Thursday, July 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మిక వర్గ ద్రోహి బీజేపీని తరిమికొట్టండి

కార్మిక వర్గ ద్రోహి బీజేపీని తరిమికొట్టండి

- Advertisement -

– కార్మికుల శ్రమదోపిడీని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం
– నాలుగు లేబర్‌కోడ్లు, నల్లచట్టాలను రద్దుచేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
– కాటేదాన్‌, ఖమ్మం ప్రాంతాల్లో ర్యాలీ, బహిరంగ సభ
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌/ఖమ్మం

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో జరిగిన సమ్మె కార్యక్రమంలో జాన్‌వెస్లీ పాల్గొన్నారు. మొదట ఆరాంఘర్‌, శివరాంపల్లి, దానమ్మ జోపిడి, కాటేదాన్‌లో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా దుర్గానగర్‌ నుంచి కాటేదాన్‌లోని సీఐటీయూ జిల్లా కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. కార్మికులంతా సమ్మె చేస్తుంటే.. కార్మిక సంఘం అని చెప్పుకునే బీఎంఎస్‌ సమ్మెలో పాల్గొనకుండా ఇది రాజకీయ సమ్మె అంటూ కార్మికులకు ద్రోహం చేస్తోందని అన్నారు. 8 గంటల పనివిధానాన్ని మార్చి 10 గంటలకు అవసరమైతే 12 గంటలకు పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్స్‌ తీసుకొచ్చిందని తెలిపారు. దీనికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీఓ 282 ద్వారా పనిగంటలు పెంచే కుట్ర చేస్తోందన్నారు. వారానికి 48 గంటలు దాటితే ఓవర్‌ టైమ్‌ పేమెంట్‌ వస్తుందని చెప్పారే తప్ప వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలని కానీ, వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తారని కానీ లేబర్‌ కోడ్‌లలో ఎక్కడా చెప్పలేదన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయాలని 6 గంటల తర్వాతే బ్రేక్‌ ఉంటుందంటూ ప్రభుత్వాలు అధికారికంగానే కార్పొరేట్లకు మద్దతు పలకడం కార్మికుల పట్ల వీరికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. ఈ కోడ్‌లో 12 శాతంగా ఉన్న పీఎఫ్‌ను 10 శాతానికి తగ్గిస్తామంటున్నారని, అలాగే, సెక్షన్‌ 16(1) ప్రకారం ఈ 10 శాతం కూడా తగ్గించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. సెక్షన్‌ 15(1)(ఈ) ప్రకారం ఈపీఎఫ్‌, ఈపీఎస్‌, ఈడీఎల్‌ఐను తనకు అవసరమైన విధంగా మార్చేందుకు, ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్‌ రేటును నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వానికే అధికారం కట్టబెట్టినట్టు చెప్పారు. ఇలాంటి కోడ్స్‌తో యాజమాన్యాలు దోపిడీ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారన్నారు. 300 మంది లోపు కార్మికులు ఉన్న కంపెనీలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్మికులను తొలగించడానికి, లే ఆఫ్‌, మూసివేతలకు యాజమాన్యాలకు లైసెన్స్‌ ఇచ్చిందన్నారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ సర్టిఫికెట్‌తో సంబంధం లేకుండానే చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలతో కార్మికులను తొలగించే అవకాశం యాజమాన్యాలకు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కూడా బీజేపీ విధానాలనే అవలంబిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జాజాల రుద్రకుమార్‌, కాటేదాన్‌ క్లస్టర్‌ కోశాధికారి పీసీకే భాస్కర్‌, ఇండిస్టీ నాయకులు ప్రవీణ్‌, సచిన్‌, కిషోర్‌, ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ మండల కార్యదర్శి కాలే రాజు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, టీయూసీఐ, బీఆర్డీయూ తదితర వామపక్ష పార్టీలు, జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మోడీ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌లతో కార్మికులను, మూడు నూతన సాగు చట్టాలతో రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు పని భద్రత లేకుండా చేయడంతో పాటు శ్రమ దోపిడీని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని, ప్రశ్నించే వారిపై ప్రభుత్వం జులుం చేస్తూ చట్టాలను ప్రయోగించి నిర్బంధించే ప్రయత్నం చేస్తుందన్నారు. రవాణా రంగానికి సంబంధించి అమల్లోకి వచ్చిన చట్టాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. సమ్మె సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన మార్పును గమనించైనా నూతన సాగు చట్టాలను, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి దండి సురేష్‌, మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, టీయూసీఐ నాయకులు కె. రామయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -