ప్రమాదాలకు నిలయంగా 765 డీజీ నేషనల్ హైవే
నవతెలంగాణ – దుబ్బాక : రూ.1461 కోట్ల వ్యయంతో ఎల్కతుర్తి – మెదక్ 134 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న నేషనల్ హైవే 765 డీజీ పనుల్లో డొల్లతనం కనబడుతుంది. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. రహదారి పొడవునా భద్రత చర్యలు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్, హబ్సిపూర్, ధర్మారం, అక్బర్ పేట భూంపల్లి మండలంలోని చిట్టాపూర్ గ్రామాల మీదుగా పోతారెడ్డిపేట గ్రామ శివారు వరకు 15 కిలోమీటర్ల మేర ఈ నేషనల్ హైవే విస్తరణ పనులు పలుచోట్ల అసంపూర్తిగా, నాణ్యత లోపాలతో దర్శనమిస్తున్నాయి.
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ – భూంపల్లి చౌరస్తా వెళ్లేదారిలో చౌదర్ పల్లి కమాన్ వద్ద నిర్మించిన కల్వర్టు వద్ద ఇరువైపులా రోడ్డును సరిగా వేయలేదు. రెండు వైపులా కంకర తేలి ప్రయాణికులు జారిపడ్డ సంఘటనలు ఉన్నాయి. అలాగే చిట్టాపూర్ నుంచి హబ్సిపూర్ వెళ్లే దారిలో మోతె కమన్ దగ్గర డేంజర్, డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. రహదారి విస్తరణ పనులు సగం వరకే నిర్మించారు.
చాలా చోట్ల డివైడర్ లు లేవు. నామమాత్రంగా కల్వర్టులు నిర్మించారు. మూల మలుపుల వద్ద డేంజర్ బోర్డులు, డైవర్షన్ బోర్డులు, సేఫ్టీ బారికేడ్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల ఉన్న అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాత్రివేళల్లో ప్రయాణించే వాహనాదారులకు ఇవేవీ కనిపించక ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లకు ఇరువైపులా కొన్ని చోట్ల నిర్మించిన డ్రైనేజీలపై స్లాబులను వేయలేదు. భద్రత చర్యలు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత అధికారులు నాణ్యత ప్రమాణాలతో రోడ్డును నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.