– ఆధార్ ఎందుకు వద్దంటున్నారు?
– ‘పౌరసత్వం’పై పరిశీలన ఎందుకు?: ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో ఆధార్, ఓటరు కార్డు, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా ఓటరు గుర్తింపు కోసమైనప్పుడు ఆధార్ కార్డు అనేది ప్రాధమికమైన పత్రమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈసీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, ఎన్‌జీఓలు, న్యాయవాదులు దాఖలు చేసిన 10కి పైగా పిటిషన్లను జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్ గురువారం విచారించిన అనంతరం పై ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది. ఎస్‌ఐఆర్ ముందుకు సాగకుండా ఎన్నికల కమిషన్‌ను నిలువరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బీహార్‌లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ.. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియ చాలా హడావిడిగా, నిర్లక్ష్య ధోరణిలో జరుగుతోందని పిటిషనర్లు వాదించారు. ఆధార్ చెల్లుబాటయ్యే పత్రం కాదని ఎలా అంటారని వారు ప్రశ్నించారు. ఈ దశలో తాము తాత్కాలిక స్టే కోసం పట్టుబట్టడం లేదని కూడా పిటిషనర్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడం తమ రాజ్యాంగ హక్కుల పరిధిలోనే వుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. త్వరలోనే దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని నిర్వహిస్తామని ఇసి తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది తెలిపారు.
ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు
”ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, ఈ కేసులో మూడు ప్రశ్నలు ఇమిడివున్నాయని మేం ప్రాధమికంగా అభిప్రాయపడుతున్నాం. (ఎ) ఈ ప్రక్రియ చేపట్టిన ఎన్నికల కమిషన్ అధికారాలు (బి) ఈ ప్రక్రియను ఏ పద్ధతిలో నిర్వహిస్తున్నారు (సి) నవంబరులో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి ఇచ్చిన సమయంతో సహా ఈ ప్రక్రియను నిర్వహించే సమయం, అలాగే అభ్యంతరాలు వుంటే వాటిని పరిష్కరించి, తుది జాబితాను సిద్ధం చేయడానికి గల సమయం చాలా తక్కువగా వుంది.” అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈసీ వివరణ ఇవ్వాలి… ఆ పత్రాలు తిరస్కరిస్తే కారణం చెప్పాలి : ధర్మాసనం
”ఈ అంశంపై విచారణ జరపడం అవసరమేనని మేం కూడా అభిప్రాయపడ్డాం. అందుకే ఈ నెల 28న తదుపరి విచారణకు నిర్ణయించాం. ఈలోగా ఈ రోజు నుంచి వారం రోజుల్లోగా అంటే 21లోగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సి వుంటుంది. ఇంకా ఏదైనా వుంటే 28లోగా దాఖలు చేయాల్సి వుంది.” అని కోర్టు పేర్కొంది. ”ఎన్నికల కమిషన్ పేర్కొన్న 11 పత్రాలకు అదనంగా ఆధార్ కార్డు, ఈసీ జారీ చేసిన ఓటరు ఐడి కార్డు, రేషన్ కార్డులను కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించాలని మేం చెబుతున్నాం. ఒకవేళ వాటిని తిరస్కరించేందుకు సరైన కారణాలు వున్నట్లైతే తిరస్కరించండి, కానీ కారణాలేంటో చెప్పాలి.” అని జస్టిస్ ధూలియా స్పష్టం చేశారు. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉందని, 2న కోర్టు తిరిగి దీనిపై విచారణ చేపట్టినట్లైతే… ఒకవేళ కోటి మంది ప్రజలు ఈ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయినట్లైతే అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవచ్చని రాకేష్ ద్వివేది సూచించారు.
ఈసీ టైమ్‌లైన్ పట్ల న్యాయమూర్తి సందేహాలు
ఎన్నికల కమిషన్ టైమ్‌లైన్‌ల పట్ల న్యాయస్థానానికి తీవ్రమైన సందేహాలు వున్నాయని జస్టిస్ ధూలియా అన్నారు. జనగణనకే ఏడాది సమయం తీసుకుంటున్నప్పుడు ఇసి డెడ్‌లైన్ కేవలం 30రోజులే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ‘ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక వ్యక్తి తన ఓటును కోల్పోతే ఇక అడిగేందుకు సమయం వుండదు, ఓటర్ల జాబితా ఖరారైన తర్వాత ఇక న్యాయస్థానాలు కలగచేసుకోవు’ అని అన్నారు. ఇలాంటి సందేహాల కారణంగా ఈ ప్రక్రియను నిలుపుచేయవద్దని రాకేశ్ ద్వివేది కోరారు. గత దశాబ్ద కాలంలో 70లక్షల మంది బీహార్ నుంచి వలస వెళ్లారని, అందుకోసమే ఎస్‌ఐఆర్ చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లక్షమందికి పైగా అధికారులు, వాలంటీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇలా అందరూ ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారని, ఇదొక బృహత్తరమైన ప్రక్రియ అని చెప్పారు.
‘పౌరసత్వం’పై పరిశీలన ఎందుకు?
‘బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలోకి పౌరసత్వం అంశాన్ని ఎందుకు తీసుకుపోతున్నారు? అది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని విషయం కదా’ అని సుప్రీంకోర్టు బెంచ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ‘ఒకవేళ బీహార్ ఎన్నికల జాబితా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పౌరసత్వాన్ని పరిశీలించాలని మీరు అనుకుంటే ముందుగానే ఆ పని చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యం జరిగిపోయింది’ అని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ రాజ్యాంగంలోని 326వ అధికరణ ప్రకారం ఓటరుగా అర్హత పొందాలంటే పౌరసత్వాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈసీ నిబంధనలేమిటి?
బీహార్ ఎస్‌ఐఆర్ కింద, 2003 ఓటర్ల జాబితాలో వున్నవారు రుజువును చూపిస్తే సరిపోతుంది. మిగిలిన వారు అంటే 2003 తర్వాత పేరు నమోదు చేసుకున్న వారు తప్పనిసరిగా ఆ 11 పత్రాల జాబితా (ప్రస్తుత ఓటర్ల కోసం ముందే నింపిన జనగణన ఫారంతో పాటు) నుంచి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పత్రాలను అందజేయాల్సి వుంటుంది. తమ పుట్టిన తేదీ లేదా పుట్టిన ప్రాంతం వివరాలను ధ్రువీకరించేందుకు వారు ఈ వివరాలు సమర్పించాల్సి వుంటుంది. పౌరసత్వాన్ని నిర్ణయించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈసీ తాజా ఆదేశాల మేరకు వీటితోపాటు ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు అదనంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
బీహార్‌లో ‘ఎస్‌ఐఆర్’ ఇప్పుడే ఎందుకు?
- Advertisement -
- Advertisement -