Tuesday, July 8, 2025
E-PAPER
Homeఆటలుఎదురులేని అల్కరాస్‌

ఎదురులేని అల్కరాస్‌

- Advertisement -

– క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్‌ స్టార్‌
– వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2025
నవతెలంగాణ-లండన్‌ :
స్పెయిన్‌ స్టార్‌, 22 ఏండ్ల కార్లోస్‌ అల్కరాస్‌కు ఎదురులేదు!. వరుసగా రెండేండ్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టైటిళ్లు సాధించిన బోర్గ్‌ సరసన నిలిచేందుకు అల్కరాస్‌ దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో రష్యా ఆటగాడు ఆండీ రూబ్లెవ్‌పై 6-7(5-7), 6-3, 6-4, 6-4తో గెలుపొందిన అల్కరాస్‌ వింబుల్డన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌, రెండో సీడ్‌ అల్కరాస్‌కు 14వ సీడ్‌ రూబ్లెవ్‌ తొలి సెట్లో షాక్‌ ఇచ్చినా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో తేలిపోయాడు. 22 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లతో రెచ్చిపోయిన అల్కరాస్‌ టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేశాడు. పాయింట్ల పరంగా 129-110తో మెరిసిన అల్కరాస్‌.. స్వీయ సర్వ్‌లో 20 గేములు గెల్చుకుని పైచేయి సాధించాడు. రూబ్లెవ్‌ తొలి సెట్లో పైచేయి సాధించినా.. ఆ తర్వాత ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు. అల్కరాస్‌ దూకుడు ముందు నిలబడలేదు. మరో మ్యాచ్‌లో బ్రిటన్‌ ఆటగాడు కామెరూన్‌ నోరీ ఐదు సెట్ల పోరులో చిలీ ఆటగాడు నికోలస్‌ జారీపై గెలుపొందాడు. 6-3, 7-6(7-4), 6-7(7-9), 6-7(5-7), 6-3తో కామెరూన్‌ మహా పోరులో పైచేయి సాధించాడు. 46 ఏస్‌లతో మెరిసిన నికోలస్‌ రెండు టైబ్రేకర్లలో మెరిసినా.. ఓ టైబ్రేకర్‌ను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నిర్ణయాత్మక ఐదో సెట్లో సాధికారిక ప్రదర్శన చేసిన కామెరూన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరూన్‌ రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించగా.. నికోలస్‌ ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా నెగ్గలేదు. క్రోయేషియా వెటరన్‌ మారిన్‌ సిలిచ్‌పై ఫ్లావియో కొబాలి (ఇటలీ) నాలుగు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించాడు. 6-4, 6-4, 6-7(4-7), 7-6(7-3)తో ఫ్లావియో మెరిశాడు. తొలి రెండు సెట్లలో ఓడినా.. వరుస సెట్లను టైబ్రేకర్‌కు తీసుకెళ్లిన సిలిచ్‌ క్వార్టర్స్‌కు ముందే నిష్క్రమించాడు.
మహిళల సింగిల్స్‌లో లిండా నొస్కోవ (చెక్‌ రిపబ్లిక్‌) 2-6, 7-5, 4-6తో అమెరికా అమ్మాయి ఆమంద అనిసిమోవ చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్లో ఓడిన నోస్కోవ రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక సెట్లో ఆమంద మెప్పించింది. ఆరు ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో అనిసిమోవ క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. మరో మ్యాచ్‌లో స్విస్‌ అమ్మాయి బెలింద బెన్సిక్‌ 7-6(7-4), 6-4తో అలెగ్జాండ్రోవ (రష్యా)పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -