రూ.150 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర సర్కారు
నేడు పంచాయితీల ఖాతాల్లో జమ..
ఆ తర్వాత ఒకటెండ్రు రోజుల్లో జీతాల అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన వేతనాలను మంగళవారం విడుదల చేసింది. దానికి సంబంధించి రూ.150 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. బుధవారం గ్రామపంచాయతీ ఖాతాల్లో ఆ వేతనాలు జమకానున్నాయి. ఆ తర్వాత ఒకటెండ్రు రోజుల్లో మూడునెలల జీతాలను మల్టీ పర్పస్ కార్మికులు అందుకోనున్నారు. దీని వల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న 53 వేల మంది మల్టీపర్పస్ ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నది.
తమ పోరాటాల ఫలితంగానే బకాయి వేతనాలు విడుదల : సీఐటీయూ
తమ పోరాటాల ఫలితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన మూడు నెలల పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, అధ్యక్షులు గ్యార పాండు, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, కార్యదర్శి పి.సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను ఇవ్వాలనీ, ఆన్‌లైన్‌ల్లో నమోదు కాకుండా మిగిలి పోయిన సిబ్బంది పేర్లను నమోదు చేయాలనీ ఇటీవల హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. వేతనాలు చెల్లించకుంటే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించిన నేపథ్యంలోనే ప్రభుత్వం దిగొచ్చిందని తెలిపారు. ఇక నుంచి ప్రతి నెలా వేతనాలను గ్రీన్‌చానల్ ద్వారా అందజేయాలని విన్నవించారు. వేతనాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.