Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌సీఏ అధ్యక్షుడి రిమాండ్‌

హెచ్‌సీఏ అధ్యక్షుడి రిమాండ్‌

- Advertisement -


– జగన్మోహన్‌తో పాటు మరో నలుగురు కూడా..
– రూ.కోట్లలో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్టు
సీఐడీ విచారణలో వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతో పాటు మరో నలుగురికి పన్నెండు రోజుల పాటు నాంపల్లి కోర్టు గురువారం జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ కేసును దర్యాప్తు జరుపుతున్న రాష్ట్ర సీఐడీ విభాగం.. జగన్మోహన్‌రావుతో పాటు కోశాధికారి శ్రీనివాస్‌, సీఈఓ సునీల్‌, మరో ఇద్దరు సభ్యులు రాజేందర్‌యాదవ్‌, ఆయన భార్య కవితలను అరెస్ట్‌ చేసింది. వీరిని కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు అధికారులు తరలించారు. సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు పాతబస్తీ అప్పటి గౌలిపుర క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన అధ్యక్షుడు కృష్ణా యాదవ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ను సృష్టించి దాని ద్వారా హెచ్‌సీఏలోకి ప్రవేశించి అక్రమ మార్గాలతో ఆ సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. ఇందుకు గౌలిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రస్తుత అధ్యక్షురాలైన కవిత, ఆమె భర్త రాజేందర్‌యాదవ్‌లు ఈ విషయంలో జగన్మోహన్‌రావుకు పూర్తిగా సహకరించారు. ఈ విధంగా అక్రమంగా అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్‌రావు, తమ కోశాధికారి శ్రీనివాస్‌, సీఈఓ సునీల్‌ కుమార్‌లతో కలిసి హెచ్‌సీఏకు చెందిన కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని చారుసిన్హా తెలిపారు. అంతేగాక, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్‌ టీం యాజమాన్యాన్ని బెదిరించి అదనంగా పది శాతం మ్యాచ్‌ టికెట్లను తనకు వ్యక్తిగతంగా కేటాయించాలని జగన్మోహన్‌రావు వేధించినట్టు ఆమె చెప్పారు. అందుకు ఒప్పుకోని ఎస్‌ఆర్‌హెచ్‌ టీం యాజమాన్యంపై కోపంతో మ్యాచ్‌ రోజు స్టేడియంలో వీఐపీ లాంజ్‌కు అకస్మాత్తుగా తాళాలు వేసి వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన విజిలెన్స్‌ విచారణలో జగన్మోహన్‌రావు బృందం అక్రమాలు బయట పడ్డాయని చెప్పారు. హెచ్‌సీఏలో చోటు చేసుకున్న ఆర్థిక అక్రమాలపై ఈ సంస్థ కార్యదర్శి గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపామని చారుసిన్హా వివరించారు. ఈ మేరకు జగన్మోహన్‌రావుతో పాటు మిగతా నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చటం జరిగిందని ఆమె తెలిపారు. హెచ్‌సీఏకు అందిన నిధులతో పాటు బీసీసీఐ మంజూరు చేసిన నిధులను కూడా వీరు దారి మళ్లించినట్టు తెలుస్తోందనీ, దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని ఆమె చెప్పారు. కాగా, దాదాపు రూ.170 కోట్ల మేరకు హెచ్‌సీఏలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు సీఐడీ అనుమానిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -