Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంనేర్చుకోవడం నిరంతర ప్రక్రియ

నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ

– గీతంలో ఘనంగా విజేతల దినోత్సవంలో వక్తలు
– విద్యార్థులకు నియామక పత్రాల అందజేత
– రూ 1.4 కోట్ల గరిష్ట వార్షిక వేతనం
– పీఎస్‌యూలకు ముగ్గురు ఎంపిక
నవతెలంగాణ-పటాన్‌చెరు

నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని విద్యార్థులకు పలువురు టెక్‌ వేత్తలు సూచించారు. తమ విద్యార్థులు విద్యా, వృత్తిపరమైన కార్యకలాపాల్లో కొత్త ఎత్తులకు చేరుకోవడానికి, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి గీతం కట్టుబడి ఉందని గీతం యాజమాన్యం నొక్కిచెప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని హైదరాబాద్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ (సీజీసీ)లో మంగళవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్‌ డే) ఘనంగా నిర్వహించారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, సైన్స్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 270కి పైగా దేశీయ, బహుళ జాతి కంపెనీలు.. గీతంలో ప్రాంగణ నియామకాలను నిర్వహించి, బీటెక్‌, ఎంటెక్‌, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీ.ఫార్మసీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ విద్యార్థులను ఎంపిక చేశాయి. రానున్న రెండు నెలల్లో మరో 40కి పైగా కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నట్టు గీతం వర్గాలు వెల్లడించాయి. అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేసిన పలువురు గీతం విద్యార్థులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకున్నట్టు తెలిపారు.
తొలిసారి.. ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) గీతంలో ప్రాంగణ నియామకం చేపట్టి, ముగ్గురు ఈఈసీఈ విద్యార్థులను ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఇంజనీర్లుగా (ఈ-2 గ్రేడ్‌) ఎంపిక చేసిందన్నారు. ఈ ఏడాది ప్రాంగణ నియామకాల్లో స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు రూ.1.4 కోట్ల గరిష్ఠ వార్షిక వేతనం పొందగా, బిజినెస్‌ రూ.10 లక్షలు, సైన్స్‌ రూ.16.42 లక్షలు, హ్యుమానిటీస్‌ రూ.8.5 లక్షలు, ఫార్మసీ రూ.6 లక్షల గరిష్ఠ వార్షిక వేతనాలు పొందినట్టు వెల్లడించారు. కాగా గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు రూ. 6 లక్షల సగటు వార్షిక వేతనం పొందగా, స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ రూ.7.5 లక్షల సగటు వార్షిక వేతనం పొందినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.సురేష్‌ కుమార్‌, ఇనోవాలోన్‌ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ పద్మ దుడ్డు, ఇండియా టెక్‌ ఆక్యూరేట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అండ్‌ జనరల్‌ మేనేజర్‌ కార్తీక్‌ యలమంచిలి, హైదరాబాద్‌ గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్‌ డీఎస్‌ రావు, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీఆర్‌ శాస్త్రి ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జి.శివకుమార్‌, డాక్టర్‌ దివ్య కీర్తి గుప్తా, డాక్టర్‌ మోతాహర్‌ రెజా, డాక్టర్‌ బందన కుమార్‌ మిశ్రా, కె.ప్రదీప్‌, కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మమత, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.త్రినాథరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, పలు విభాగాధిపతులు పాల్గొన్నారు.
నా కెరీర్‌ రూపొందించడంలో ‘గీతం’ కీలక భూమిక : ప్రియంకా రెడ్డి, కారుమూరు
గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన సీఎస్‌ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంక రెడ్డి ప్రాంగణ నియామకాల్లో ప్రతిష్టాత్మక అమెజాన్‌కు అత్యధిక వార్షిక వేతనం రూ.1.4 కోట్లకు ఎంపికయ్యారు. గీతంలో తన ప్రయాణాన్ని ప్రియాంక గుర్తుచేసుకుంటూ.. తన కెరీర్‌ రూపొందించడంలో గీతం కీలక భూమిక పోషించిందని తెలిపారు. అక్కడున్న అత్యాధునిక ప్రయోగశాలలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, విజ్జాన కేంద్రంగా విరాజిల్లుతున్న నాలెడ్జి రిసోర్స్‌ సెంటర్‌ వంటివి తన జ్జాన సముపార్జనకు ఎంతో ఉపకరించాయన్నారు. తాను ఈ స్థాయి ఎదగడానికి సహకరించిన అధ్యాపకులు, మరీ ముఖ్యంగా ప్రాజెక్టు మార్గదర్శికి ప్రత్యేక కృతజ్జతలు చెప్పారు. తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి, తాను కోరుకున్న ఉద్యోగం సాధించడానికి తోడ్పడిన గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ (సీజీసీ) సేవలను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img