– అందులో ఉన్నతాధికారుల కీలక పాత్ర
– రిప్లరు కౌంటర్ దాఖలు చేసిన పిటిషనర్
నవతెలంగాణ-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములను ఉన్నతాధికారులు అన్యాక్రాంతం చేశారంటూ దాఖలైన పిటిషన్‌లో కలెక్టర్ వేసిన కౌంటర్‌లో వాస్తవాలు లేవనీ, రికార్డులు తారుమారు చేశారని పిటిషనర్ బీర్ల మల్లేశ్ రిప్లరు కౌంటర్ దాఖలు చేశారు. నాగారంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195ల్లో భూదాన భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలనే పిటిషన్‌లో కలెక్టర్ వాస్తవాలు దాచిపెట్టారని ప్రస్తావించారు. సర్వే నెం.181/1, 2, 3ల్లో 50 ఎకరాలు భూదాన్ భూములని 2006 ప్రభుత్వం మెమో జారీ చేసిందనీ, అయినప్పటికీ ప్రయివేటు వ్యక్తులతో ఉన్నతాధికారులు చేతులు కలిపి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి కలెక్టర్ అమోరుకుమార్, అప్పటి ఎమ్మార్వో ఆర్.పి.జ్యోతి, ఆర్డీవోల సిఫారసులతో అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ డీనోటిఫై చేశారనీ, అది చట్టవ్యతిరేకమని తెలిపారు. డీనోటిఫై చేయడానికి ఏడాది ముందే పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అక్రమ పట్టాపాస్‌బుక్కుల ఆధారంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి కుటుంబసభ్యులు, ఇతరులు ఆ భూముల్ని కొనుగోలు చేశారనీ, వాటిని రద్దు చేయాలని కోరారు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా, భూదాన్ యజ్ఞబోర్డు అధికారిగా నవీన్‌మిట్టల్ విచారణ తప్పుల తడకగా సాగించిందని ఎత్తిచూపారు.
హౌర్డింగ్‌లపై వివరణ ఇవ్వండి :హైకోర్టు
రాష్ట్రంలో మున్సిపల్ హౌర్డింగ్‌లను ఏర్పాటు చేసే విధానమేంటో చెప్పాలని మున్సిపల్ శాఖను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు సూచించింది. విచారణను ఆగస్టు ఆరోతేదీకి వాయిదా వేసింది. 15 అడుగులకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఎల్‌ఈడీ హౌర్డింగ్‌లను తొలగించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 68 ను రద్దు చేయాలని తామిచ్చిన సుమారు 20 వినతిపత్రాలపై అధికారులు చర్యలు తీసుకోలేదంటూ తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్‌తో సహా 53 ప్రకటన సంస్థలు వేసిన పిటిషన్లను జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారించారు.
జగన్ ఆస్తుల కేసును కొట్టేయాలన్న దాల్మియా
ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు చెందిన కేసును కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారించి సీబీఐకి నోటీసులు జారీ చేశారు. దాల్మియాకు లీజులు మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో కింద జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టిందంటూ సీబీఐ అభియోగం. ఈకేసును కొట్టేయాలన్న దాల్మియా పిటిషన్‌పై విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది.
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యమెందుకు?
సివిల్ వివాదాల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నటి శిల్పా చక్రవర్తికి చెందిన 32 ఎకరాల భూవివాదంపై సివిల్ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సెటిల్‌మెంట్ పేరుతో పోలీసులు జోక్యం చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారనే వ్యాజ్యాన్ని జస్టిస్ వినోద్ కుమార్ విచారించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తికి వ్యక్తిగత హౌదాలో నోటీసు జారీ చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడ్ గ్రామంలో కొనుగోలు చేసిన 32 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో పోలీసుల జోక్యాన్ని జడ కళ్యాణ్ యాకయ్య, అతని భార్య టీవీ నటి శిల్పాచక్రవర్తి హైకోర్టులో సవాల్ చేసిన పిటిషన్‌పై విచారణ ఆగస్టు ఐదో తేదీకి వాయిదా వేసింది.
లాయర్లకు ఇన్సూరెన్స్ పెంపు
న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పాలసీని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపుదల జరిగింది. ఇది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నది. ఈ మేరకు బార్ కౌన్సిల్ చైర్మెన్ ఎ.నరసింహారెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. న్యాయవాదుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కోర్టు స్టాంపు ఫీజు ద్వారా వచ్చిన సొమ్ము నుంచి ఈ చెల్లింపులు ఉంటాయన్నారు. సభ్యుడు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే రూ.15 వేలను రూ.20 వేలకు, వైద్య ఖర్చులకు రూ.లక్ష, జూనియర్లకు లైబ్రరీ రుణంగా రూ.10 నుంచి రూ.15 వేలకు పెంచామన్నారు. మీడియా సమావేశంలో బార్ కౌన్సిల్ వైస్‌చైర్మెన్ సునీల్‌గౌడ్, బీసీఐ సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.