– ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం గతనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో నిర్వహించిన ఐసెట్ రాతపరీక్షల ఫలితాలను సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, ఎంజీయూ వీసీ ఖజాఅల్తాఫ్ హుస్సేన్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసెట్‌కు 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 64,938 మంది హాజరయ్యారని వివరించారు. వారిలో 58,985 (90.83 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. అబ్బాయిలు 34,412 మంది దరఖాస్తు చేస్తే 30,868 మంది పరీక్ష రాశారని అన్నారు. వారిలో 27,998 (90.7 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. 37,333 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 34,069 మంది పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 30,986 (90.95 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని అన్నారు. ట్రాన్స్‌జెండర్‌కు సంబంధించి ఒకరు దరఖాస్తు చేస్తే ఆ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ర్యాంకు కార్డుల కోసం https://icet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఐసెట్ కన్వీనర్ అలువాల రవి తదితరులు పాల్గొన్నారు.
