Saturday, July 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమలాలా… ఓ ప్రేరణ

మలాలా… ఓ ప్రేరణ

- Advertisement -

తన పదిహేడవ యేటనే నోబెల్‌ శాంతి పురస్కారాన్ని పొందిన అతి చిన్న వయస్కురాలిగా మలాలా యూసఫ్‌జారు రికార్డును నెలకొల్పడం మనకు తెలుసు. బాలికలకు విద్యా హక్కు, లింగ సమానత్వం, మహిళా సాధికారత లాంటి సామాజిక సవాళ్లను అతి చిన్న వయస్సులోనే చేపట్టి ప్రపంచ మానవాళి దృష్టిని ఆకర్షించిన మలాలా యూసఫ్‌జారు జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఐరాస నేతృత్వంలో ప్రతి యేటా ”మలాలా దినోత్సవం” పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అసమాన ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన చిన్నారి ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలో ఒకరుగా పేరుగాంచింది. ”ఒక బిడ్డ, ఒక టీచర్‌, ఒక పుస్తకం, ఒక కలం ప్రపంచాన్ని మార్చగలవు” అని నమ్మే మలాలా యూసఫ్‌జారు పాకిస్థాన్‌లోకి ఒక చిన్న పట్టణం ”మింగోరా”లో 12 జూలై 1997న జన్మించింది. 2007లో ఆ చిన్న పట్టణం తాలిబన్‌ తీవ్రవాదులు అధీనంలోకి తీసుకొని బాలికలు పాఠశాలకు వెళ్లవద్దని, సంగీతం వినొద్దని, టీవీలు చూడవద్దని మూర్ఖంగా నిషేధం విధించారు. చదువు మీద అమితాసక్తి కలిగిన మలాలా ధైర్యంగా తాలిబన్ల నిర్ణయాన్ని ఎదిరించింది. 2009లో బిబిసి ఉర్దూ మీడియాకు ఈ విషయం గూర్చి తెలపడంతో ప్రతీకారంగా 2012లో ఆమెను తాలిబాన్‌ ముష్కరులు కాల్చడంతో తీవ్రంగా గాయపడింది. ఆ దాడి నుంచి బయటపడి ఇంగ్లాండ్‌లో చికిత్స తీసుకుని, అక్కడే తన కుటుంబంతో స్థిరపడింది.
2013లో తన పదహారో పుట్టిన రోజున మలాలా యూసఫ్‌జారు ఐక్యరాజ్యసమితిలో ఒక శక్తివంతమైన ప్రసంగం చేసి ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అదే రోజున ఐరాస చొరవ తీసుకొని మలాలా యూసఫ్‌జారు పుట్టిన రోజు 12 జూలైన ప్రతి యేటా మలాలా దినోత్సవం పాటించా లని ప్రపంచ దేశాలను కోరింది. ”ఐ యామ్‌ మలాలా” అనే పేరుతో తన ఆత్మకథను పుస్తకరూపంలోకి తెచ్చి ప్రపంచ మానవాళికి ప్రేరణగా నిలిచింది. ప్రాణాంతక దాడికి భయపడకుండా బాలికల విద్యాహక్కు కోసం గళం విప్పి నిప్పులు చెరిగింది. సవాళ్లను, పేదరికాన్ని ఎదిరిస్తూ బాలికలు చదువుకోవాలని మలాలా ధైర్యంగా పిలుపు నిచ్చింది. బాలికలు, మహిళలను రెండవ శ్రేణి వ్యక్తులుగా చూడడం తగదని పురుషాధిక్య సమాజాన్ని మేల్కొలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న మలాలా మనందరికీ ఆదర్షప్రాయు రాలిగా నిలుస్తున్నది. పుస్తకం, కలం మాత్రమే శక్తివంతమైన ఆయుధాలని పిలుపును ఇవ్వడం, కత్తి, కలంతో పాటు స్త్రీ శక్తి కూడా అత్యంత బలవంతమైనవే అని గళం విప్పిన మలాలా ప్రభావం నేడు ప్రపంచ బాలికలకు దారి దీపంగా మారింది. కోట్ల మంది చిన్నారులకు ఆరాధ్యంగా, స్ఫూర్తినిచ్చే అసాధా రణ చిన్నారిగా నిలిచింది. అమ్మాయిలు చదువుకొని, ఎదిగి, సమాజంలో రాణించాలని మలాలా జీవితం మార్గనిర్దేశనం చేస్తున్నది. మలాలా జీవిత కథ ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించింది. బాలికల, యువతులకు సాధికారత కల్పించా లనే మలాలా సందేశం నిజం కావాలి. దానికి లింగ సమాన త్వం సాధించడానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది.
(నేడు మలాలా జన్మదినం
– డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి,
9949700037

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -