Thursday, July 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదేశవ్యాప్తంగా ఇక జంతర్ మంతర్లు, ఉద్యమాలు!

దేశవ్యాప్తంగా ఇక జంతర్ మంతర్లు, ఉద్యమాలు!

- Advertisement -

‘‘మనమంతా అమాయకుల్లా పుడతాము. కానీ, పెరుగుతున్నా కొద్దీ మూర్ఖులుగా మారి, అలాగే- కొనసాగుతూ ఉండాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది!’’ బెంజమిన్ ఫ్రాంక్లిన్, బహుముఖ ప్రజ్ఞాశాలి, అమెరికా. ​ప్రభుత్వంలో ఉండి అధికారం చలాయిస్తున్న వారే కాదు, సమాజంలో సామాన్య పౌరులు కూడా నైతికత అనేది లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు. నీతి, నిజాయితీ బొత్తిగా లేకుండా పోతున్నాయి. రూ.రెండు వేలో, మూడు వేలో ఎవరిస్తే వారికే ఓటేస్తున్నారు. ఆ బుద్ది తక్షణం మార్చుకోవాల్సి ఉంది. ఆ మూడు వేలతో వాడి జీవితం బాగుపడుతుందా? కుటుంబం నిలదొక్కుకుంటుందా? సమస్యలు తీరతాయా? తాత్కాలిక స్వల్ప ప్రయోజనాలను చూసుకుని, సమాజాన్ని అతి దారుణంగా భ్రష్ణు పట్టిస్తున్నారు కదా? లక్ష రూపాయల జీతం తీసుకునే వాడు ఏదో పని చేయమని వచ్చిన పేద రైతును పీడించి లంచం లాగుతున్నాడు. నీతిగా బతకడం, నిజాయితీగా వ్యవహరించడమన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన అంశం. అన్ని స్థాయిలలో మను షులంతా అవినీతి, మోసం, దగా, కుట్రలను పక్కన పెడితే, మనం ఉన్నచోటనే ‘స్వర్గం’ దిగొస్తుంది కదా? కానీ, ఈ దేశంలో ఏం జరుగుతూ ఉందీ? మారణహోమాల సృష్టికర్తలే నేతలవుతున్నారు.

గత కాలపు త్యాగధనుల గూర్చి చులకనగా మాట్లాడి, వారి గూర్చి తప్పుడు కథనాలు ప్రచారం చేసేవారిని ఈ జనం ఎందుకు అధికారంలో కొనసాగనిస్తున్నారూ? అంటే- జనంలో కూడా అధిక సంఖ్యా కులు అవినీతి పరులవుతున్నారు కదా? అంతరాత్మల్ని చంపు కుని బతుకుతున్నారు కదా? అల్ప సంఖ్యాకులైన మేధావుల్లో ఒక రకమైన అలసత్వం కూడా ఒక కారణమవు తోంది. కొందరు పూటకు లేక అవినీతికి పాల్పడితే, మరి కొందరు కొవ్వెక్కి బలుపుతో పాల్పడుతున్నారు. విషయం లోతుగా ఆలోచించిచూడండి! వాస్తవమేదో ఎవరిది వారికే అర్థమవు తుంది! ప్రస్తుత మోడీ పాలనలో భారతదేశ పరిస్థితి ఎంత దిగజారిందో ఈ అంతర్జాతీయ సూచి తెలియజేస్తుంది 1.వైద్య సదుపాయాల లభ్యత విషయంలో దేశం ఎక్కడో చిట్ట చివరన 193వ స్థానంలో ఉంది. 2. పర్యావరణ పనితీరులో 176వ స్థానంలో ఉంటే, 3. పత్రికా స్వేచ్ఛలో 151 స్థానంలో ఉంది. 4 మానవాభివృద్ధి విష యంలో 130వ స్థానమైతే 5. తాగునీటి నాణ్యత సూచిలో 120వ స్థానం. 6.ప్రపంచ ఆకలి సూచిలో 102వ స్థానం (మన చుట్టున్న చిన్నచిన్న దేశాలు కూడా ఈ విషయంలో మనకంటే మెరుగా ఉన్నాయి.) 7. అవినీతి ర్యాకింగ్‌లో 91. గత పన్నెండేండ్లలో దేశం ఎంత ప్రమాద కరంగా తయారయ్యిందో తేటతెల్లమవుతూ ఉందికదా! ఇదిలా ఉంటే 2002లో మానవత్వానికి ప్రమాదకారులు అని ఒక ఇద్దరు వ్యక్తుల గూర్చి ఈ దేశపు సుప్రీంకోర్టే చెప్పింది.

‘‘ఇండియా టుడే’’ అనే ఇంగ్లీషు పత్రిక నరేంద్ర మోడీ ముఖచిత్రం ప్రచురించి విద్వేషపు హీరో అనే శీర్షిక ఇచ్చింది. తెహల్కా – అమిత్ షా ఫొటో ప్రచురించి ‘‘ఇతను ఇంకా స్వేచ్ఛగా ఎందుకు బయట తిరుగుతున్నారు?’’ అని ప్రశ్నించింది. అలాంటి వారిని ప్రధానిగా, గృహమంత్రిగా ఈ దేశ ప్రజలు ఎన్నుకుని అక్కడ కూర్చోబెట్టారంటే, ఈ దేశ ప్రజల విజ్ఞతను, దేశంలోని వ్యవస్థలను అనుమానించాల్సిందే కదా? ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యామంత్రిగా దేశంలో పేపర్లన్నీ లీక్‌ చేయించాడు. విద్యా వ్యవస్థను ధ్వంసం చేశాడు. నీట్ పేపర్ లీక్‌ల వల్ల సుమారు ఇరవై రెండు మంది విద్యార్థులు అత్మహత్యలు చేసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (‌సిజెపి) రంగ ప్రవేశం చేసి, ఒక మహోద్యమం చేస్తేగాని ఈయనకు తన తప్పులు తెలిసి రాలేదు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ దాకా సాగిన విద్యార్థుల ర్యాలీ మీద అమిత్ షా లాఠీచార్జి చేయించాడు. బాష్పవాయువు, ఫెల్లెట్ గన్స్ వగైరా ఉపయోగించి వందల మంది యువతీ యువకుల్ని గాయపరిచాడు. పోలీసు యూనిఫాంలలో బీజేపీ-ఆరెస్సెస్ గుండాల్ని ప్రవేశపెట్టి, ఆడపిల్లల బట్టలు చింపేయించాడు. ఒకప్పటి జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని కండ్లకు కట్టించాడు. శాంతి ప్రదర్శనల్ని అడ్డుకుని, ఇంత విధ్వంసం సృష్టించడం అవసరమా? యువతీ యువకులు-విద్యార్థులంటే ఎవరూ? ఈ దేశానికి భవిష్యత్తుకదా? ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ లేకుండా చేసి, లోకల్ ట్రెయిన్లు ఆపేయించి, వారికి నీళ్లు, ఆహారం అందకుండా కూడా చేశారు. అయినా ఏమైంది ఈ దేశ యువత ఆత్మవిశ్వాసం ముందు, సహనం ముందు, రాజ్యాంగ స్ఫూర్తి ముందు మోడి, షా లే కాదు, కేంద్ర ప్రభుత్వమే మోకాళ్ల మీద కూచుంది. గత పన్నెండేండ్లలో ఎంత నాశనం చేసినా, దీన్ని యువత పునరుద్ధరించుకుంటుదన్న విశ్వాసం ఇప్పుడు ఈ దేశ పౌరులకు కలిగింది.

ఇక్కడ ఏ ఒక్కరిద్దరి గురించి చెప్పుకోవడం కాదు, మొత్తానికి మొత్తంగా మంత్రి వర్గంలో ఉన్న వాళ్లంతా ఘనాపాటులే! ఎస్. జయశంకర్ ఉన్నాడంటే విదేశాంగ విధానాన్ని ధ్వంసం చేసి కూచున్నాడు. ప్రపంచ దేశా లలో గతంలో ఉన్న విలువ ఇప్పుడు దేశానికి లేదు. హర్దీప్‌ పురి పెట్రోల్, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచాడు. నిర్మలా సీతారామన్ నిత్యావసర వస్తువుల ధరల్ని చుక్కలు తాకించింది. మోహన్ యాదవ్ భూ కుంభకోణం చేయించాడు. ఇక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ దగ్గరుండి అయోధ్య రామాలయం నుంచి- ప్రజల కానుకలు, విరాళాలు స్వాహా చేయించాడు. ‘‘ఇలా చిన్న పనులెందుకురా బాబూ నేను చూడండి దేశ విదేశాలు విరివిగా తిరుగుతూ దేశాన్నే అమ్ముకొస్తున్నాను’’ అని చెప్తున్నాడు మోడీ! వీళ్లంతా కలిసి దేశ ప్రజల్ని ఎలా భయపెడుతున్నారో చూడండి.. దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువులు ప్రమాదంలో ఉన్నారని ఊదర గొడతున్నారు. ఇక్కడ ఒక్క విషయం ఆలోచిద్దాం – దేశ ప్రధాని హిందు. హోం మంత్రి, రక్షణమంత్రి హిందువులే. ఇరవై మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులంతా హిందువులే అయినా కూడా, హిందువులు ప్రమాదంలో ఉన్నారని ప్రచారం ఎందుకూ? ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అందరికందరు హిందువులే అధికారంలో ఉండి, దేశంలోని హిందువులకు రక్షణ కల్పించలేక పోతే ఇంకా అక్కడ అధికార పీఠాల మీద ఎందుకూ? రాజీనామాలు చేసి తప్పుకోవచ్చుకదా? హిందువులకే కాదు, మొత్తం దేశ ప్రజలకు రక్షణగా ఉండేవారు ఎవరో వస్తారు. విద్యావంతులు, వివేచన గలవారూ చాలామందే ఉన్నారు దేశంలో- మోడీ- అంటే మోసం! బీజేపీ- అంటే వినాశనం!! అన్న భావన దేశ ప్రజలు, ముఖ్యంగా యువత అర్థం చేసుకుంది.

ఇంకా వీరి ఆటలు ఎక్కువకాలం సాగవు. మొదటి నుంచీ మోసాలే కాదా? మోసం తర్యాత మోసం. ఎలక్టోరల్‌ బాండ్స్- మోసం. పి.యం. కేర్స్ – మోసం. నమామి గంగే మోసం. స్మార్ట్ సిటీ మిషన్ అమలు- మోసం. అదానీ హిండెన్ బర్గ్ సమస్య- మోసం. కొనసాగిన ‘వ్యాపం’ మోసం. ‘సెబీ’లో తప్పులు – మోసం. మోహన్ యాదవ్‌ ఉజ్జయిని – మోసం. అయోధ్య రామాలయ విరాళాలు పెద్ద మోసం. పంజాబ్ నేషనల్ బ్యాంకు – నీరవ్ మోడీ దోపిడీ-మోసం. కోవిడ్-19 వైద్య పరికరాలు మందుల సరఫరా – మోసం. చెప్పు కుంటూ పోతే ఎన్నని? గత పన్నెండేండ్లలో భాష్టాచారం వృద్ధి చెందింది. సామాన్యులకు, నిస్సహాయులకు ఏ సహాయమూ లేదు. అధికారంలో కొనసాగడమే తమ విధానమన్నట్లున్న ఈ బీజేపీ అహంకారాన్ని – ఈ దేశపు యువత బద్దలు కొట్టింది! వైష మ్యాలు పక్కన పెట్టి ప్రతిపక్షాలు ఐక్యమత్యంగా ఉంటే, మార్పు సత్పరమే సాధ్యమవుతుంది!! ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలవోకగా యువతని, నిరుద్యోగుల్ని, కాక్రోచ్‌లని, పరాన్న జీవులని, సోమరిపోతులని ఎద్దేవా చేశాడు. అందులో నుంచి కాక్రోచ్(బొద్దింక) అనే పదాన్ని తీసుకుని బోస్టన్ యూని వర్సిటీ స్కాలర్ అభిజీత్ దీప్కె కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి)కి రూపకల్పన చేశాడు. ఇన్‌స్టా గ్రాం ద్వారా కోట్లాది యువతీ యువకుల్ని, విద్యార్థుల్ని ఆకర్షించాడు. ఇండియాకు తిరిగి వచ్చి, ఇక్కడి నీట్ పేపర్ లీక్ పై దృష్టి పెట్టి, బాధ్యుడైన కేంద్ర విద్యామంత్రి రాజీనామాకు పట్టుబట్టాడు. సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావి వీరికి తోడు నిలిచి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం వల్ల, సిజెపి ఉద్యమానికి ఊపొచ్చింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ యువత ఉద్యమానికి మద్దతు తెలిపాయి.

యువ నిరసన కారులు పార్లమెంట్ వైపు దూసుకొస్తున్నారని తెలుసుకుని మోడీ భయంతో పార్లమెంట్ వెనక గేటు నుంచి పారిపోయాడు. ‘‘విద్యావ్యవస్థలోని లోపాల్ని సవరిస్తా మని’’ అర్ధరాత్రి ఇంట్లో కూర్చుని వీడియోలు చేసి విడుదల చేశాడు. ఏమైనా ఆహంకారంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి బొద్దింక – యువత కండ్లు తెరిపించింది. ఎంతటి బలమైన ప్రభుత్వమైనా, ప్రజాబలం ముందు దిగదుడుపేనన్నది మరోసారి రుజువైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో, మంత్రులు నడ్డా, జితేంద్ర ప్రసాద్‌లతో జరిపిన చర్చలతో కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు సంతృప్తి పడలేదు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారినందరినీ పదవుల్లోంచి తొలగించడమన్నది అక్కడ ప్రధానమైన అంశం అయింది. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పించడం మరో ముఖ్యమైన అంశం. బీజేపీ ప్రభుత్వం చేయించిన దౌర్జన్య కాండలో గాయపడిన వారికి వైద్యమందించడం, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు కొట్టి వేయించడం వంటి ఉద్యమకారుల డిమాండ్లన్నీ నెరవేరాయి. కాక్రోచ్ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ దేశ యువత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకున్నందుకు ఈ దేశ పౌరులందరూ గర్వపడ్డారు. ఉద్యమించిన ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులకు ఈ దేశ పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఒకవైపు దేశంలో పాఠశాలలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం భయపెడుతోంది. సిలబస్‌లో అధ్వాన్నమైన మార్పులు చేసి, దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారు.

