Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి

ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి

- Advertisement -

– రెండో శనివారం ప్రయివేటు విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలి
– సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి : విద్యాశాఖ సంచాలకులకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, టీపీటీఎల్‌ఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించడానికి చట్టం తేవాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ), తెలంగాణ ప్రయివేట్‌ టీచర్స్‌ లెక్చరర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయా విద్యాసంస్థలు రెండో శనివారం సెలవు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్‌ నికోలస్‌ను గురువారం హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ రజినీకాంత్‌, టి నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎ విజరుకుమార్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అయినప్పటికీ విద్యార్థులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను అందించలేదని విమర్శించారు.

వాటిని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉర్దూ మీడియం, కన్నడ, మరాఠీ మీడియం పాఠ్యపుస్తకాలు కూడా పెండింగ్‌ ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్నం భోజనానికి నిధులు కూడా సరిపడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదనీ, శానిటరీ నాప్‌కిన్లను అమ్మాయిలకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రతి నెల రెండో శనివారం సెలవు ఇచ్చేలా ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు. అయినా సెలవు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ పేరుతో నడుస్తున్న ప్రయివేట్‌ స్కూళ్లు రెండో శనివారం సెలవు ఇవ్వకుండా అటు విద్యార్థులను, ఇటు టీచర్లను వేధిస్తున్నాయని విమర్శించారు.

రెండో శనివారం సెలవు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఫీజుల దందా కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఎల్‌కెజి నుంచే రూ.లక్షల ఫీజులను వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేదని పేర్కొన్నారు. ఫీజులను నియంత్రణ చేయాలని డిమాండ్‌ చేశారు, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందుతున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25 శాతం ఉచితంగా విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాలు కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎల్‌ఎఫ్‌ నాయకులు కె విజరుకుమార్‌, డీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు హస్మిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -