Wednesday, July 9, 2025
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగంతోనే సామాజిక న్యాయం

రాజ్యాంగంతోనే సామాజిక న్యాయం

- Advertisement -

– మహారాష్ట్ర అసెంబ్లీ సన్మానంలో సీజేఐ జస్టిస్‌ గవాయ్‌
– దేశంలో అన్నింటికన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనదని అంబేద్కర్‌ చెప్పారంటూ వ్యాఖ్య
నాగ్‌పూర్‌:
రాజ్యాంగం ద్వారానే పౌరులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం దక్కుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. దేశంలో అన్నింటికన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనదని చెప్పిన అంబేద్కర్‌, న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా స్వేచ్ఛగా ఉండాలని ఆకాంక్షించారన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరుల హక్కులను కాపాడేందుకు న్యాయవ్యవస్థ కాపలా ఉండాలని అంబేద్కర్‌ తెలిపారని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో మనందరినీ రాజ్యాంగం ఐక్యంగా ఉంచుతుందని అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారని చెప్పారు. రాజ్యాంగం నిశ్చలంగా ఉండదనీ, ఎప్పుడూ మారుతూ ఉంటుందని ఆయన అన్నారన్నారు. దేశాన్ని పాలించేవారు కుల, మతాలను దాటి కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని సూచించినట్టు తెలిపారు.


మహారాష్ట్ర అసెంబ్లీ సన్మానం
అంతకుముందు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ సన్మానించింది. అత్యున్నత న్యాయ పీఠాన్ని అందకున్న ఆయనను అభినందిస్తూ మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జస్టిస్‌ గవారును శాసనసభ తరఫున ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సన్మానించారు.


రెండో దళిత వ్యక్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ రికార్డు
జస్టిస్‌ భూషణ్‌ రామకష్ణ గవారు 1960 నవంబర్‌ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. సీజేఐ జస్టిస్‌ గవారు తండ్రి ఆర్‌ఎస్‌ గవారు బిహార్‌, కేరళ గవర్నర్‌గా పనిచేశారు. అంబేద్కర్‌ వాది అయిన ఆర్‌ ఎస్‌ గవాయ్‌ పార్లమెంట్‌ సభ్యులుగా కూడా పనిచేశారు. 1985లో లా ప్రాక్టీస్‌ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్‌ న్యాయవాదులతో కలిసి పనిచేసి అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఆ తర్వాత మునిసిపల్‌ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

నాగ్‌పూర్‌ బెంచ్‌లో కెరీర్‌ ప్రారంభించిన ఆయన తన పట్టుదలతో సీజేఐ స్థాయి వరకు ఎదిగారు. జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ రికార్డు సాధించారు.
700 ధర్మాసనాల్లో భాగస్వామి
2000లో అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అనంతరం నాగ్‌పూర్‌ బెంచ్‌లో ప్రభుత్వ ప్లీడర్‌ అయ్యారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2025 మే 14న భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఆయన పదవీకాలం 2025 నవంబర్‌ 23వరకు ఉంటుంది. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ గవారు ఆరేండ్ల కాలంలో సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. అనేక సంచలన కేసుల తీర్పుల్లో భాగస్వామిగా జస్టిస్‌ గవారు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -