Tuesday, July 8, 2025
E-PAPER
Homeజాతీయంహక్కులు కాపాడేందుకే సమ్మె

హక్కులు కాపాడేందుకే సమ్మె

- Advertisement -

కార్మికులను బానిసలుగా మార్చడమే లేబర్‌ కోడ్ల లక్ష్యం
సమ్మెలో లక్షలాది మంది కార్మికులు
అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు
కేంద్ర కార్మిక సంఘాల నేతల స్పష్టం
17 డిమాండ్లతో సార్వత్రిక సమ్మె
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఈనెల 9న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మె దేశ కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడేందుకేననీ, ఇది పెద్ద ఆందోళనకు నాంది పలుకుతుందని కేంద్ర కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. లేబర్‌ కోడ్లతో కార్మికులను బానిసలుగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ చర్య అని విమర్శించారు. కేంద్ర కార్మిక సంఘాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కార్మిక చట్టాలను అమలు చేయాలనే నిర్ణయాలను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటం అవసరమైతే, దానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద కార్మిక సంఘాల నేతలు సంయుక్తంగా సమ్మెకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సార్వత్రిక సమ్మెలో వివిధ రంగాలకు చెందిన లక్షలాది మంది కార్మికులు పాల్గొంటారని తెలిపారు. రైల్వేలు, రోడ్డు రవాణా, ఓడరేవులు, విద్యుత్‌, రక్షణ, పోస్టల్‌, టెలికాం, బ్యాంకింగ్‌, బీమా, మైనింగ్‌, పెట్రోలియం, ఉక్కు రంగాలకు చెందిన కార్మికులతో పాటు అసంఘటిత రంగాల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. గ్రామాలు, నగరాల్లో సమ్మె విజయవంతానికి ఇప్పటికే సన్నాహాలు జరిగాయని పేర్కొన్నారు. రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, మేథావులు, ఉపాధ్యాయులు, కళాకారులు, రచయితలు, సామాజిక సంస్థలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాయని అన్నారు. దీంతో సమ్మెకు దేశవ్యాప్తంగా విశేష మద్దతు లభించిందని ప్రకటించారు.అన్ని రాష్ట్రాల్లోని యూనియన్లు సమ్మెకు నోటీసులు ఇచ్చిన తరువాత, కేంద్ర ప్రభుత్వం ట్రేడ్‌ యూనియన్లను చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. ప్రతి యూనియన్‌తో విడివిడిగా చర్చలు జరుపుతామని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొందనీ, అయితే, సమ్మె జరగకుండా చేసేందుకు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామనే అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అంతేతప్ప కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న డిమాండ్లపై, కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. గతంలో ట్రేడ్‌ యూనియన్లతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలు, వాగ్దానాలను కార్మిక మంత్రిత్వ శాఖ ఇంకా అమలు చేయలేదని తెలిపారు. సమ్మెను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యాలు ఏవైనా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతాయేమోనని కార్మికుల్లో ఉందనీ, అయితే వాటిని ఎదుర్కోవడానికి కార్మికులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని నేతలు స్పష్టం చేశారు.
కార్మికులకు తమ హక్కుల కోసం సమ్మె చేసే హక్కు ఉందని, ఆ హక్కు ఏ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి కాదని పేర్కొన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, అసమానత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశాన్ని ఈ విధ్వంసకర పాలన నుంచి రక్షించడానికి సార్వత్రిక సమ్మె గొప్ప శక్తిని అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు అశోక్‌ సింగ్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి హర్బజన్‌ సింగ్‌ సిద్ధూ, శత్రుజిత్‌ సింగ్‌ (యూటీయూసీ), రాజీవ్‌ దిమ్రి (ఏఐసీసీటీయూ), ధర్మేంద్ర (టీయూసీసీ), లతా సింగ్‌ (ఎస్‌ఈడబ్ల్యూఏ) తదితరులు పాల్గొన్నారు.కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక గతేడాది ఆగస్టు 28న కార్మిక మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చలలో అనేక సహేతుకమైన డిమాండ్లను లేవనెత్తింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సానుకూల చర్య తీసుకోలేదు. ఈ పరిస్థితిలో దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్టు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -