– పరికరాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ
– అవసరమైన పరికరాల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు : మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న టిమ్స్, హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మెడికల్, డయాగస్టిక్స్ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ కొనుగోలు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త ఆస్పత్రులపై సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ వైద్యసేవల మౌలిక సదుపాయాల సంస్థ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వినియోగిస్తున్న ఎక్విప్‌మెంట్ ఏంటో డాక్టర్లను అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫర్నీచర్ కొనుగోలు చేయాలని కోరారు. కొత్త ఆస్పత్రులకు రోగులు ఎక్కువగా వచ్చే అవకాశ ముందనీ, ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫర్నీచర్, ఎక్విప్‌మెంట్ సరిపడా ఉండాలని తెలిపారు. కొనే ప్రతి వస్తువుకూ వారంటీ ఉండాలనీ, నిర్వహణ విషయంలో సప్లయర్లను బాధ్యులుగా చేయాలని చెప్పారు. ఒక్క వస్తువు కూడా రిపేర్‌లో లేదా నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉండకూడదని తేల్చి చెప్పారు. అవసరమైన చోట ఎంఆర్‌ఐ యంత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఎంఆర్‌ఐ మిషన్ల కొనుగోలు, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని హెల్త్ సెక్రెటరీకి సూచించారు. టీజీఎంఎస్‌ఐడీసీ హెడ్డాఫీసులో ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీజీఎంఎస్‌ఐడీసీలో ఎక్విప్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్‌గా సీనియర్ బయోమెడికల్ ఇంజనీర్‌ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సబ్ యూనిట్లను ఏర్పాటు చేయాలనీ, అవసరాన్ని బట్టి ప్రతి సబ్ యూనిట్‌లో ఒకరిద్దరు బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని ఆదేశించారు. ఎక్విప్‌మెంట్ మెయింటెనన్స్ విషయంలో ఆస్పత్రుల్లో పని చేసే టెక్నీషియన్లకు, ఎలక్ట్రీషియన్లకు బేసిక్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. మిషన్ రిపేర్ వచ్చిన గంటలోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ సబ్ యూనిట్‌కు, హెడ్ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సూపరింటెండెంట్ నుంచి సమాచారం వచ్చిన 6 గంటల్లోపల బయోమెడికల్ ఇంజనీర్ ఆ ఆస్పత్రిని సందర్శించి, సమస్య ఏంటో గుర్తించాలన్నారు. మైనర్ రిపేర్లు ఉంటే ఆస్పత్రి స్థాయిలో ఒక్కరోజులోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కొత్త సిస్టమ్ ఉండాలని మంత్రి ఆదేశించారు. మేజర్ రిపేర్లు ఉంటే మూడ్రోజుల్లోపల ఆ సమస్యను పరిష్కరించి, యంత్రాన్ని వర్కింగ్ కండీషన్‌లోకి తీసుకురావాలని కోరారు. ఒకవేళ ఏవైనా స్పేర్ పార్ట్స్ అవసరమైతే, వెంటనే సంబంధిత ఎక్విప్‌మెంట్ సప్లయర్‌కు సమాచారం ఇచ్చి దాన్ని రిపేర్ చేయించాలన్నారు. ఎక్విప్‌మెంట్ పూర్తిగా ఉపయోగంలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్ సూపరింటెండెంట్లదేనని స్పష్టం చేశారు. ప్రతి యంత్రం, ఫర్నీచర్ పేషెంట్లకు ఉపయోగపడేలా చూసుకోవాలని మంత్రి సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్పిటల్ స్థాయిని బట్టి, ఏ హాస్పిటల్‌లో ఏయే ఎక్విప్‌మెంట్ ఉండాలో ఒక స్టాండర్డ్ లిస్ట్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్ర కుమార్, వీవీపీ కమిషనర్ అజరు కుమార్ సభ్యులుగా కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అన్ని హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానాల్లో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్‌వోడీల నుంచి వివరాలపై మంత్రి ఆరాతీశారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా? లేవా? అని డీఎంఈ, వీవీపీ కమిషనర్, డీహెచ్‌ను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనీ, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో కనీసం 3 నెలలకు సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్స్‌లో ఉన్న ప్లేట్‌లెట్ సెపరేషన్ మిషన్లు వర్కింగ్ కండీషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీ డయాగస్టిక్స్ హబ్స్‌లో అన్నిరకాల టెస్టులు, స్కాన్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక్క టెస్టు కోసం కూడా పేషెంట్‌ను బయటకు పంపించొద్దన్నారు. ప్రతి పీహెచ్‌సీలోనూ టెస్టులు అవసరమైన పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించాలనీ, 24 గంటల్లో రిపోర్టులు అందజేయాలని మంత్రి ఆదేశించారు. గతేడాది కొత్తగా ప్రతి జిల్లాలోనూ మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామనీ, ఆయా స్టోర్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లో బిల్డింగుల నిర్మాణాన్ని ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.