Thursday, July 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆగని ఇజ్రాయిల్‌ దాడులు

ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

వంద మందికి పైగా పాలస్తీనియన్ల మృతి
కాల్పుల విరమణ చర్చల్లో కానరాని పురోగతి
గాజా :
పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులు చేస్తోంది. ఆహారం కోసం సహాయ శిబిరాల వద్ద బారులు తీరిన ప్రజలపై సైతం అమానుషంగా విరుచుకుపడుతోంది. గత 24 గంటల కాలంలో ఇజ్రాయిల్‌ జరిపిన దాడులలో 105 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలావుండగా కాల్పుల విరమణపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూతో రెండోసారి సమావేశమయ్యారు. అయితే ఈ చర్చలలో పురోగతి కన్పించలేదని సమాచారం. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బులా మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేశానని ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. జబాల్‌ బ్లాట్‌లో ఆయుధ డిపోలు ఉన్న ఓ ప్రాంగణాన్ని తమ దళాలు నాశనం చేశాయని చెప్పింది. లాబోహన్స్‌ ప్రాంతంలో హెజ్బులా ఆయుధ స్థావరాన్ని గుర్తించామని కూడా పేర్కొంది. అయితే దీనిపై హెజ్బులా నుండి ఎలాంటి స్పందన రాలేదు. కాగా అమెరికా, ఇజ్రాయిల్‌ మద్దతుతో నడుస్తున్న వివాదాస్పద సహాయ కేంద్రాల వద్ద జరిగిన దాడులలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 770కి చేరింది. సెంట్రల్‌ గాజాలో ఆహార పంపిణీ కేంద్రాన్ని మూసివేయడంతో వేలాది మంది పాలస్తీనీయులు దక్షిణ ప్రాంతం వైపు తరలిపోతున్నారు. ఉత్తర గాజాలోని ఆస్పత్రులను విద్యుత్‌ కొరత వేధిస్తోంది. ఫలితంగా వందలాది మంది చనిపోయే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రఫా నగరంలోని ఓ సహాయ కేంద్రంపై ఇజ్రాయిల్‌ దళాలు జరిపిన కాల్పులలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అమెరికా, ఇజ్రాయిల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహార పంపిణీ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంటోంది. ఆహార పదార్థాలను ఎప్పుడు పంపిణీ చేస్తారో ఎవరూ చెప్పడం లేదు. దీంతో ప్రజలు తెల్లవారుజాము నుండే అక్కడ పెద్ద ఎ త్తున గుమిగూడుతున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నార్తులపై కూడా ఇజ్రాయిల్‌ దాడులు సాగిస్తోంది. ఇదిలావుండగా ఇంధన కొరతతో విలవిలలాడుతున్న గాజా ఆస్పత్రులకు వెంటనే సరఫరాలు ప్రారంభించాలని, లేని పక్షంలో వాటిని మూసివేయక తప్పదని ఐరాస మానవ హక్కుల కార్యాలయం ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -