్రియేటివ్‌ రైటింగ్స్‌ ఒక కోర్సుగా చెప్పే కళాశాలలు మన దగ్గర దాదాపు లేవు. పాశ్చాత్య దేశాల్లో ఈ అవకాశం ఉంది. యువ రచయితలను వారు ప్రోత్సహిస్తారు. దానిని ఇక్కడ ఊహించడమే కష్టం. అలాగే తెలుగులో కథ, కవిత్వానికి దక్కుతున్న ప్రోత్సాహంతో పోల్చితే నవలకు అందుతున్న ప్రోత్సాహం తక్కువే. నవలకు కూడా వర్క్‌ షాపులు నిర్వహించాలి. చదివే పాఠకులు కూడా తక్కువగానే ఉంటున్నారు. పెద్ద రచయితలు కొత్తతరం రచనలపై చర్చ చేయాలి. సలహాలు ఇచ్చి గైడ్‌ చేసి కొత్తతరాన్ని తయారుచేయాలి. మైరావణ పబ్లిష్‌ అయి మూడేళ్లు అవుతుంది. జనాలు దాన్ని ఇప్పుడు చదువుతున్నారు. అదీ ఈ అవార్డు వచ్చింది కాబట్టి.


90ల నుంచీ ఇప్పటిదాకా తెలుగులో గొప్ప నవలలు ఎన్ని వచ్చాయి? వేళ్ళ మీద లేకపెట్టగలిగినన్నె ఉంటాయి. అలాగే, తెలుగు నవలల్లో ఉంటున్న వైవిధ్యత ఎంత? ఒక సల్మాన్‌ రష్దీ లాంటి నవలా రచయితలు మనకి ఎందుకు లేరు. వంటి ప్రశ్నలకి సమాధానం అవసరం.


మైరావణుడు అనే పౌరాణిక పాత్రను జానపద హీరోగా మార్చాలని ఎందుకు అనిపించించింది? అదీ మ్యాజిక్‌ రియలిజం సహారాగా చెప్పాలని?


మేజిక్‌ రియలిజం అనేది అద్భుతమైన మెథడ్‌. ముఖ్యంగా గతానికి సంబంధించిన కథలు చెప్తున్నప్పుడు దాన్ని ఇంకా బాగా వాడొచ్చు. అయితే మన భారత దేశ ప్రాచీన సాహిత్యంలో అది ఎప్పటి నుంచో ఉంది. అది పౌరాణికంలో కావచ్చు, జానపదంలో కావచ్చు. వాటి మీద అవగాహన ఉన్నవాళ్ళకి అది అంత అర్థం కాని విషయం కాదు. అందుకని మ్యాజిక్‌ రియలిజం గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ మనం మార్క్వేజ్‌నే ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే మార్క్వేజ్‌ చేసిందేమిటంటే దాన్ని చాలా ప్రతిభావంతంగా ఆధునిక సాహిత్యంలో వాడటం. అలాగే మైరావణుడి కథ కూడా మనకు ఒరిజినల్‌ రామాయణంలో ఉండదు.

అది 17 వ శతాబ్దపు కృత్తివాస రామాయణంలో మొదటిసారి కనిపిస్తుంది. అది కూడా జానపద కథ లాంటిదే. మన కథలు, మన పురాణాలు, మన చరిత్రా, మన సంస్కృతిక వైవిధ్యం ఆధునిక రచయితలకి వరం లాంటివి. మనం వాటిని ఫ్రీగా వాడుకొని అద్భుతమైన కథలు చెప్పొచ్చు.


ఈ నవల రాస్తున్న క్రమంలో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా మన దేశ చరిత్ర పురాణాలు, ఇతిహాసాల్లో ఉందంటారు. అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే, విద్యకు దూరంగా ఉన్న సమూహాలు సమాజాలు తమ చరిత్రని కథల రూపంలో దాచుకున్నాయి. ఒక తరం నుంచి ఒక తరానికి అది అందించబడుతూ ఉంటుంది. ఒక సీక్రెట్‌ మెసేజ్‌ లాగా. దాన్ని డీకోడ్‌ చెయ్యడం ఏదో ఒక తరంలో ఎవరో ఒకరు చెయ్యాలి. అందుకు చదువుకోవాలి. నా తరంలో ఆ పని నేను చేస్తున్నాను అనుకుంటాను

.
చారిత్రక రచనగా ఈ నవలకు ఎక్కువ స్కోప్‌ ఉండేది కదా… అలాంటప్పుడు సమకాలీన రాజకీయాలను, అందులో వామపక్ష రాజకీయాలను ఎందుకు ఇందులో మిళితం చేసినట్లు?


కథ బిగినింగ్‌ లో హీరో ఊరికి మొనగాడు అని చెప్పాను. కానీ కథ చివరికి వచ్చేసరికి వాడి స్థాయిని పెంచాలంటే వాడు ఊరికే కాదు, దేశానికే మొనగాడు అని చెప్పాలి కదా. అందుకే ఈ కోణాన్ని జోడించా. అలాగే ఇది ఒక న్యూ ఏజ్‌ ఫోక్‌ హిరో కథ. మరి హీరో అనేవాడు ప్రజల పక్షాన నిలబడాలి కదా. ప్రజల పక్షాన నిలబడేది ఎవరూ? దౌర్జన్యానికి, దోపిడికి, పీడనకి ఎదురు తిరిగేవాడే హీరో, అలాంటి హీరో 21 వ శతాబ్దంలో ఉంటే అతడి జెండా, ఎజెండా ఏమై ఉంటాయి?


ప్రస్తుతం మనం ఒక విచిత్రమైన సామాజిక రాజకీయ పరిస్థితుల మధ్య బతుకుతున్నాం. ప్రపంచంతో పాటూ ముందుకు పోవాలి అంటూనే మధ్యయుగాలనాటి సంప్రదాయాలని నెత్తిన మోస్తున్నాం. చరిత్ర పేరుతో కథల్ని వింటూ ఈ దేశపు మెజారిటీ మత్తులో తూగుతుంది. ఇలాంటి ఒక కాలాన్ని రికార్డు చెయ్యాలి కదా! కథలు చాలా పవర్ఫుల్‌. అవి యుగాంతాలని కూడా దాటి నిలుస్తాయి.


అరుణాంక్‌ లత
8143916151

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -