ఓవైపు కేంద్రప్రభుత్వ వర్గాలు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతూ అధికారిక ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. మరోవైపు ఎక్కడచూసినా అవి ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. చమురు కంపెనీల లాభాపేక్షకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలోనూ బంకుల్లో పెట్రోలియం ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఉత్పత్తుల కొరత, సరఫరాలో అడ్డంకుల మూలంగా సామాన్య ప్రజలు భారీగా నష్టాలతో పాటు కష్టాలనూ చవిచూడాల్సి వస్తున్నది. మోడీ సర్కారు లోపభూయిష్టమైన విదేశాంగ విధానం మూలంగా దేశం భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించకపోగా ఇజ్రాయిల్‌కు మద్దతిచ్చింది. మన విశ్వగురు చేసిన తప్పుకు ప్రజల ఆర్థిక, రవాణా అవసరాలను తీవ్రంగా దెబ్బతీసింది. మిత్ర దేశమైన ఇరాన్ మన అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చింది. అయినప్పటికీ కొరత పరిస్థి తులను ఎదుర్కోవడంలో, చక్కదిద్దడం లోనూ కేంద్ర సర్కార్ ఘోరంగా విఫల మైంది. పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిమ్మకు నీరెత్తి నట్టుగా వ్యవహరిస్తున్నది. ఎంతసేపూ స్వార్థ, మతోన్మాద రాజకీయ ప్రయోజనాలు మినహా దేశ ప్రజల బాగోగుల గురించి పట్టించుకునే ధ్యాసే కరువైంది.
పెట్రోల్, డీజిల్, వాహనాల గ్యాస్‌తో పాటు వంటగ్యాస్ కూడా అందుబాటులో లేదనే ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవు తున్నాయి. తెలంగాణలో ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం తో పాటు దినదినగండంగా తయారైంది. కాగా వేసవి నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలు డీజిల్ డిమాండ్‌ను మరింత పెంచాయి. అందుకను గుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోయాయి. 40 నుంచి 45 రోజుల వరకు సరిపడా పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, సరఫరాలో డొల్లతనం బయటపడింది. పెరిగిన డిమాండ్‌ను తీర్చలేకపోయాయి. రేషన్ విధించాయి. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో 1967 టోల్‌ఫ్రీ నెంబరును కేటాయించి ఫిర్యాదులు చేయాలని చెప్పాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో చోటుచేసుకున్న పరిణా మాలను ఎప్పటికప్పుడు అంచనా చేస్తూ అవసరమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెతులేత్తేసాయి.
భారీ క్యూలైన్లతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బం దులకు కారణమయ్యాయి. వంటగ్యాస్ కోసం 45 రోజుల పాటు ఎదురు చూడాల్సిన దుస్థితిని కల్పించాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ కంపెనీ లు సాధారణ ప్రజల అవసరాలతో పాటు వ్యవ సాయ యంత్రాలకు డీజిల్ సరఫరా చేయలేక పోవడంతో రైతులకు తిప్పలు తప్పలేదు. రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తుండటంతో ఎక్కువ సమయం తీసుకోవడంతోపాటు క్యూలైన్లు సైతం ఎక్కడపడితే అక్కడ భారీగా కనిపించాయి. కొరత తరుణంలో ఒకానొక సమయంలో లీటర్ పెట్రోల్‌ను రూ.125 విక్రయించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో స్టాక్ అయిపోయినట్టుగా ప్రచారం జరగడంతో వాహనదారుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఇక్కడ దాదాపు అన్నీ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేసి మూసేశారు.
దాదాపు నాలుగుకోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల జనాభా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే నివాస ముంటున్నది. అందరికీ పెట్రోలియం ఉత్పత్తులు నిత్యావసరం. పెట్రోల్ బంకుల యజమానులు, గ్యాస్‌డీలర్లు యుద్ధం పరిస్థితిని అడ్డుపెట్టుకుని కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వదంతులను కొట్టిపారేయలేం. ఎందుకంటే, బ్లాక్‌లో ఇష్టారీతినా రేట్లు పెంచి అమ్మడమే దీనికి సాక్ష్యం.
ఎక్కడ చూసినా నోస్టాక్ కనిపిస్తుండటంతో సామాన్య వాహనదారుల బాధలు వర్ణణా తీతం. ద్విచక్ర వాహనాలకు రూ.200, కార్లు, ఇతర వాహనా లకు రూ.వెయ్యి చొప్పున రేషన్ విధించి అమ్ముతున్నారు. ఆర్థికపరమైన లాభాల కోసం చమురు కంపెనీలు సృష్టించిన కొరతను నివారించడంలో మోడీ సర్కార్ చర్యలు తీసుకోలేదు. తద్వారా పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారానికి కారణమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచలేదనీ, అవి పూర్తికాగానే పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదనే వ్యాఖ్యానాలు మేధావులు, రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. యుద్ధాన్ని ఆపలేకపోయిన మోడీ సర్కారు, భవిష్యత్‌లో ఏర్పడే చమురు సంక్షోభానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనిపై ప్రధాని మౌనం దేశాన్ని మరింత సంక్షోభంలోకి పడేయటమే అవుతుంది. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలి. పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండే విధంగా చూడాలి.
పెట్రో భయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