ఇవన్నీ ఎంత బలంగా సాగుతూ వస్తున్నాయో యువత పూర్తిగా అర్థం చేసుకుంది. అన్ని అవకతవకల్ని సరి చేయాల్సిన బాధ్యత తమదేనన్నది కూడా యువత గ్రహించింది. అధికారంలో ఉన్న వారిని బాధ్యుల్ని చేసి, వారిని లైన్‌‌లో పెట్టాల్సి ఉందన్నది కూడా గ్రహించింది. దేశంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన ఈ ప్రభుత్వానికి – ఇక ఇప్పుడు ప్రజాహితం కోసం పని చేయాల్సి ఉందన్న విషయం గుర్తు చేయదలిచింది. కొంతమంది స్వతంత్ర జర్నలిస్టులు ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతంలో బీజేపీ-అరెస్సెస్ గుండాలు చేసిన దాష్టీకాన్ని చిత్రీకరించి, బయటి ప్రపంచానికి పంపారు. విద్యార్థుల మీద రాళ్లు, గాజుపెంకులూ రువ్వడానికి వారు ఒక లారీ తెచ్చిపెట్టుకున్న విషయం బయట పెట్టారు. పోలీసులు వారికి సహకరించిన విషయం కూడా ఎత్తి చూపారు. అంతేకాదు, పోలీసులే స్వయంగా హద్దు మీరి అమ్మాయిల్ని చితక బాదిన విషయం చిత్రీ కరించారు. మరొక ముఖ్యమైన విషయమే మంటే, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అధిక సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములు కావడమన్నది ఆహ్యానించదగ్గ విషయం! సోనమ్ వాంగ్ చుక్ మాత్రమేకాదు, ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ) అధ్యక్షురాలు జేఎన్ఐయులో పిహెచ్.డి స్కాలర్ అయిన స్నేహ బొరా అనే యువతి కూడా 23 రోజులు నిరాహార దీక్ష చేసింది. ఎంతో మంది న్యాయవాదులు దీక్షా స్థలానికి వెళ్లి అక్రమంగా కేసుల్లో ఇరుక్కున్న విదార్థులకు స్వచ్ఛందంగా న్యాయ సలహాలిచ్చారు.

వారి వెంట పోలీసు స్టేషన్లు తిరిగి, వారికి ధైర్యమందించారు. పేరు తెలియని దాతలెందరో మంచినీళ్లు, టీ, ఆహారం తెప్పించి, అక్కడ రోజుల తరబడి ఉంటున్న వేలాదిమంది నిరసన కారులకు పంపిణీ చేయించారు. దేశం నలుమూలల నుంచి అక్కడికి చేరుకున్న సామాజిక, మానవవాద, పౌర హక్కుల కార్యకర్తలు ఉద్యమకారులకు స్ఫూర్తినందించారు. వారిని ప్రోత్సహిస్తూ, వారితో కలిసి పనిచేశారు. ఏమైనా ఇది జెన్- జి సాధించిన ఘన విజయం! గత పన్నేండేండ్లుగా యువతలో పేరుకున్న అశాంతి, నిరాశా, నిస్పృహలు, ఉద్యమ రూపం దాల్చి- అతి పెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ అహంకారాన్ని నేలమట్టం చేశాయి. అయితే, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో సరిదిద్దాల్సినవి, సాధించాల్సినవి చాలా ఉన్నాయి. దేశంలోని ప్రధాన మీడియా సంస్థలన్నీ గోది మీడియాలో భాగమైనప్పుడు, సొషల్ మీడియా వేదికగా పనిచేసి, ప్రభుత్వాన్ని లొంగదీసు కున్నందుకు మనం మన యువతను హృదయ పూర్వకంగా అభినందించాలి! దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకుపోగల సత్తా గల ఈ యువతకు మనమంతా వెన్నుదన్నుగా నిలబడాలి !! దేశ పౌరులు మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధపడాలి.
సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -