నవతెలంగాణ-హైదరాబాద్: ఓ మహిళా ఆఫీసర్ నిమిషాల వ్యవధిలోనే పామును పట్టేసింది. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. ధైర్యంగా పామును పట్టుకుంది. ఆమె పామును పట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్యోగులందరూ అవాక్కయ్యారు.
కేరళలోని తిరువనంతపురం జిల్లా కట్టకడలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. విధుల్లో ఉన్న ఓ మహిళా అటవీశాఖ అధికారి 18 అడుగుల పొడవైన పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని కట్టకడ రెసిడెన్షియల్ ప్రాంతంలో జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ రోషిణి అనే మహిళా నిమిషాల్లోనే కింగ్ కోబ్రాను పట్టుకొని సంచిలో బంధించింది. అయితే.. ఆమె పామును పట్టడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహిళా అధికారి పామును పట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రోషిణి చూపిన ధైర్యసాహసాలను స్థానికులు,నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.