– గతం కంటే మెరుగుపడిన వైనం
– ప్రయివేటు స్కూళ్ల కంటే రాణించిన సర్కారు బడుల విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ (పీఆర్‌ఎస్-2025)లో తెలంగాణ స్థానం మెరుగైంది. మంగళవారం కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలంగాణ 26వ స్థానంలో నిలిచింది. 2021లో 36వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. మూడు, ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తారు. గతేడాది డిసెంబర్ నాలుగో తేదీన న్యాస్ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,342 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. భాషలు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రశ్నలుంటాయి. భాషలు, మ్యాథ్స్‌లో మూడో తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ప్రయివేటు పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కంటే రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు రాణించారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడడానికి విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించడం వల్లే సాధ్యమైందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ తెలిపారు. న్యాస్ సర్వేలో ఏపీ కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. ఈ సర్వేలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి. మూడో తరగతిలో తెలంగాణ 26వ స్థానంలో ఉంటే, ఏపీ 13వ స్థానంలో నిలిచింది. ఆరో తరగతిలో తెలంగాణ 26వ స్థానంలో నిలవగా, ఏపీ 33వ స్థానంలో ఉన్నది. తొమ్మిదో తరగతిలో తెలంగాణ 17వ స్థానంలో ఉండగా, ఏపీ 29వ స్థానంలో నిలిచింది. అయితే ఉత్తమ ఫలితాలు సాధించిన టాప్ పది రాష్ట్రాల్లో, తక్కువ సామర్థ్యం సాధించిన అట్టడుగున ఉన్న పది రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లేకపోవడం గమనార్హం.
అది టీచర్ల విజయమే : ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ఉపాధ్యాయుల విజయమేనని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. 2021లో 36వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 26వ స్థానానికి రావడం గర్వించదగ్గ పరిణామమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రయివేటు పాఠశాలలతో పోటీగా ప్రభుత్వ స్కూళ్లు ప్రతిభను కనబర్చాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను మరింత ప్రోత్సహిస్తే రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసేలా విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లోనూ పాఠశాల విద్య మరింత మెరుగవ్వాలని ఆకాంక్షించారు. ఆ దిశగా అవసరమైన తోడ్పాటును ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు.