ఆత్రగాడికి బుద్ది మట్టు అన్నది ఒక లోకోక్తి. ప్రస్తుతం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలానే ఉంది. ఒక వైపు ఇరాన్‌పై దాడులకు దిగి దాన్ని లొంగదీసుకోలేక హార్ముజ్ జలసంధి నుంచి బయటపడలేక గిలగిలా కొట్టుకుంటున్నాడు. నాటోలోని ఐరోపా, ఆసియా, ఇతర ఖండాల్లోని మిత్రదేశాలేవీ అమెరికాను ఆదు కొనేందుకు ముందుకు రావటం లేదు. వాటి వైఖరిని మింగా కక్కలేక ఉన్నాడు. ఒక వైపు నవంబరు మూడున పార్లమెంటు మధ్యంతర ఎన్నికల గడువు సమీపిస్తున్నది. తన నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే 2028వరకు ప్రతిదానికీ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ మద్దతు మీద ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు టెహరాన్ నేతలను బెదిరిస్తూ ఏదో విధంగా రాజీకి రండిరా బాబూ అన్నట్లుగా సంకే తాలు పంపుతున్నాడు. అయినా ఇరాన్ తమ షరతులపై తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఇటువంటి స్థితిలో బస్తీమే సవాల్ అన్నట్లుగా మిత్ర, శత్రుదేశాలనే తేడా లేకుండా వాటి ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాల యుద్ధాన్ని ప్రకటిం చాడు. అమెరికా ఆధిపత్యం చెల్లదు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా అది ఎంత శాతం పన్ను విధిస్తే అంత మొత్తాన్ని తామూ వసూలు చేస్తామని అన్ని దేశాలూ హెచ్చరి స్తున్నాయి. ఆయా దేశాలు బలవం తంగా శ్రమ చేయిస్తూ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడు తున్నందున అపరాధ సుంకాలు విధిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ట్రంప్ ప్రకటించాడు.
బలవంతగా పని చేయిస్తున్న దేశాల నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత లేదా పన్నుల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్‌నకు రాజకీయంగా ఆ దేశాలను దెబ్బతీసేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు.అమెరికా లేదా ట్రంప్ వైఖరిని చూస్తే గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదన్నది స్పష్టం.తొలిసారి పదవిలో ఉండగా 2018లో ట్రంప్ యంత్రాంగం ప్రారంభించిన వాణిజ్య పోరులో అనేక ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కు తగ్గటం లేదు. సెనెట్ సభ్యుల ప్రతిపాదిత బిల్లు గనుక చట్ట రూపం దాల్చితే రష్యాతో చమురు, ఇతర వాణిజ్య లావాదేవీలు జరిపే మనదేశం, చైనా, మరికొన్ని దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టటం అనివార్యం. వంద శాతం అపరాధ సుంకాలు విధించేందుకు అవకాశం ఉంది. రష్యాను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు దాని చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌తో ఒకవైపు దాడులు చేయిస్తూ మరోవైపు ఆంక్షలను కఠినతరం కావిస్తున్నది. చమురు కొనుగోలు చేసే దేశాలనే కాదు, రవాణా చేసే నౌకలపై కత్తి ఝుళిపించేం దుకు చూస్తున్నది. ప్రస్తుతం ఈజిప్టు నుంచి సింగపూర్ వరకు సముద్రంలో 13.7కోట్ల పీపాల ముడి చమురుతో నౌకలు ఎటుపోవాలో తెలియక తిష్టవేసి ఉన్నాయి. హార్ముజ్ జలసంధి దిగ్గంధన సమయంలో అలాంటి రష్యా చమురును కొనుగోలు చేయవచ్చంటూ ట్రంప్ గతంలో తొలగించిన ఆంక్షల గడువు ముగిసింది. హార్ముజ్‌తో పాటు ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాలను కలిపే బాబ్ ఎల్ మండాబ్ జలసంధి కూడా దిగ్భంధనంలోకి మరోసారి ఆంక్షలను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి రావచ్చు.
చైనా ఇప్పటికే ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది గనుక అమెరికాను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కటం ప్రారంభించింది. ఆంక్షలను ఖాతరు చేయకుండా ఇరాన్, రష్యాల నుంచి దిగుమతులను కొనసాగించింది. అమెరికా మెడలు వంచే స్థితిలో మనం లేమని గతంలోనే రుజువైంది. అమెరికా వత్తిడికి లొంగి ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా చమురు దిగుమతులను తగ్గించుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ అంగీకరించ టంతో మన వస్తువులపై అపరాధ పన్ను మొత్తాన్ని యాభై నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించేందుకు ట్రంప్ అంగీకరిం చాడు. అయితే అదే నెలాఖరులో ఇరాన్‌పై దాడితో హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో మన దేశం తగ్గించటానికి బదులు అదనంగా రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మరోసారి మనకు అలాంటి పరీక్ష పెట్టేందుకు అమెరికా సిద్ధమవుతోంది.
ముందే చెప్పుకున్నట్టు చైనా వస్తువులపై వందశాతం పన్ను విధిస్తానని ట్రంప్ ప్రకటించంతో అమెరికాకు అవసరమైన విలువైన పన్నెండు ఖనిజాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. దాంతో దిగివచ్చిన ట్రంప్ ఈ ఏడాది అక్టోబరుతో ముగిసే గడువుతో ఒక ఏడాది పన్నుల నిలిపివేతకు అంగీకరించాడు.
ఇప్పుడు మరోసారి ఆ గడువు ముగిసిన తరువాత చైనాతో లడాయి పెట్టుకొనేందుకు చూస్తున్నాడు. నవంబరులో ఎన్నికల ముందు ఓటర్లకు చెప్పుకొనేందుకు అది కూడా ఉపయోగపడవచ్చని భావిస్తున్నట్లుంది. చైనా రాజకీయంగా, ఆర్థికంగా అమెరికాకు సవాలు విసురుతున్నది గనుక దాని మీద కక్ష తీర్చుకుంటున్నారని అనుకుందాం. మరి కెనడా అలాంటిది కాదే, తోటి ధనికదేశం. అమెరికా చేసే అన్ని అక్రమాలకు అది మద్దతు ఇచ్చిన చరిత్ర ఉంది, అయినప్పటికీ దాని మీద కూడా పన్నుల కత్తి ఝళిపిస్తున్నాడు ట్రంప్, అమలు చేసినపుడు చూద్దాంలే, ముందే ఎందుకు స్పందించాలని కెనడా ప్రధాని చేసిన ప్రకటన మాదిరి అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి. అందువలన అమెరికా నడక నల్లేరు మీద బండిలా సాగదని గ్రహించాలి!
ముందుంది ముసళ్ల పండగ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


