Friday, July 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రెజిల్‌పై 50శాతం అదనపు సుంకం

బ్రెజిల్‌పై 50శాతం అదనపు సుంకం

- Advertisement -

– వ్యక్తిగత దాడికి దిగిన ట్రంప్‌
– బాల్సొనారోపై ఆరోపణల ఉపసంహరణకు ఒత్తిడి
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా తన వాణిజ్య భాగస్వాములకు సుంకాలపై లేఖలు పంపుతోన్నారు. బుధవారం ఆయన పంపిన ఓ లేఖ మాత్రం మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉండడం విశేషం. వాస్తవానికి ట్రంప్‌ రాస్తున్న లేఖలన్నీ దాదాపు ఒకేలా ఉంటున్నాయి. కానీ బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలాకు పంపిన లేఖ మాత్రం వ్యక్తిగతంగా, ఘర్షణ వైఖరితో కూడి ఉంది. ”స్వేచ్ఛాయుత ఎన్నికలు, అమెరికా పౌరుల మౌలిక భావప్రకటనా స్వేచ్ఛ హక్కులపై బ్రెజిల్‌ కృత్రిమ దాడులు చేస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అమెరికాకు బ్రెజిల్‌ ఎగుమతి చేసే ఏ వస్తువులపై అయినా అదనంగా 50 శాతం పన్ను విధిస్తుంది. ప్రస్తుతం విధిస్తున్న పన్నులకు దీనితో సంబంధం లేదు” అని ట్రంప్‌ తన లేఖలో వివరించారు. ”మీ దేశం వ్యవహరిస్తున్న తీరుతో పోలిస్తే ఈ 50 శాతం అదనపు టారిఫ్‌ చాలా తక్కువ అని దయచేసి అర్థం చేసుకోండి. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను సరిచేయడానికి ఇది అవసరం” అని ట్రంప్‌ తెలిపారు.
రాజకీయ నేత జెయిర్‌ బాల్సొనారోకు వ్యతిరేకంగా మోపిన క్రిమినల్‌ ఆరోపణలను ఉపసంహరించుకోవాల్సిందిగా బ్రెజిల్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్‌ ఈ అదనపు సుంకాల భారాన్ని మోపారని తెలుస్తోంది. ‘ఉష్ణమండల ట్రంప్‌’గా పేరొందిన బాల్సొనారో మాజీ సైనిక కెప్టెన్‌. ఆయన 2019-2023 మధ్యకాలంలో బ్రెజిల్‌కు నేతృత్వం వహించారు. ట్రంప్‌ లాగానే ఆయన కూడా ఎన్నికల ఓటమిని అంగీకరించలేదు. ఫలితాల కచ్చితత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. అనేక న్యాయ వివాదాలను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -