Thursday, July 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకల్తీకల్లు ఘటనలో ఐదుగురు మృతి

కల్తీకల్లు ఘటనలో ఐదుగురు మృతి

- Advertisement -

– నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 23 మంది
– పోలీసుల అదుపులో ఐదుగురు
– కల్లు కాంపౌండ్లు సీజ్‌.. ల్యాబ్స్‌కు శాంపిల్స్‌ : బాధితులకు మంత్రి జూపల్లి పరామర్శ
– రూ.కోటి పరిహారమివ్వాలి : ఎంపీ ఈటల రాజేందర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో/కూకట్‌పల్లి

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి ఏరియాలో జరిగిన కల్తీ కల్లు ఘటన కలకలం రేపుతోంది. కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి ఈ మూడు రోజుల్లో ఐదుగురు మృతి చెందారు.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు సీతారామ్‌, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప, మరో వ్యక్తిగా గుర్తించారు. 23 మందికి పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో 15 మంది మంగళవారం రాగా.. బుధవారం గాంధీ ఆస్పత్రి నుంచి ఇద్దరు, కూకట్‌పల్లి నుంచి మరో ఆరుగురు నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మినహాయిస్తే మిగతా వారంతా కోలుకుంటున్నారు. హెమోడైనమిక్‌గా స్థిరంగా ఉన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలోని మల్టీ డిసిప్లీనరీ నిపుణుల బృందం రోగుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు జనరల్‌ మెడిసిస్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎంవీఎస్‌ సుబ్బలక్ష్మి తెలిపారు. ఇదిలా ఉంటే.. కల్తీ కల్లు ఘటనలో ఇద్దరిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు.


కల్లు కాంపౌండ్‌లను సీజ్‌ చేశారు. కల్లు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని ఉషా ముళ్లపూడి రోడ్డులోని కల్లు కాంపౌండ్‌, కేపీహెచ్‌బీలోని హైదర్‌నగర్‌, ఎల్లమ్మబండ ప్రాంతంలోని కల్లు కాంపౌండ్‌లో ఆదివారం సాయంత్రం కొంతమంది కల్లు తాగారు. వారిలో కొంతమంది మరుసటి రోజు ఉదయం నుంచి తీవ్రమైన వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితులను కూకట్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్స్‌కు తరలించారు.


పోలీసుల అదుపులో నిర్వాహకులు
కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్‌గౌడ్‌, బి.శ్రీనివాస్‌గౌడ్‌, టి.శ్రీనివాస్‌గౌడ్‌, టి.కుమార్‌గౌడ్‌, లీగల రమేష్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించిన ఐదు షాపులను ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. మొత్తం 600 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు. కాగా, కూకట్‌పల్లి కల్లు కంపౌండ్‌లో నాలుగు రోజుల కిందట స్వరూప అనే మహిళ కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 8వ తేదీన మతి చెందింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కల్లు కాంపౌండ్‌ ఓనర్‌ గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్లాన్‌ చేశాడు. స్వరూప మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. కల్తీ కల్లు తాగే మరణించినట్టు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం రావడంతో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు స్వరూప అంత్యక్రియలను మధ్యలోనే ఆపేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. స్వరూప కొడుకు నుంచి ఫిర్యాదు తీసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు విచారణ చేపట్టారు.


ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదలం : మంత్రి జూపల్లి
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ స్టేషన్‌ పరిధిలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడం అత్యంత బాధాకరమని ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే ఎక్సైజ్‌, పోలీసు అధికారులు స్పందించి హుటాహుటిన వారిని హాస్పిటల్స్‌కు తరలించారని తెలిపారు. సకాలంలో వైద్యం అందడంతో బాధితులందరూ కోలుకుంటున్నారనీ, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితులందరూ ఒకే రకమైన లక్షణాలతో బాధపడుతున్నారనీ, ప్రాథమికంగా ఇది కల్తీ కల్లు వల్లే జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే.. బాధ్యులెంతటి వారైనా వదలబోమని స్పష్టం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. కల్లు డిపోలను కూడా సీజ్‌ చేశారనీ, కల్లు శాంప ిల్స్‌ను సేకరించి ఎక్సైజ్‌ కెమికల్‌ ల్యాబోరేటరీకి.. చికిత్స పొందుతున్న వారి శ్యాంపిల్స్‌ను ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిం చారనీ, నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతోపాటు కల్లు డిపోల లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుం టామని చెప్పారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కల్లు డిపోలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకో వాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. మంత్రి వెంట ఎక్సైజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ గంగాధర్‌, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు.


రూ.కోటి పరిహారమివ్వాలి : ఈటల రాజేందర్‌
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఎంపీ పరామర్శించి మాట్లాడారు. కల్తీ కల్లు ఘటనలో మంగళవారం ఇద్దరు, బుధవారం ఒకరు మొత్తం ముగ్గురు చనిపోయినట్టు సమాచారం ఉందనీ, ప్రభుత్వం మాత్రం నిజాలు దాచాలని చూస్తోందని అన్నారు. కల్తీ కల్లు ఎప్పటి నుంచి అమ్మారు..? ఎంత మంది తాగారు..? అనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -