Wednesday, July 9, 2025
E-PAPER
Homeజిల్లాలు4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సీఐటీయూ

4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సీఐటీయూ

- Advertisement -

29 రకాల కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి-  సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్
దేశవ్యాప్త సమ్మె సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో దుబ్బాకలో భారీ ర్యాలీ, మహా ధర్నా
నవతెలంగాణ – దుబ్బాక

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో గాంధీ విగ్రహం నుంచి మార్కెట్ వరకు వివిధ మండలాలకు చెందిన కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ చౌరస్తా వద్ద అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి జీ.పద్మ అధ్యక్షతన నిర్వహించిన భారీ బహిరంగ సభ కు సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి.. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

ఈ చర్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)సీ, ఆర్టికల్ 21, 24, 39(డీ)కి విర్దుమైనవన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతూ సమ్మె హక్కును సైతం కోల్పోతారని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారని, కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ జాతీయ స్థాయిలో కనీస వేతనం నెలకు రూ.26000 లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

ఔట్ సోర్స్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అప్రెంటిస్ లు, ట్రైనీలు వంటి రూపాలలో వివిధ పథకాల క్రింద పనిచేస్తున్న కార్మికులెవరినీ క్యాజువలైన్ చేయరాదని, కాంట్రాక్ట్ కార్మికులకు సమానమైన పనికి సమాన వేతనం అమలు చేయాలని, నెలకు కనీస పెన్షన్ రూ.9000లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక పరిశ్రమల్లో, రంగాల్లో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యూటీ, ఈఎస్ఐ చట్టాలలో అనేక మార్పులు చేస్తూ కార్మికులను, ఉద్యోగులను ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. బీడీ రంగాల్లో పనిచేసే కార్మికులకు రిటైర్మెంట్ పెన్షన్ నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, భవన నిర్మాణరంగ కార్మికులకు 1966 సెస్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్దరించి,ఎస్పీఎస్, యూపీఎస్ ను రద్దు చేయాలని, బోనస్, ప్రావిడెంట్ ఫండ్ యొక్క చెల్లింపు అర్హతపై అన్ని సీలింగ్ లను తొలగించి గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యుత్ (సవరణ) బిల్లు 2022 ను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్.లక్ష్మీ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బీ.ప్రవీణ, వివిధ రంగాల కార్మికులు నాగరాణి, దీన, భూలక్ష్మి, శ్యామల, వసంత ,రమా, కవిత ,విజయ, భాగ్యలక్ష్మి, కవిత, మంజుల ,ప్రశాంత్, శ్రీనివాస్ ,బత్తుల రాజు, సాజిద్ ,ఎల్లం,అంజయ్య, మాణిక్యం, నర్సింలు, జమున, మహేష్, బాలమణి, షాహిన్, లక్ష్మీ, బాలరాజు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ ,భవన నిర్మాణం, బీడీ, ఐకేపీ, వీవోఏ, మెప్మా ఆర్పీలు, వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -