నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యమిస్తూ సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 48 అర్జీలను, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 34,జిల్లా పంచాయతీ శాఖ 5, జిల్లా వ్యవసాయ శాఖ 2, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 2, హౌసింగ్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ , మున్సిపాలిటీ,జిల్లా సంక్షేమ శాఖ, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, బడిబాట, వనమహోత్సవం, ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల పై జిల్లా అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో మొదటి విడతలో గ్రామాల్లో మంజూరీ అయినా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంకా పునాది తీసుకొనని వారిని త్వరగా తీసుకునేలా మండలం తహసీల్దార్లు, యం పి డి ఓ లు,మండల ప్రత్యేక అధికారులు చొరవ చూపాలన్నారు. బేస్మెంట్ తీసుకున్న వారికి ప్రతి సోమవారం లక్ష్మ రూపాయలు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల పై నమ్మకం పెరిగిందని చాలా మంది ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారన్నారు.
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు మొక్కల సిద్ధంగా ఉన్నాయన్నారు. మొక్కలు నాటిన తర్వాత, నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యత కూడా మొక్కను నాటిన వారిపై ఉందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు.మహిళలకు సోలార్ ప్లాంట్ , పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా అధికారులందరూ ఈ కార్యక్రమల పై శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.