Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు చిరంజీవి 
కాటాపూర్ కరపత్రం ఆవిష్కరణ 
నవతెలంగాణ – తాడ్వాయి 

జూలై 9 బుధవారం జరుగు జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘములు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‌.. భారత రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించాలని, ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ వ్యాఖ్యానించడం దేశ ప్రజలందరినీ అవమానించినట్లేనని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం రద్దుకు ఆర్ఎస్ఎస్, బిజెపి కుట్రలు చేస్తున్నాయని, బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులపై క్రూర దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు.

ఈ అమానవీయ సంఘటనలతో దేశం సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ఇద్దరు దళిత యువకులు  ఆవు దూడలను తీసుకెళ్తుండగా గోరక్షక దళాల ముసుగులో ఆర్ఎస్ఎస్ మతోన్మాద గుండాలు అమానవీయ చర్యలకు ఒడిగట్టారని అన్నారు. అర గుండు కొట్టించి బలవంతంగా మురుగునీటిలో ముంచి మోకాళ్ల పై ఊరిలో నడిపించడం, గడ్డి తినిపించడం వంటి చిత్రహింసల పాలు చేశారని చెప్పారు. గోరక్షక దళాలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని, గోరక్షక దళాలను తక్షణమే నిషేధించాలన్నారు.

ఆ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోరక్షక దళాలు ఆర్ఎస్ఎస్ ప్రోత్బలంతోనే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని అన్నారు. 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత మధ్య యుగాల కాలంనాటి శిక్షలను ఇంకా ఈ దేశం భరించాలా ? అని ప్రశ్నించారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అట్టడుగు వర్గాల పై జరుగుతున్న ఈ అమానవీయ సంఘటనలను అందరూ ఐక్యంగా ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ క్రింద 19 వేల మంది దళిత విద్యార్థులకు రూ.154 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజుల పని దినాలు కల్పిస్తూ రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ తో పాటు, రాజ్యాంగ రక్షణ రిజర్వేషన్ల పరిరక్షణ ప్రభుత్వ సంస్థల పరిరక్షణ కోసం జూలై 9న దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మేలో సామాజిక శక్తులు, దళిత సంఘాలు, మేధావులు సమైక్యంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, హమాలీ సంఘం నాయకులు చిట్టినేని శ్రీనివాస్, పల్నాటి సత్యం, బొప్పారం బాబు, నర్సింలు, గోగు నరేష్, అబ్బు పుల్లయ్య, తోట శోభన్, పాయం మహేందర్, నెల్లుట్ల మొగిలి, రవి తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -