– మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అరెస్టు?
నవతెలంగాణ-కామారెడ్డి
తన భర్త, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేశారని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం కామారెడ్డిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాము రాజకీయంగా ఎదుగుతున్న తీరును భరించలేని కొందరు తమపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, పేలుడు పదార్థాల నిల్వ కేసులో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారన్నారు. శ్రీవారి వెంచర్‌ను విబుస్ వెంచర్స్ వారికి 2023 లోనే అప్పజెప్పామని, తన భర్తకు ఆ వెంచర్‌తో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని, ఒక్క గుంట భూమి కూడా తన భర్త పేరు మీద లేదని తెలిపారు. తమను అరెస్టు చేయడానికి నిజంగా పోలీసుల వద్ద ఏదైనా సమాచారం, సాక్ష్యం ఉంటే తమకు నోటీసులిచ్చి అరెస్టు చేసి ఉంటే తాము ఎవరినీ తప్పు బట్టే వారిమి కాదని, కావాలనే తమను ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రెండు రోజుల కిందట కామారెడ్డి పట్టణంలోని కేపీఆర్ కాలనీలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు జిలిటిన్ స్టిక్స్, ఇతర సన్నాహక సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని పోలీసులు విచారించగా ఈ పేలుడు పదార్థాలను గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వద్ద నుంచి తెచ్చుకున్నట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం రాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుందకు తరలించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి నిజామాబాద్ జైలుకు తరలించినట్టు సమాచారం.
పేలుడు పదార్థాల నిల్వ కేసులో చంద్రశేఖర్ రెడ్డికి సంబంధం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES