Tuesday, July 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్‌ ఫీజులపై సీఎస్‌ నేతృత్వంలో కమిటీ

ఇంజినీరింగ్‌ ఫీజులపై సీఎస్‌ నేతృత్వంలో కమిటీ

- Advertisement -

కాలేజీ యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సహా వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ) ప్రతినిధులు భట్టి విక్రమార్కతో సమావేశాన్ని నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళికతో నిధులను సమకూర్చుకునే విధానంపై కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఏటీహెచ్‌ఐ చైర్మెన్‌ రమేష్‌ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతిభ ఉన్న విద్యార్థులతోపాటు అధ్యాపకులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల తెలంగాణకు కలిగే నష్టం గురించి వివరించారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని కోరారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిబంధనలను సరిగ్గా అమలు చేయలేదని అన్నారు. యాజమాన్యాలను పక్షపాత ధోరణితో చూసిందని ఆరోపించారు. కొన్ని యాజమాన్యాల ప్రతినిధులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఏండ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందన్నారు. దీంతో చాలా కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూసే పరిస్థితికి వచ్చాయని వివరించారు. కావాలనే ఫీజులను విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు. కాలేజీలకు టోకెన్లు ఇచ్చిన రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని సూచించారు. గత విద్యాసంవత్సరంలోని ఫీజు రీయింబర్స్‌్‌మెంట్‌ను ఆర్నెల్లలోగా విడుదల చేయాలని చెప్పారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్త నిబంధనలను అమలు చేయాలన్నారు. అక్టోబర్‌ 30 నాటికి దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. డిసెంబర్‌ 31 నాటికి మొదటి క్వార్టర్‌, మార్చి 31 నాటికి రెండో క్వార్టర్‌, జూన్‌ 30 నాటికి మూడో క్వార్టర్‌, సెప్టెంబర్‌ 30 నాటికి చివరి క్వార్టర్‌ నిధులను విడుదల చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయాలని కోరారు. కొత్త ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొత్త విధానాన్ని రూపొందించాలని వివరించారు. సీడ్‌ ఫండ్‌ రూ.1,500 కోట్లు కేటయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.300 కోట్లు వస్తాయని చెప్పారు. వ్యాపార సంస్థలపై విధించిన సెస్‌ ద్వారా రూ.375 కోట్లు వస్తాయని వివరించారు. విద్యాసంస్థలు కార్పస్‌ ఫండ్‌ కోసం రూ.389 కోట్లు ఇవ్వాలని అన్నారు. హాస్టళ్ల లీగలైజేషన్‌, కార్పస్‌ ఫండర్‌ డిపాజిట్‌ కోసం 50 కోట్లు ఇలా వివిధ పేర్లతో నిధులను సేకరించాలని కోరారు. ఈ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండబోదని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ కె రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు ప్రదీప్‌రెడ్డి, కొడాలి కృష్ణారావు, నాగయ్య చౌదరి, రవి కెఎస్‌, రవీందర్‌రెడ్డి, కె రాందాస్‌, పి రమేష్‌బాబు, పరమేశ్వర్‌రెడ్డి, సునీత భూపాల్‌రెడ్డి, సత్యనారాయణ, మహమ్మద్‌ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -