Monday, July 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపనిగంటల పెంపు జీవోను రద్దు చేయాలి

పనిగంటల పెంపు జీవోను రద్దు చేయాలి

- Advertisement -

కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు జీవో 282
నేడు హైదరాబాద్‌లో అంజయ్య భవన్‌ ఎదుట నిరసన
జిల్లా, మండల, పారిశ్రామిక కేంద్రాల్లో జీవో కాపీల దహనం :
ఉమ్మడి సమావేశంలో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ దుకాణాలు, స్థాపనల చట్టం-1988లోని సెక్షన్‌ 16,17కి సవరణ చేస్తూ పనిదినాన్ని ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పెంచుతూ విడుదల చేసిన జీవో నెంబర్‌ 282ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఆ జీవోతో కార్మికులు మరింత శ్రమదోపిడీకి గురై కట్టుబానిసలుగా మారే ప్రమాదముందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జిల్లా, మండల కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో జీవో కాపీలను దహనం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయం(అంజయ్య భవన్‌) ఎదుట జీవో కాపీల దహనం, నిరసన కార్యక్రమాలుంటాయని ప్రకటించారు. వీటిని కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది. అందులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వీఎస్‌.బోస్‌, బీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారన్న, ఏఐయుటీయూసీ రాష్ట్ర ఇన్‌చార్జి భరత్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఓవైపు దేశవ్యాప్తంగా మోడీ సర్కారు తీసుకురాబోతున్న లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే ఇక్కడేమో కాంగ్రెస్‌ ప్రభుత్వం పది గంటల పనివిధానాన్ని చట్టబద్ధం చేస్తూ జీవో జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఆ జీవో పెట్టుబడిదారులు, కార్పోరేట్ల సంస్థల ప్రయోజనాలు, లాభాల కోసమే స్పష్టం చేశారు. ఈ జీవో వల్ల కార్మికులకు ఎలా ప్రయోజనం చేకూరదని నొక్కి చెప్పారు. జులై 9న దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్న తరుణంలో కార్మికులను మరింత రెచ్చగొట్టేలా కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయం ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మికవర్గం ప్రటిఘటించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -