– ఆగుతూ సా..గుతున్న ఎస్‌ఎల్‌బీసీ పనులు
– సాంకేతిక పరిజ్ఞానంపేరుతో కాలయాపన
– హెలికాప్టర్ సర్వే అనంతరం మొదలుపెట్టే యోచనలో ప్రభుత్వం
– కమిటీ రిపోర్టు వచ్చాకేనంటున్న అధికారులు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం కోసం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నిర్మించాలని 1979లో చర్చ మొదలై 1982 జులై 29న 480 కోట్లతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను ప్రారంబించడానికి జీవో జారీ చేసింది. 43 ఏండ్లుగా ఆగుతూ.. సాగుతూ.. ఎస్‌ఎల్‌బీసీ పనులు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, తగినన్ని నిధులు కేటాయించకపోవడం, అధికారులు, ఇంజినీర్ల ఉదాశీనత, కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాకపోవడం, పలు సాంకేతిక కారణాలు.. ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తూ వచ్చాయి. తాజాగా ఇటీవల మళ్లీ పనులు మొదలు పెట్టగా శ్రీశైలం ఎడమగట్టు దోమలపెంట దగ్గర సొరంగంలో మట్టికూలి ఇంజినీర్లు, కార్మికులు సజీవ సమాధి అయ్యారు. రెండు మృతదేహాలను వెలికితీశారు. మరో ఎనిమిది మంది జాడలేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేసి చివరికి పనులు నిలిపేశారు. 60 రోజులు 24 గంటలు 12 రంగాలకు చెందిన సిబ్బంది శక్తివంచన లేకుండా ఎంతో ప్రయత్నం చేశారు. అత్యంత ప్రమాదకరమైన స్థలం కావడం చేత మిగతా వారిని మట్టి నుండి బయటకు తీయలేక పోయారు. పదేండ్లుగా ఈ ప్రాజెక్టు పనులు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టామని కాంగ్రెస్ చెబుతున్నా.. సొరంగం పైకప్పు కూలడం, కార్మికులు సజీవ సమాధి కావడం ప్రభుత్వాన్ని నిరాశకు గురి చేసింది. సరైన ప్రణాళిక లేకుండా పనులు మొదలు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇస్తామన్న రూ. 25 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ప్రభుత్వం అందజేసినట్టు అధికారులు తెలిపారు. మృతిచెందిన కార్మికుల జాబితాను వారు ఉంటున్న ఆ రాష్ట్రాల అధికారులకు తెలియజేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎస్‌ఎల్‌బీసీ పనులు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, కచ్చితంగా పూర్తి చేస్తామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే, ఎలా పూర్తి చేస్తారన్న దానిపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీశైలం దగ్గర కృష్ణానది సమీపంలో దోమలపెంట దగ్గర సొరంగం ఇన్‌లెట్ 13.85 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది.10 మీటర్ల వెడల్పు 129 మీటర్ల పొడువున్న టీబీఎం మిషన్‌తో పనులు జరుగుతుండగా జరిగిన ప్రమాదంలో మట్టి పై కప్పు కూలి ఎనిమిది మంది సొరంగంలో చిక్కుకున్నారు. కార్మికులను బయటకు తీయడానికి ఊట నీరు పై నుండి పడుతున్న మట్టి ప్రమాదకరంగా మారింది. ఆర్మీ, ఎన్‌టీఆర్‌ఎఫ్, సింగరేణి, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, హైడ్రా దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్ హౌల్ మైనర్స్, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ వంటి 12 రంగాలకు చెందిన నిపుణుల ఆధ్వర్యంలో సొరంగంలో శ్రమించి కార్మికులను సురక్షితంగా తేవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయినా వీరి కృషి ఫలించలేదు.
సొరంగం పనులు పూర్తికి ఆర్మీ సహకారం..
సొరంగం పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆర్మీ సహకారాన్ని కోరినట్టు తెలిసింది. ఆర్మీ సహకారం కోసం రక్షణ శాఖను కోరగా వారినుంచి అంగీకారం వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చిన తర్వాత సర్వే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. టన్నెల్ పనులు పూర్తి చేయ డానికి కల్నల్ పరిక్షిత్ మెహ్ర, హరిపాల్‌సింగ్‌లను నియమించారు. సర్వే కోసం అనుమతులు రాగానే హెలికాప్టర్ ద్వారా భూమి లోపల ఉన్న పొరలను అధ్యయనం చేస్తారు. భూమిలో ఉన్న పొరల్లో లూజ్ మట్టిని కూడా అధ్యయనం చేయనున్నారని తెలిసింది. అయితే సర్వే పూర్తయిన తర్వాత టీబీఎం మిషన్ ద్వారానా లేక బ్లాస్టింగ్ ద్వారా పనులు పూర్తి చేయాలా అనేది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. టీబీఎం కోసం ఇప్పటికే జర్మనీ నుండి బేరింగ్‌తో పాటు పలు విడిభాగాలు తెప్పించి సిద్ధం చేశారు. అన్ని అనుకూలంగా జరిగితే మరో 15 రోజుల్లో పనులు మొదలవుతాయని తెలుస్తోంది.
సర్వే తర్వాతనే పనులు మొదలు
ఎస్‌ఎల్‌బీసీలో ప్రమాదం జరిగిన తర్వాత సొరంగం లోపల పనులు ఎప్పుడు ప్రారంభం చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. టీబీఎం మిషన్ ద్వారానా లేక బ్లాస్టింగ్ ద్వారా పనులు చేయాలా అనేది కూడా ప్రభుత్వమే చర్చిస్తుంది. హెలీకాప్టర్ సర్వే అనంతరం పనులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
–చక్రపాణి,ఎస్‌ఎల్‌బీసీ డీఈ, మన్నెవారిపల్లి, నాగర్‌కర్నూల్