– స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజానీకం దుకాణాలు, వాణిజ్య సంస్థల మూసివేత
– భాగస్వాములైన ప్రభుత్వ, ప్రయివేటురంగ కార్మికులు, ఉద్యోగులు
– స్తంభించిన బ్యాంకింగ్, బీమా, తపాలా సేవలు
– రోడ్‌రోకో, రైల్‌రోకోతో కదం తొక్కిన కార్మిక లోకం
– నిరసనకారులపై నిర్బంధాలు…అరెస్టులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌ల రద్దుతో పాటు మరో 17 డిమాండ్లతో జరిగిన జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో 25 కోట్ల మందికి పైగా ఈసమ్మెలో భాగస్వాములు అయ్యారు. పలుచోట్ల రాస్తారోకో, రైల్‌రోకోలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలు, బ్లాక్-సబ్ డివిజన్ స్థాయిల్లో అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలతో సహా వివిధ వర్గాల ప్రజానీకం భారీ ఆందోళనలు చేపట్టింది. అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యం అయ్యారు. గ్రామీణ భారతదేశంలో ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి ఫ్రంట్ నాయకత్వం గణనీయమైన పాత్ర పోషించింది.
బొగ్గు, ఎన్‌ఎండిసి లిమిటెడ్, ఇనుప ఖనిజం, రాగి, బాక్సైట్, అల్యూమినియం, బంగారు గనులు, బొగ్గుయేతర ఖనిజాలు, ఉక్కు, బ్యాంకులు, ఎల్‌ఐసీ, జీఐసీ, పెట్రోలియం, విద్యుత్, పోస్టల్, గ్రామీణ డాక్ సేవకులు, టెలికాం, అణుశక్తి, సిమెంట్, పోర్ట్ అండ్ డాక్, తోటలు, జూట్ మిల్లులు, మెడికల్ అండ్ సేల్స్, ఐటీ అండ్ ఐటీఈలు, ప్రజా రవాణా, ప్రయివేటు రంగంలో వివిధ రకాల రవాణా, వివిధ రంగాలు, రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టల్, ఆదాయపు పన్ను, ఆడిట్, ఇతర ప్రధాన రంగాలలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అనేక బహులజాతి కంపెనీ (ఎంఎన్‌సి)లు సహా దేశంలోని చాలా పారిశ్రామిక ప్రాంతాలలోని కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రదర్శనలు నిర్వహించారు. రక్షణ రంగ ఉద్యోగులు సమ్మెకు మద్దతుగా ఒక గంట పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రైల్వే యూనియన్లు సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నిర్మాణ కార్మిక సంఘాలు, బీడీ, అంగన్‌వాడి, ఆశా, మిడ్ డే మీల్‌తో సహా ఇతర స్కీమ్ కార్మికులు, మత్స్యకారులు, గృహ కార్మికులు, హాకర్లు, హెడ్-లోడ్ కార్మికులు, ప్రయివేటు సెక్యూరిటీ వర్కర్లు, ఉబర్, ఓలా, ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ, ర్యాపిడో, గృహ ఆధారిత పీస్ రేట్ కార్మికులు, రిక్షా, ఆటో, టాక్సీ డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు.
విద్యార్థులు, యువత, మహిళలు, సామాజిక కార్యకర్తలు కూడా అనేక చోట్ల ప్రదర్శనలు, ధర్నాల్లో పాల్గొన్నారు. సామాన్య ప్రజలు సైతం సమ్మె చర్యలకు మద్దతు ఇచ్చారు. పుదుచ్చేరి, అస్సాం, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కర్ణాటక, గోవా, మేఘాలయ, మణిపూర్, జమ్ముకాశ్మీర్, అండమాన్ నికోబర్ మొదలైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బంద్ దిగ్విజయంగా జరిగింది. రాజస్థాన్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లోనూ సమ్మె జరిగింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో పారిశ్రామిక వాడల్లో సమ్మె విజయవంతంగా జరిగింది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థల యజమానులు బెదిరింపులు, అణచివేత చర్యలకు పాల్పడ్డారు.
వీటిని కార్మికులు, ఉద్యోగులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ కంపెనీల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. కోలకతా ఓడరేవులో సరుకు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఉద్యోగులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. భారతీయ నావికులు సముద్రంలో షిప్‌లపై నుంచి తమ నిరసన తెలిపారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగులు సమ్మె చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ట్రేడ్ యూనియన్లు, జర్నలిస్టులు, వివిధ ఉద్యోగుల నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి.
అరెస్టులు
పశ్చిమ బెంగాల్‌లోని కోలకత్తా, ప్రెసిడెన్సీ, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు సమ్మెకు సంఘీభావంగా వీధుల్లోకి వచ్చారు. కోలకత్తాలో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్యతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో పలు చోట్ల రైలు రాకపోకలు స్తంభించాయి. ఇంధన రంగంలోని ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు.
పాట్నాలో…
బీహార్‌లో అఖిల భారత సమ్మె పూర్తిగా జరిగింది. పాట్నాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, ఆర్జేడి నాయకుడు తేజస్వి యాదవ్ తదితరులు బహిరంగ వాహనంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఐటీయూ అధ్యక్షురాలు కె హేమలత, కార్యదర్శి ఎఆర్ సింధు, కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ ధావ్లే, ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్ కుమార్, ఎస్ పుణ్యవతి, బృందాకరత్, హన్నన్‌మొల్ల, రాజ్యసభ ఎంపీ ఎఎ రహీం, అనురాగ్ సక్సేనా, పీ కృష్ణప్రసాద్, పీవీ అనియన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ మోడీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించారు. నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపి) రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలనీ, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేయాలని కోరారు. ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతల్ని రూపుమాపాలనీ, ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. పదేండ్లుగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్‌ఒ)ను నిర్వహించట్లేదనీ, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. లేబర్ కోర్టులను రద్దు చేసి, వాటి స్థానంలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు, వేతన నిర్వచనం మార్పు, వృత్తుల షెడ్యూల్స్ రద్దు వంటి అనేక దుర్మార్గ చర్యలను మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 10 గంటల పనిదినాన్ని ప్రభుత్వాలు చట్టబద్ధం చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఆక్షేపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో పది కేంద్ర కార్మిక సంఘాల జాతీయ నాయకులు తపన్ సేన్ (సీఐటీయూ), అమర్‌జీత్ కౌర్ (ఏఐటీయూసీ), అశోక్ సింగ్ (ఐఎన్‌టీయూసీ), హర్భజన్ సింగ్ (హెచ్‌ఎంఎస్), రాజీవ్ దిమ్రీ (ఏఐసీసీటీయూ), లతా బెన్ (సేవా), చౌరాసియా (ఏఐయూటీయూ), జవహర్ (ఎల్‌పీఎఫ్), ధర్మేంద్ర వర్మ (టీయూసీసీ) ఆర్‌ఎస్ డాగర్ (యూటీయూసీ), వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, ఐసీఇయూ, ఎంఇసీ, ఏఐకేఎస్ నేతలు ప్రసంగించారు.