Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలకు సిద్ధమవ్వాలి..

హక్కుల సాధన కోసం ఐక్యపోరాటాలకు సిద్ధమవ్వాలి..

- Advertisement -

– వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను కొనసాగించాలి
– మీడియా రంగంలో పెట్టుబడిదారుల ఎంట్రీతో తీవ్ర నష్టం
– జర్నలిస్టులకు వేజ్ బోర్డు అమలు చేయాలి
-టి డబ్ల్యు జె ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి బసవ పున్నయ్య

నవతెలంగాణ- హైదరాబాద్: హక్కుల సాధన కోసం జర్నలిస్టులు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TWJF) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య పిలుపునిచ్చారు. 44 కార్మిక చట్టాలతో పాటు రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల రద్దుకి నిరసనగా కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె కు సంఘీభావం గా బుధవారం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం హెచ్ యు జే అధ్యక్షులు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిధి మామిడి సోమయ్య మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. ఎన్నో ఏండ్లుగా వర్కింగ్ జర్నలిస్టు చట్టం అమలులో ఉందనీ, దాన్ని రద్దు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు వేజ్ బోర్డు అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల పట్ల వివక్ష చూపటం మంచిది కాదని మామిడి సోమయ్య అన్నారు.


మీడియాలో కార్పొరేట్లు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, జర్నలిస్టుల హక్కులు హరించి వేస్తున్నారని బసవ పున్నయ్య అన్నారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు కూడా అమలు కావటం లేదన్నారు. ప్రజాసమస్యలపై అధ్యయనం, హక్కుల సాధన దిశగా జర్నలిస్టులు ముందుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. హెచ్ యు జే అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టు చట్టం రద్దు ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.


జర్నలిస్టు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టి డబ్ల్యూ జె ఎఫ్ ఉపాధ్యక్షులు పి ఆనందం, బి రాజశేఖర్, కార్యదర్శులు ఇ.చంద్ర శేఖర్, సలీమా, గండ్ర నవీన్, హెచ్ యు జే కార్యదర్శి జగదీశ్వర్, నాయకులు నాగవాణి, మధుకర్, విజయ, మాధవ రెడ్డి, కాలేబ్, వీరేశ్,వెంకట స్వామీ, సీనియర్ జర్నలిస్టులు రత్నాకర్ సురేష్,భాస్కర్, శశికళ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ యు జె, ఫెడరేషన్ కు సీఐటీయూ ధన్యవాదాలు
కార్మికుల సార్వత్రిక సమ్మెకు సంఘీభావం తెలిపిన హెచ్ యు జే, టి డబ్ల్యు జే ఎఫ్ సంఘాలకు సి ఐ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మిక సంఘాల తరుపున ధన్యవాదాలు తెలిపారు. కార్మిక చట్టాలతో పాటు వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను సైతం కేంద్రం రద్దు చేస్తోంద నీ, దీన్ని సంఘటితంగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -