Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణాశాఖలో ప్రమోషన్‌లెప్పుడో..!

రవాణాశాఖలో ప్రమోషన్‌లెప్పుడో..!

- Advertisement -

– రెగ్యులర్‌ ఆర్టీవోల్లేక పాలన అస్తవ్యస్తం
– ఏడు నెలలుగా ఇన్‌చార్జిల పాలనే
– ఖాళీల భర్తీపై ఊసేత్తని రవాణాశాఖ
– ప్రజలకు తప్పని ఇబ్బందులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

రవాణాశాఖలో ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడంతో ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంతో పాటు గ్రేటర్‌లోని హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో రెగ్యులర్‌ ఆర్టీవోలు లేక పాలన అదుపు తప్పుతోంది. అంతేగాక నిత్యం ఏదో ఒక సమస్యతో పాటు వివాదాలకు కేరాఫ్‌గా ఆయా ఆఫీసులు మారుతున్నాయి. అయితే కొన్నిచోట్ల వాహనదారులకు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులూ ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడంలో రవాణాశాఖది కీలక పాత్ర. అలాంటి శాఖలో రెగ్యులర్‌ ఆర్టీవోలు లేకపోవడంతో పౌరసేవల్లో తీవ్ర జాప్యం జరగుతోంది. దాంతో ప్రస్తుతమున్న అధికారులు, సిబ్బందిపైనే పనిభారం పడటంతో పాటు వారిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఏజెంట్లు, మధ్యవర్తుల ప్రమేయం పెరగడమే కాక, అవినీతి తారస్థాయికి చేరిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత ఉన్నవారికి ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా అధికారులపై పనిభారం, వాహనదారులకు మెరుగైన సేవలను అందించవచ్చు.


రవాణాశాఖలో ఉద్యోగోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇద్దరు డీటీసీలను జేటీసీలుగా, అయిదుగురు ఆర్టీవోలను డీటీసీలుగా ప్రభుత్వం ప్రమోషన్‌లు కల్పించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఖాళీలతోపాటు రిటైర్‌ అయిన స్థానంలో ప్రమోషన్‌కు అర్హత ఉన్నవారిని భర్తీ చేయడం లేదు. ఇందులో సికింద్రాబాద్‌, బండ్లగూడ, ఉప్పల్‌, కామారెడ్డి, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం ఆర్టీవో పోస్టులు ఖాళీగా ఉండగా.. వరంగల్‌ డీటీసీ కూడా ఉండగా.. ఇన్‌చార్జి ఆర్టీవోతో నెట్టుకొస్తున్నారు. దాంతో రవాణాశాఖ ఉద్యోగులు తమ పరిధిలో ఉన్నటువంటి పనులు పూర్తి చేసినప్పటికి ఆర్టీవో చేయాల్సిన పనుల్లో జాప్యం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే టోలిచౌకి, తిరుమలగిరి, ఉప్పల్‌కు ఇన్‌చార్జి ఆర్టీవోను నియమించినప్పటికీ.. ఇబ్బందులు తప్పడం లేదు. వీరు ఉదయం ఒక చోట, సాయంత్రం మరోచోట బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులు క్లియర్‌ చేస్తున్నా.. ఎక్కడొక చోట పెండింగ్‌ పడటం.. వాహనదారులు కార్యాలయాలకు ఒకటికి రెండుసార్లు రావాల్సి వస్తున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇది వారిలో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇటు ఆర్టీవోలు లేక.. అటు ఉన్న సిబ్బందిపై పనిఒత్తిడి ఉండటంతో ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ సమస్యను తీర్చకపోవడంలో జాప్యం జరుగుతుంది. ఇదంతా లంచాల కోసమే అలా చేస్తున్నారనే ప్రచారం చేస్తూ.. అలా ఇబ్బంది పడేవారిని టార్గెట్‌ చేసుకొని అక్కడే ఉండే కొంతమంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేయించడం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఆందోళనతో చాలా మంది అధికారులు పనులు చేయలేని పరిస్థితి ఉంది.


సీనియర్‌ ఎంవీఐలను అప్‌గ్రేడ్‌ చేసి ఆర్టీవోలుగా నియమిస్తే..
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ ఆర్టీవోల నియమించే విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. అయితే రవాణాశాఖలోని మినిస్ట్రీరియల్‌ స్టాఫ్‌ తాము ఏండ్లుగా సేవలు అందిస్తున్నామనీ, తమకు అన్ని అర్హతులున్నా ఆర్టీవోలుగా అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం ఏటూ తేల్చకపోవడంతో కొద్దిరోజుల క్రితం వారంతా కోర్టును ఆశ్రయించారు. దాంతో ఉద్యోగోన్నతుల ప్రక్రియ ఆగిందని సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో, గ్రేటర్‌లోని ఆర్టీవో కార్యాలయాల్లో ప్రతిరోజూ వేలల్లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, అదే సంఖ్యలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీతో పాటు ఇతర సేవలతో నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం వాహనదారులకు అందించాల్సిన ఈ సేవల్లో ఇబ్బందులు వస్తున్న దృష్ట్యా.. ప్రస్తుతం ఉన్న ఏడు ఆర్టీవో పోస్టుల్లో రెండు లేదా మూడింటిని పక్కకు పెట్టి మిగతావి సీనియారిటీ ప్రకారం అర్హత ఉన్నవారికి ప్రమోషన్‌ కల్పిస్తే బాగుంటుందనే డిమాండ్‌ వినిస్తోంది. అదే సమయంలో జిల్లాల సంఖ్య పెరిగినప్పటికీ వాటిల్లో ఎంవీఐలే ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రాల్లో సీనియర్‌ ఎంవీఐలను అప్‌గ్రేడ్‌ చేసి ఆర్టీవోలుగా నియమిస్తే.. ఏండ్లుగా ప్రమోషన్‌ కోసం ఎదురుచూస్తున్నవారికి ఊరటనివ్వనుంది. దాంతో ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం కూడా ఉండకపోగా.. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు ప్రజలకు సులభతరంగా సేవలు అందనున్నాయి. మరి ఆ దిశగా ప్రభుత్వం, సంబంధిత మంత్రి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -