– చేరేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు
– ఇప్పటి వరకు 1.41 లక్షల మంది ప్రవేశం
– డిగ్రీ కాలేజీల్లో మిగిలిన సీట్లు 2.95 లక్షలు
– 64 కళాశాలల్లో సున్నా ప్రవేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తిని కనబరచడం లేదు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. దీంతో డిగ్రీ కాలేజీలు వెలవెలబోతున్నాయి. 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 957 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 4,36,947 సీట్లున్నాయి. ఇప్పటి వరకు కేవలం 1,41,590 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 32.40 శాతం సీట్లలో విద్యార్థులు చేరారు. డిగ్రీ కాలేజీల్లో ఇంకా 2,95,357 (67.60 శాతం) సీట్లు మిగిలాయి. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) పరిధిలో 820 కాలేజీలున్నాయి. వాటిలో 3,76,596 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ మూడో విడత ప్రవేశాలు పూర్తయ్యే నాటికి 1,20,712 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే 32.02 శాతం సీట్లలో మాత్రమే విద్యార్థులు చేరారు. ఇంకా 2,56,244 (67.98 శాతం) సీట్లు మిగిలే ఉన్నాయి. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైనా డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. అయితే ఎప్‌సెట్ ఇంజినీరింగ్, బైపీసీ విద్యార్థులకు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తయ్యాక సీట్లు రాని విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశమున్నది. అప్పుడు ప్రవేశాల సంఖ్య కొంత మేరకు పెరగనుంది. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ, 63 ప్రయివేటు కాలేజీలు కలిపి మొత్తం 64 డిగ్రీ కాలేజీల్లో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఆ కాలేజీల్లో 20,260 సీట్లున్నాయి. అత్యధికంగా కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) పరిధిలో 22 కాలేజీలు ఉంటే, అత్యల్పంగా శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ) పరిధిలో కేవలం మూడు కాలేజీలే ఉన్నాయి.
డిగ్రీ గురుకులాలకూ ఆదరణ కరువు
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ గురుకుల కాలేజీలకు మంచి గుర్తింపు ఉన్నది. అయితే వాటిలోనూ చేరడానికి విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలు 28, గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలు 22, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు 29 కలిపి మొత్తం 79 కాలేజీల్లో 23,354 సీట్లున్నాయి. ఇప్పటి వరకు 9,176 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారు. అంటే 39.29 శాతం మంది చేరారు. డిగ్రీ గురుకుల కాలేజీల్లో ఇంకా 14,178 (60.71 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీలతోపాటు గురుకుల డిగ్రీ కాలేజీలకూ ఆదరణ కరువైందని ఈ గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
దోస్త్ పరిధిలో లేని కాలేజీల్లోనూ చేరడం లేదు
రాష్ట్రంలో దోస్త్ పరిధిలో లేకుండా కోర్టు ఆదేశాలతో 58 కాలేజీలు నడుస్తున్నాయి. అయితే వాటిలో నాణ్యమైన విద్య అందుతుందనీ, ఎక్కువ మంది విద్యార్థులు చేరతారన్న అభిప్రాయమున్నది. కానీ ఆ కాలేజీ పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారింది. 58 కాలేజీల్లో 36,637 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 11,702 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అంటే 31.94 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 24,935 (68.06 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి.
డిగ్రీలో బీకాం కోర్సుకే డిమాండ్
ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) కోర్సుకు, డిగ్రీలో బీకాం కోర్సుకు డిమాండ్ ఉన్నది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీలో 1,41,590 మంది ప్రవేశాలు పొందారు. బీకాం కోర్సులో 1,51,839 సీట్లుంటే, 54,771 (36.07 శాతం) మంది విద్యార్థులు చేరారు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులో 27,059 మంది చేరారు. బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులో 25,130 మంది ప్రవేశం పొందారు. బీఏలో 19,104 మంది చేరారు. బీబీఏలో 11,462 మంది, బీసీఏలో 3,893 మంది, డిప్లొమా కోర్సుల్లో 87 మంది, బీబీఎంలో 68 మంది, బీఎస్‌డబ్ల్యూలో 16 మంది చొప్పున ప్రవేశం పొందారు. అయిఏ బీ ఒకేషనల్ కోర్సులో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
డిగ్రీ ప్రవేశాలు పెరిగేలా చూస్తాం : బాలకిష్టారెడ్డి
డిగ్రీ ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ వి బాలకిష్టారెడ్డి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా చూస్తామన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీ సిలబస్‌ను మార్చామని అన్నారు. క్రెడిట్ల విధానంలోనూ మార్పులు తెచ్చామని వివరించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను అమలు చేస్తామన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రవేశాలతోపాటు పరీక్షలను సకాలంలో నిర్వహిస్తామని చెప్పారు.