Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోరాటాన్ని తీవ్రతరం చేయాలి పాలకులను ప్రశ్నించాలి

పోరాటాన్ని తీవ్రతరం చేయాలి పాలకులను ప్రశ్నించాలి

- Advertisement -

– వలస పాలనను మించిన ఆర్థిక అసమానతలు : జాయింట్‌ ఫోరం ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సెక్టార్స్‌ యూనియన్‌ సమావేశంలో ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఇండిపెండెంట్‌ ఫెడరేషన్లు దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక రోజు సమ్మెను పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఐసీఈయూ) అధ్యక్షులు డి.గిరిధర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వలసపాలనను మించిన ఆర్థిక అసమానతలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సమ్మెకు కొద్ది రోజుల ముందే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు పని గంటలను పెంచుతూ ఉత్తర్వులిచ్చాయని చెప్పారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా సులభతర వాణిజ్యం కోసం కార్మికశక్తిని చౌకగా ఉపయోగించుకోవడంతో పాటు కార్మికోద్యమాన్ని బలహీనం చేసేందుకు 29 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. కార్మికులు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారనీ, ఆ సమస్యను ఎదుర్కొనేందుకు అంతే స్థాయిలో పోరాటాన్ని తీవ్రం సూచించారు. సింగరేణితో పాటు అనేక సంస్థల్లో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇప్పటికీ కనీస వేతనాలు అత్యధిక మంది కార్మికులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎల్‌ఓ రోజుకు పని గంటలను 6 గంటలకు పరిమితం చేయాలని సూచిస్తే, కార్పొరేట్లు వారానికి 70 నుంచి 90 గంటలు పని చేయాలంటున్నారని తెలిపారు. ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మన దేశమని పాలకులు చెబుతున్నారనీ, ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం రోజు రోజుకు దిగజారిపోతున్నాయని విమర్శించారు. సంపదను సృష్టిస్తున్న కార్మికుల వేతనాలు మాత్రం హీనంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, కార్మికులు జాతీయోద్యమ స్ఫూర్తితో పాలకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాజకీయ మద్దతు లేకున్నా సరే చారిత్రాత్మక పోరాటాన్ని చేసిన బొంబాయి వర్కర్స్‌ యూనియన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్‌ మాట్లాడుతూ రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు పోరాటం తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, కార్మికుల పాత్ర లేకుండా కేవలం విదేశీ పెట్టుబడులతో దేశం అభివృద్ధి చెందదని తెలిపారు.


ప్రయివేటీకరణను అడ్డుకుంటాం : శ్రీకాంత్‌ మిశ్రా
ఎల్‌ఐసీ ప్రయివేటీకరణను అడ్డుకుంటూనే ఉంటామని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఏ) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా తెలిపారు. రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమై ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యంతో రూ.55 లక్షల కోట్ల సంపద సమకూర్చుకున్న ఎల్‌ఐసీని ప్రయివేటుకు అప్పజెప్పేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎల్‌ఐసీకి ఉన్న సావరీన్‌ గ్యారంటీని తొలగించాలని యుఎస్‌ ఒత్తిడి చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశమున్నప్పటికీ 36 శాతమే నిధులు వస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో దాన్ని 100 శాతానికి పెంచాలనుకోవడం తిరోగమన చర్యగా అభివర్ణించారు. రాబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీమా చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారనీ, ఎల్‌ఐసీ స్వతంత్ర ప్రతిపత్తిని తగ్గించే చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. బ్యాంకుల విలీనానికి అంగీకరించిన ప్రభుత్వం ప్రభుత్వ సాధారణ బీమా సంస్థల విలీనానికి ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే క్లాస్‌ 3, క్లాస్‌ 4 నియామకాలను చేపట్టాలనీ, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించి వర్తింపజేయాలని మిశ్రా డిమాండ్‌ చేశారు. ఏఐబీఇఏ నాయకులు బీ.ఎస్‌.రాంబాబు మాట్లాడుతూ కార్పొరేట్లకు తలొగ్గిన కేంద్రం కార్మిక చట్టాలను మార్చి లేబర్‌ కోడ్‌లను తెస్తున్నదని విమర్శించారు.
దీనికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని సూచించారు. బ్యాంకుల ప్రయివేటీకరణకు పూనుకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అధిక సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలనీ, ఏళ్ల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎల్‌ఐసీ దక్షిణ మధ్య జోనల్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి టీవీఎన్‌ఎస్‌ రవీంద్రనాథ్‌, బ్యాంక్‌ ఆఫీసర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఫణి కుమార్‌, బెఫీ నాయకులు నాయకులు గంగాధర్‌, సతీష్‌ తదితరులు మాట్లాడారు. హరీశ్‌ బాబు, సతీష్‌ (ఆర్‌బీఐ), ఎం.శివశంకర్‌ (జీఐసీ), కె.వేణుగోపాల్‌, జయరాజు (ఎల్‌ఐసీ పెన్షనర్స్‌ అసోసియేషన్‌) సంఘీభావం తెలిపారు. ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి ఎల్‌.మద్దిలేటి, జోనల్‌ నాయకులు పి.సుజాత, తిరుపతయ్య, శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -