Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంత్యక్రియలు చేయలేక అల్లాడిన కుటుంబం.. అండగా నిలిచిన గ్రామస్తులు

అంత్యక్రియలు చేయలేక అల్లాడిన కుటుంబం.. అండగా నిలిచిన గ్రామస్తులు

- Advertisement -

– మానవత్వం చాటిన కొండూరు గ్రామస్తులు
– ఒక్క మెసేజ్ తో స్పందించి ముందుకు వచ్చిన దాతలు
– కుల మతాలకతీతంగా అత్యక్రియలో పాల్గొన్న గ్రామస్తులు
నవతెలంగాణ – రాయపర్తి

బిక్షాటనే జీవనాధారం.. రెక్కాడితే కానీ డొక్క నిండని బతుకులు.. ఈర్ష ద్వేషాలు అంటేనే ఎరుగని బతుకుల్లో ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తి అకాల మరణం చెందడంతో అంత్యక్రియలు చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుడుగ జంగాల తెగకు చెందిన ఓ కుటుంబం తరతరాలుగా గ్రామాల్లో సంచరిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి వారికి కొండూరు గ్రామం శాశ్వత జీవనాధారంగం మారిపోయింది.

దాంతో జంగాల కుమార్ (50) అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, కుటుంబ సభ్యులు కొండూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఖాళీ స్థలంలో డేరాలు ఏర్పాటు చేసుకొని గత 20 సంవత్సరాలుగా బతుకు బండిని లాగిస్తున్నారు. గ్రామంలోనే ఉంటూ అందరితో తల్లో నాలుకల ఆప్యాయంగా పలకరిస్తూ చిన్నచింతకా పనులు చేస్తూ,  భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జీవితం సజావుగా సాగుతున్న వేళ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమార్ అనారోగ్యం పాలయ్యాడు. దురదృష్టవశాత్తు మంగళవారం రాత్రి ఆకాల మరణం చెందాడు. ఏం చేయాలో తెలియని బాధిత కుటుంబ సభ్యులు శవాన్ని రోడ్డు పక్కనే పెట్టుకొని గుండెలు అవిసెలా విలపించారు.

తదుపరి బుధవారం రోజు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితుల్లో అల్లాడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువకుడు పంతంగి వేణు “పురిటి గడ్డ కొండూరు” అనే వాట్సాప్ గ్రూపులో పరిస్థితిని వివరిస్తూ మెసేజ్ చేశాడు. వెంటనే స్పందించిన యువత, గ్రామ పెద్ద మనుషులు తలా కొంత ఆర్థిక సహాయాన్ని  చేశారు. మొత్తం ఆర్థిక విరాళం 35 వేల రూపాయలు కావడంతో బాధిత కుటుంబానికి అందజేసి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు తెల్లవారుజామున తంబురాతో ఊరిని మేలుకొలిపే వ్యక్తి అకాల మరణం చెందడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని గ్రామస్తులు తెలిపారు. కొండూరు గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -