Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహక్కుల సాధనకు ఐక్యపోరాటాలే మార్గం

హక్కుల సాధనకు ఐక్యపోరాటాలే మార్గం

- Advertisement -

– వర్కింగ్‌ జర్నలిస్టు చట్టాలను కొనసాగించాలి
– మీడియా రంగంలోకి కార్పొరేట్ల రాకతో తీవ్రనష్టం : టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హక్కుల సాధన కోసం జర్నలిస్టులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య పిలుపునిచ్చారు. 44 కార్మిక చట్టాలతోపాటు రెండు వర్కింగ్‌ జర్నలిస్టు చట్టాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెంటనే నిలిపేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా బుధవారం హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యూజే- టీడబ్ల్యూజేఎఫ్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ద జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయ్య, బసవపున్నయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. ఎన్నో ఏండ్లుగా వర్కింగ్‌ జర్నలిస్టు చట్టం అమల్లో ఉందనీ, దాన్ని రద్దు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు వేజ్‌ బోర్డును అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల పట్ల వివక్ష చూపటం మంచిది కాదన్నారు. మీడియాలో కార్పొరేట్‌ శక్తులు రావడం ప్రమాదకరమని అన్నారు. జర్నలిస్టులకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. జర్నలిస్టుల హక్కులను కేంద్రం హరించి వేస్తున్నదని చెప్పారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు కూడా అమలు కావటం లేదన్నారు. ప్రజాసమస్యలపై అధ్యయనం, హక్కుల సాధన దిశగా జర్నలిస్టులు ముందుకుపోవాలని వారు పిలుపునిచ్చారు. అధ్యక్షత వహించిన హెచ్‌యూజే అధ్యక్షులు బి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ వర్కింగ్‌ జర్నలిస్టు చట్టాన్ని రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల రక్షణ చట్టం తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ఆనందం, బి రాజశేఖర్‌, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్‌, ఎస్‌కే సలీమా, గండ్ర నవీన్‌, హెచ్‌యూజే కార్యదర్శి బి జగదీశ్వర్‌, నాయకులు నాగవాణి, చిట్యాల మధుకర్‌, ప్రశాంత్‌, రేణయ్య, పి విజయ, మాధవరెడ్డి, కాలేబ్‌, వీరేశ్‌, వెంకటస్వామి, సీనియర్‌ జర్నలిస్టులు రత్నాకర్‌ సురేష్‌, భాస్కర్‌, శశికళ, అజరు తదితరులు పాల్గొన్నారు.


హెచ్‌యూజే, ఫెడరేషన్‌కు అభినందనలు
కార్మికుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావం తెలిపిన హెచ్‌యూజే, టీడబ్ల్యుజేఎఫ్‌ సంఘాలకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు కార్మిక సంఘాల తరుపున ధన్యవాదాలు తెలిపారు. సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న జరల్నిస్టులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -