ప్రజల మౌలిక అవసరాలూ తీర్చలేకపోతున్న కాంగ్రెస్ సర్కార్..
నాట్లు వేసే సమయమొచ్చినా జలాశయాల్లో నీళ్లు లేవు..
ప్రతిపక్షంగా పోరాడుతుంటే వ్యక్తి దూషణలు..
సీఎం సహా ఆయన ఎమ్మెల్యేలంతా సమస్యలను పక్కదారి పట్టించేవారే!
– ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రను అణగదొక్కే చర్యలు మానుకోవాలి..
స్థానిక ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ దే గెలుపు..
మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల సహా మాజీ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లాను కాంగ్రెస్ సర్కారు అంధకారంలోకి నెట్టేసింది. కేబుల్ బ్రిడ్జి రెండేండ్లుగా చీకటిమయంకాగా.. పట్టణాలు, పల్లెల్లోనూ వీధి దీపాలు కూడా వెలగడం లేదు. కనీసం నార్లు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నా.. జలాశయాల్లో నీళ్లు నిల్వ లేకుండా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బీఆర్‌ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.’ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.
కరీంనగర్ నగరాన్ని అంధకారంలో నెట్టేశారని, కేబుల్ బ్రిడ్జిపై రెండు సంవత్సరాలుగా లైట్లు వెలగడం లేదని గంగుల ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు కేవలం కాంగ్రెస్ పార్టీకి అనుకూల కార్యకర్తలకే ఇవ్వడమా? తన నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు. రైతులకు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని, దిగువ మానెరు డెడ్‌స్టోరేజ్‌లోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాల్లో 6 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. ‘ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ వానాకాలంలో కరువు తప్పదు’ అని గంగుల హెచ్చరించారు. అలాగే, వైద్యశాఖపై సమీక్షలు లేకపోవడంతో వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయని, పల్లె పట్టణాల్లో శానిటేషన్ కార్యాచరణ పూర్తిగా పడిపోయిందని విమర్శించారు.
వ్యక్తిగత దూషణలు మానుకోవాలిః మాజీ ఎమ్మెల్యే రసమయి
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. “ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగడం శోచనీయం. నాపై బూతులు మాట్లాడడం కాంగ్రెస్ వైఖరిని సూచిస్తుంది. గన్నేరువారం రోడ్డుకు సంబంధించి బైక్ ర్యాలీ చేపడతామని ప్రకటించగానే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసభ్య పోస్టర్లకు పాల్పడ్డారు.’కమిషన్ల సత్యనారాయణ’ అంటూ విమర్శించారు. ఆయనకు తగినగుణపాఠం ప్రజలే చెబుతారని హితవు పలికారు.
అధికారమున్నా పనులే లేవుః మాజీ ఎమ్మెల్యే సుంకే విమర్శ
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. “నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకాలు, నిధులు వృథా అయ్యాయి. కొండగట్టు అభివృద్ధికి అప్పటి సీఎం కెసిఆర్ ఇచ్చిన రూ.100 కోట్లు పనిలో పెట్టలేదు. మోతె రిజర్వాయర్ కు ఇచ్చిన రూ.200 కోట్ల పనులు నిలిచిపోయాయి. సెంట్రల్ లైటింగ్, హాస్పిటల్ నిర్మాణం మధ్యలో ఆగిపోయాయి. ప్రజలకు అవసరమైన నీరు ఇవ్వలేకపోతున్నారు. ఈ విధంగా చొప్పదండి ని కరువు ప్రాంతంగా మార్చారు” అంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రను అణగదొక్కే చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగవు అని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణ, బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.