Thursday, September 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నించే స్ఫూర్తి ఐలమ్మ

ప్రశ్నించే స్ఫూర్తి ఐలమ్మ

- Advertisement -

భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం… భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహత్తర పోరాటం. ఈ పోరాటంలో మట్టిలో మాణిక్యంలా వెలిగింది వీరనారి చిట్యాల ఐలమ్మ. సామాన్య వృత్తిదారుల కుటుంబంలో జన్మించిన ఆమె అన్యాయం, వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడింది. తెలంగాణ చరిత్రలో పోరాటం, ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఐలమ్మ జీవితం నాటి చరిత్ర మాత్రమే కాదు.. నేటి తరానికి అన్యాయాన్ని ప్రశ్నించే స్ఫూర్తి. నాటి భూస్వామ్య వ్యవస్థలో పేదలు, రైతులు, కూలీలు, వృత్తిదారులు తీవ్ర దోపిడీకి గురయ్యేవారు. దొరల గడీల ముందు ఉచితంగా కళ్లాపి చల్లడం, బట్టలు ఉతకడం, క్షౌరం చేయడం, పశువులను శుభ్రం చేయడం వంటి వెట్టిచాకిరీ పనులు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా ఎదిరించారు. ఎవరి అండదండలు లేకపోయినా ధైర్యం, ఆత్మవిశ్వాసం, న్యాయం పట్ల నిబద్ధతతో భూస్వామి విసునూరు రామచంద్రారెడ్డి ఆధిపత్యాన్ని ఎదిరించారు. కమ్యూనిస్టుల సహకారంతో తన భూమిని సాధించుకున్నారు. ఆమె పోరాటం వ్యక్తిగత హక్కు కోసం ప్రారంభమై అణగారిన ప్రజల ఆత్మగౌరవ పోరాటంగా మారిం ది. తెలంగాణ రైతాంగ పోరాటం వెట్టిచాకిరీ నిర్మూలనకు,భూ సంబంధమైన మార్పులకు పునాది వేసింది. వేలాది మంది అమరులైన ఈ పోరాటంలో లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కింది. సుమారు రెండువేల గ్రామాల్లో ప్రజా పాలనకు సంబంధించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఏర్పడ్డాయి.

మారిన వివక్ష రూపాలు
ఐలమ్మ పోరాడిన వెట్టిచాకిరీ, కుల వివక్ష, దోపిడీ రూపాలు మారినా నేటికీ వాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెరలో దేవస్థానానికి వెళ్లిన రజక వృత్తిదారులను అడ్డుకోవడం, ప్రశ్నించిన రజక యువకుడిపై దాడి జరగడం, ఆ ఘటనలో ఆరు నెలల పసిపాప హత్యకు గురైన ఘటన సమాజాన్ని కలచివేస్తుంది. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో శ్రమకు కూలి అడిగిన రజకులను సామాజిక బహిష్కరణకు గురిచేసిన ఘటన కూడా వివక్షకు ఉదాహరణ. ఉత్తర తెలంగాణలో గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో వడ్డెరలు, ఆరెకటికలు, కల్లుగీత కార్మికులు, క్షౌరవృత్తిదారులు, మత్స్యకారులపై సామాజిక బహిష్కరణలు కొనసాగుతున్నాయి. అందుకే చట్టాలు మారినంత మాత్రాన వివక్ష పోదు.. ప్రజల ఆలోచనా విధానం మారాలి. కులం కంటే మనిషి, వృత్తి కంటే శ్రమకు గౌరవం ముఖ్యమని యువత చాటి చెప్పాలి. సామాజిక బహిష్కరణకు గురయ్యే వర్గాలకు అండగా నిలవాలి. కులాంతర వివాహాలు చేసుకునే యువతకు రక్షణ, భరోసా కల్పించే వాతావరణం ఏర్పడేందుకు సమాజం ముందుకు రావాలి. వృత్తి ఆధారంగా మనుషులను చిన్నచూపు చూడటం కూడా కుల వివక్షలో భాగమే. సమాజానికి అవసరమైన సేవలు అందించే రజకులు, క్షౌరవృత్తిదారులు, వడ్డెరలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు తదితర శ్రమజీవులకు గౌరవం, సమాన హక్కులు దక్కాలి. వారి శ్రమను వినియోగించుకుంటూ వారినే సామాజికంగా వెలివేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.

ఆమె స్ఫూర్తి మార్గదర్శకం
నేటి యువత చేతుల్లో ఐలమ్మ కాలంతో పోలిస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. విద్య, విజ్ఞానం, సాంకేతికత, సమాచార వనరులు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాలను కేవలం వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం చేయకుండా సమాజ అభివృద్ధికి ఉపయోగించాలి. అన్యాయం ఎదురైతే ప్రశ్నించాలి.. వివక్ష కనిపిస్తే వ్యతిరేకించాలి.. బలహీన వర్గాల పక్షాన నిలబడాలి.ఐలమ్మ ఎవరి ముందు తలవంచకుండా ఆత్మగౌరవంతో జీవించారు. ఎన్ని కష్టాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. మహిళలు కూడా అన్యాయాన్ని ఎదిరించి ఉద్యమాలకు నాయకత్వం వహించగలరని నిరూపించారు. అందుకే ఆమె మహిళా శక్తికి, సామాజిక సమానత్వానికి, హక్కుల పోరాటానికి ప్రతీకగా నిలిచారు. నేటి యువత ఐలమ్మను కేవలం జయంతి, వర్ధంతి రోజుల్లో స్మరించుకోవడం సరిపోదు. ఆమె ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. కుల వివక్షను ప్రశ్నించాలి. సామాజిక బహిష్కరణను అడ్డుకోవాలి. వృత్తిదారుల శ్రమకు గౌరవం కల్పించాలి. మహిళలపై వివక్షను ఎదిరించాలి. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించే సమాజం కోసం పనిచేయాలి.ఐలమ్మ కాలంలో దొరల పెత్తనాన్ని, వెట్టిచాకిరీని ఎదిరించడం ఎంత అవసరమైందో.. నేడు కుల ఆధిపత్యాన్ని, సామాజిక వివక్షను, శ్రమ దోపిడీని ప్రశ్నించడం అంతే అవసరం. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే ఐలమ్మ స్ఫూర్తిని నిజంగా అందిపుచ్చుకున్న ట్లవుతుంది.
(నేడు ఐలమ్మ 41వ వర్థంతి)

ఫైళ్ల ఆశయ్య, 9490098052

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -