నేడు జాతీయ సార్వత్రిక సమ్మె
మోడీ సర్కార్ విధానాలపై సమర భేరి
ఆందోళనలతో హోరెత్తనున్న భారతావని
భాగస్వాములుకానున్న 30 కోట్ల మంది శ్రామికులు
న్యూఢిల్లీ : భారతావనిలో నేడు ఓ చారిత్రక, అసాధారణ నిరసన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద సమ్మెలలో ఇది ఒకటిగా నిలువబోతోంది. సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు, కర్షకులతో సహా యావత్ భారతదేశం కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున వీధులలోకి రాబోతున్నారు. సార్వత్రిక సమ్మెతో ప్రజా జీవనం స్తంభించబోతోంది. ప్రభుత్వ-ప్రయివేటు రంగ పారిశ్రామిక యూనిట్లు, బ్యాంకులు, బీమా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, గిగ్ వర్కర్లు, లక్షలాది మంది ఇతర శ్రామికులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయబోతున్నారు. ధర్నాలు, బహిరంగ సభలు, ప్రదర్శనలతో ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు అన్ని వర్గాలూ సంసిద్ధమవుతున్నాయి. దేశంలోని పలు జిల్లాల్లో అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలోని వివిధ వర్గాల పట్ల కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న విధానాలపై వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆగ్రహం, అసమ్మతి సార్వత్రిక సమ్మె ద్వారా బహిర్గతం కాబోతోంది. పెరుగుతున్న నిరుద్యోగం, జీవన వ్యయం, ఎదుగూ బొదుగూ లేని ఆదాయాలతో ప్రజలు విసిగివేసారి పోయారు. కార్పొరేట్ రంగానికి పాలకపక్షాలు తాయిలాలు అందిస్తూ, శ్రమ దోపిడీకి వీలుగా అపరిమిత హక్కులు కల్పిస్తున్నాయి. శ్రమజీవుల చట్టపరమైన పరిష్కారాలు, హక్కులను పరిమితం చేస్తూ, వివిధ రూపాల్లో అణచివేస్తున్నాయి. ఫలితంగా దేశంలో ప్రజల మధ్య తీవ్ర ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయి.
వీరంతా భాగస్వాములే…
కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంస్థలు, ఆయా రాష్ట్రాల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, పౌరసమాజ సంఘాలు ఉమ్మడి వేదికగా ఏర్పడి కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఈ వేదిక కొన్నేండ్లుగా పలు సందర్భాల్లో విజయవంతమైన సమ్మెలు, నిరసనలు నిర్వహించింది. సంయుక్త కిసాన్ మోర్చాకు ఘనమైన చరిత్ర ఉంది. మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయోత్పత్తులకు మెరుగైన ధరల కోసం 2020-21లో చేపట్టిన అద్భుతమైన, విజయవంతమైన నిరసనలకు నాయకత్వం వహించింది. ఇది రైతులు, వ్యవసాయ కార్మికలతో ఏర్పడిన శక్తివంతమైన కూటమి.
ఇవీ డిమాండ్లు
దేశంలోని పాలకపక్షాల ముందు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న సంఘాలు పలు డిమాండ్లను ఉంచాయి. వాటిని పరిష్కరించేవరకు అన్ని వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాయి. నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లకు నెలకు రూ. 26 వేలు కనీస జాతీయ వేతనం ఇవ్వాలని కోరుతున్నాయి. ఔట్‌సోర్సింగ్, స్థిరకాల ఉపాధి, అప్రెంటీస్‌లు, ట్రెయినీలు…ఇలా ఏ రూపంలో ఉన్నా, పనుల్ని రద్దు చేయకూడదనీ, వారందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతున్నాయి. నెలవారీ కనీస పెన్షన్ రూ.9 వేలు అందించాలనీ, అన్ని వర్గాలకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంటి పనివారు, నిర్మాణ, వ్యవసాయ, వలస కార్మికులు, స్కీమ్ వర్కర్లు, దుకాణాలు, ప్రయివేటు సంస్థల్లో పని చేసేవారు, లోడింగ్-అన్ లోడింగ్ కార్మికులు, గిగ్ వర్కర్లు, సాల్ట్ పాన్ కార్మికులు, బీడీ, కల్లుగీత, రిక్షా, ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లు, కార్మికులతో పాటు వృత్తిదారులు సహా అందరూ ఈ సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు.
