– వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రాములు డిమాండ్
– నిజామాబాద్‌లో ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
వీఆర్‌ఏ వారసులకు గ్రామ పరిపాలన అధికారిగా అవకాశం కల్పించాలని వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగూరు రాములు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వీఆర్‌ఏలు 84 రోజుల సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగా జీవో 81, 85ను జులై 2023లో విడుదల చేశారని చెప్పారు. కానీ అదే సమయంలో ఎన్నికలు రావడం, అప్పుడున్న ప్రభుత్వం మారడం లాంటి పరిణామాలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జీవో అమల్లోకి రాలేదని తెలిపారు. ప్రభుత్వం భూ భారతి చట్టం 2025 తర్వాత ఆర్డర్లు ఇస్తారని కోటి ఆశలతో 3797 వీఆర్‌ఏ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
ఈ 3797మంది వీఆర్‌ఏల్లో 61 ఏండ్లు నిండిన వారి వారసుల వివరాలు ప్రభుత్వం 20 నెలల క్రితమే తీసుకున్నదని అన్నారు. కాబట్టి వీరికి కూడా జీపీవోలో అవకాశం కల్పించి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జీవో వచ్చిన సందర్భంలో కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ అడిగిన విషయంలో ప్రభుత్వ ఉద్యోగమన్న ఆశతో కుటుంబ సభ్యులు వారికున్న ఆస్తుల్లో వాటా వదులుకోవడం, ఆస్తులు లేని వారు అప్పులు తెచ్చి ఇచ్చారని చెప్పారు. దాంతో మానసిక ఒత్తిడికి గురై ఇప్పటివరకు దాదాపు 70 మంది వారసులు చనిపోయారని, అలాగే వయోభారంతో 61 ఏండ్లు నిండిన దాదాపు 400 మంది వరకు వీఆర్‌ఏలు చనిపోయారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, వీఆర్‌ఏ జిల్లా అధ్యక్షుడు ఇస్తరి గంగమల్లు, నిజామబాద్ డివిజన్ అధ్యక్షుడు గోధుమ మోహన్, బోధన్ డివిజన్ అధ్యక్షుడు కరుణాకర్, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.