– 24 ఏసీలు, ఖరీదైన టీవీలు, షాండ్లియర్లు
– నాడు అరవింద్ కేజ్రీవాల్‌పై ‘షీష్ మహల్’ విమర్శలు
– నేడు బీజేపీ ముఖ్యమంత్రి విస్తారంగా ఖర్చు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఆధునీకరించడంపై విమర్శలు గుప్పించిన బీజేపీ కపటత్వం బయటపడింది. నేడు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధికారిక నివాసంలో విలాసవంతమైన ఆధునీకరణ పనులు చేయడానికి నిర్ణయించింది. 24 ఏసీలు, ఖరీదైన టీవీలు, షాండ్లియర్లు, గోడ ప్రకాశం ఫిక్చర్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలతో ఆధునీకరించుకునేందుకు సిద్ధమయింది.
రేఖ గుప్తా కొత్త అధికారిక నివాసమైన రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా నంబర్ 1ను ఆధునీకరించేందుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) జూలై 15 లోపు పనులు ప్రారంభిస్తుందని ఆ సంస్థ జారీ చేసిన టెండర్ నోటీసులో తెలిపింది. మొదటి దశలో విద్యుత్ పరికరాలను మార్చడం, పెంచడం వంటి పనులుంటాయి. బంగ్లాకు సంబంధించిన ఇతర సివిల్ పనులు, పక్కనే ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌కు మార్పులు చేపట్టనున్నట్టు పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు.
ఇటీవల జారీ చేసిన టెండర్ ప్రకారం ప్రతిపాదితాల్లో 10 ఫ్లడ్ లైట్లు, షాండ్లియర్లు, వాల్ ఇల్యూమినేషన్ ఫిక్చర్‌లు, ఎలక్ట్రిక్ చిమ్నీలు ఉన్నాయి. 80 లైట్ పాయింట్లు, ఫ్యాన్ పాయింట్లు, ఎగ్జాస్ట్‌లు, ఇతర విభాగాలను పూర్తిగా రీవైరింగ్ చేయాల్సి ఉంటుందని పీడబ్ల్యూడీ అధికారి తెలిపారు. 23 ప్రీమియం ఎనర్జీ ఎఫిషియన్సీ సీలింగ్ ఫ్యాన్‌లు, 16 వాల్ ఫ్యాన్‌లు, రెండు టన్నుల సామర్థ్యమున్న 24 ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేస్తారు. ఎయిర్ కండిషనింగ్‌కు మాత్రమే దాదాపు రూ.11,11,342 ఖర్చవుతుందని పీడబ్ల్యూడీ టెండర్‌లో స్పష్టమవుతోంది. ప్రకాశం కోసం బంగ్లాకు 115 సెట్ల దీపాలు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి టెండర్ ప్రకారం రూ. 6,03,939 ఖర్చవుతుంది. జనరల్ హాల్ ప్రాంతంలోని నికెల్ ఫినిష్‌లో 16 రౌండ్ పెద్ద ఫ్లష్- సీలింగ్ లైట్ యూనిట్లు, ఏడు ఇత్తడి సీలింగ్ లాంతర్లను, ఎనిమిది ఇత్తడి, గాజు లాంతరు గోడ లైట్లను ఏర్పాటు చేస్తారు.
ప్రవేశ ద్వారం, డ్రాయింగ్ రూమ్‌లో ఆరు ఎల్‌ఈడీ బల్బులు, రెండు చిన్న యూనిట్లతో కూడిన ఒక పెద్ద ఇత్తడి ఫ్రేమ్ గ్లాస్ షాండ్లియర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ చిమ్నీతో పాటు, వంటగది ఉపకరణాల్లో విద్యుదయస్కాంత బర్నర్లతో కూడిన గ్యాస్ హాప్, 20 లీటర్ల మైక్రోవేవ్, ఎల్‌సీడీ డిస్‌ప్లే టోస్ట్ గ్రిల్, వాటర్ ప్యూరిఫయర్ ఉన్నాయి. టెండర్‌లో ఆరు గీజర్లు, వాషింగ్ మెషిన్, డిష్‌వాషర్, గంటకు 50 లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం గల పెద్ద ఆర్‌వో వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఐదు 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టెలివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. 14 కెమెరాలతో కూడిన కొత్త నిఘా వ్యవస్థతో పాటు, భద్రత కోసం కాంపౌండ్‌కు పది ఎల్‌ఈడీ ఫ్లడ్ లైట్లు, కొత్త ఇంటర్‌కమ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారు.
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా నంబర్ 1, 2లను ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు కేటాయించారు. రెండో బంగ్లాను సీఎం బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి ”క్యాంప్ ఆఫీస్”గా ఉపయోగిస్తున్నారు. తర్వాత చేపట్టాల్సిన అదనపు సివిల్ పనుల్లో 1, 2 నంబర్ బంగ్లాల మధ్య మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. నిర్మాణ మార్పులు, పెయింటింగ్, పైప్‌లైన్‌లు ఉన్నాయని పీడబ్ల్యూడీ అధికారులు తెలిపారు.
గత సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసం 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో ఉండబోనని రేఖగుప్తా స్పష్టం చేశారు. ఆ నివాసం ఆప్ పాలన ‘అవినీతికి చిహ్నం’ అని పేర్కొన్నారు. ఆ భవనాన్ని బీజేపీ ‘షీష్ మహల్’ అని పిలిచింది. అప్పుడు విమర్శలు గుప్పించిన బీజేపీ, ఇప్పుడు ఆ పార్టీ సీఎం తన అధికారిక నివాస ఆధునీకరణకు ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీ సీఎం విలాసాలకు ప్రజాధనం
- Advertisement -
- Advertisement -