వారి డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనీ, జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్), ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బోనస్, ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులకు సంబంధించిన పరిమితులన్నింటినీ తొలగించాలనీ, గ్రాట్యుటీ పరిమాణాన్ని పెంచాలని కోరుతున్నారు. కార్మిక సంఘాలను దరఖాస్తు చేసిన 45 రోజుల్లో రిజిస్టర్ చేయాలనీ, నిర్వహణ, బేరసారాలకు సంబంధించి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) కన్వెన్షన్లు సి-87, సి-98లను తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు.
ధరల పెరుగుదలను నియంత్రించి, ఆహారం, మందులు, వ్యవసాయ వనరులు, యంత్రాలు వంటి అత్యవసర వస్తువులపై జీఎస్టీని రద్దు చేయాలని కోరుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలనీ, ఆహార భద్రతకు హామీ ఇచ్చి, ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విభాగాల ప్రయివేటీకరణను నిలిపేయాలనీ, నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపీ)ను రద్దు చేయాలని కోరుతున్నారు. ఖనిజాలు, లోహాల మైనింగ్‌కు సంబంధించిన చట్టాల్ని సవరించాలనీ, ఆదివాసీలు, రైతులకు బొగ్గు, ఇతర గనుల లాభాల్లో 50 శాతం వాటాను అందించాలని కోరుతున్నారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, ఎరువులు, విద్యుత్ తదితరాలపై రైతులకు చట్టపరమైన హామీ, ఇన్‌పుట్ సబ్సిడీలు పెంచి ఇవ్వాలని కోరుతున్నారు. సమగ్ర రుణ మాఫీ, పంట బీమా పథకాలు అమలు చేయాలనీ, చారిత్రక రైతుల ఆందోళనను నిలిపివేసిన సమయంలో ఎస్కేఎమ్‌కు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లోని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని, ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని ఆయా కార్మిక, ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజుకు రూ.600 వేతనం ఇచ్చి, పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ ఉచిత విద్య, ఆరోగ్యం, నీరు, గృహవసతి, పారిశుధ్య హక్కుల్ని గ్యారంటీలుగా ఇవ్వాలని కోరుతున్నారు. అటవీ హక్కుల చట్టం అమలు, 2023నాటి అటవీ సంరక్షణ, జీవ వైవిధ్య చట్టాల్లోని నిబంధనల్లో సవరణలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
వ్యవసాయదారులకు భూమి హక్కు, నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ఈఎస్‌ఐ కవరేజీ కల్పించాలనీ, ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికులందరికీ ఆరోగ్య పథకాలు, ప్రసూతి ప్రయోజనాలు, జీవిత-వైకల్య బీమా కవరేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వలస కార్మికుల కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలనీ, అత్యంత సంపన్నులపై కార్పొరేట్ పన్నును పెంచాలనీ, సంపద, వారసత్వ పన్నులను తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతిని తెలియజేసే హక్కు, మత స్వేచ్ఛ, విభిన్నమైన సంస్కృతులు, భాషలు, చట్టం ముందు సమానత్వం, దేశ ఫెడరల్ వ్యవస్థ తదితరాలపై దాడులు జరగకుండా నిరోధించాలని పై సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మెలో దాదాపు 30 కోట్లమందికి పైగా భాగస్వాములు అవుతారని ఆయా సంఘాల నేతలు చెప్పారు.
విస్తృత మద్దతు
సమ్మెకు దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభిస్తున్నది. నరేగా సంఘర్ష్ మోర్చా, భూమి అధికార్ ఆందోళన్, ఆహార భద్రతకు సంబంధించిన సంస్థలు, దళిత, ఆదివాసీ సంఘాలు సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు అవుతున్నాయి. వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఆ పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు సమ్మెను జయప్రదం చేసేందుకు విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సమ్మెను సమర్ధించాయి.