– పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి : 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతు :టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలనీ, పెన్షనర్లకు బకాయిలు విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకటేశ్ కోరారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఈ నెల 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్సీ అమలు గడువు దాటి రెండేండ్లు గడిచిన నేపథ్యంలో పీఆర్సీ నివేదిక తెప్పించుకుని 1.07.23 నుంచి అమలు చేయాలని విన్నవించారు. 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఉద్యోగ విరమణ అనంతర ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పోరాటాలకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతినెల రూ 700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించారనీ, కానీ, ఇప్పటి వరకూ కేవలం రూ.180 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. గురుకులాల పనివేళలను శాస్త్రీయంగా సవరించాలనీ, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలని విన్నవించారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలనీ, డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల పర్యవేక్షణ సంబంధిత అధికారుల ద్వారానే జరపాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంకా పూర్తి చేయకపోవడం విచారకరమన్నారు. తక్షణమే బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలనీ, సీపీఎస్ రద్దు చేసి 2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందనీ, ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నొక్కి చెప్పారు. ఊరి బడిని కాపాడు కోవాల్సిన అవసరం సమాజానికి ఉందన్నారు. ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలనీ, ఉన్నత పాఠశాలల్లో 11,12 తరగతులను ప్రారంభిం చాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, పాఠశాలల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించిన తర్వాతే 11,12 తరగతులను ప్రారంభించాలని కోరారు. ఇంటర్ విద్యలో బలంగా వేళ్ళూనుకున్న కార్పోరేట్ విద్యా వ్యాపారాన్ని పాఠశాల విద్యలో ప్రవేశిం చకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 8,9,10 తేదీల్లో కోల్‌కతాలో జరిగే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రజతోత్సవ మహాసభలను విజయ వంతం చేయాలని కోరారు. ఆ సందర్భాన్ని పురస్కరిం చుకొని ఆగస్టు 1 నుండి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఈపీ, సీపీఎస్ లకు వ్యతిరేకంగా సదస్సులు నిర్వహిం చాలని నిర్ణయిం చామన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సీహెచ్.దుర్గాభవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాములు, రాజశేఖరరెడ్డి, శాంతకుమారి, నాగమణి, రంజిత్ కుమార్, రాజు, మల్లారెడ్డి, శ్రీధర్, రవికుమార్, రవిప్రసాద్‌గౌడ్, జ్ఞాన మంజరి, సింహాచలం, వెంకటప్ప, యాకయ్య, కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES