స్వతంత్ర, సమగ్ర పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు జరిపి బహిర్గతం చేసేంత వరకు ఏఐ డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వరాదని, ఇచ్చిన వాటిని అధ్యయనాలు చేసేంతవరకు నిలిపివేయాలంటూ ఏపీలోని విశాఖ పట్నంలో సెప్టెంబరు 6న జరిగిన జాతీయ సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. “విశాఖపట్నం ప్రకటన”ను ఆమోదించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్తమానంలో ఆర్థిక, సమాచార వ్యవస్థల్లో డేటా ఎంతో కీలకంగా మారింది. ఏదైనా కొత్త సమస్యలను సృష్టించకూడదన్నది పారిశ్రామిక విప్లవం నేర్పిన ఒక పెద్దపాఠం. పశ్చిమ దేశాల్లో కొన్ని పరిశ్రమల కాలుష్యం భరించరానిదిగా తయారుకావడంతో జనాల్లో వ్యతిరేకత, ఆరోగ్యం తదితర కారణాలతో ప్రభుత్వాలు అలాంటి వాటిని మూసివేయడం లేదా వేరే దేశాలకు తరలించాలని నిర్ణయించాయి. ఆ సంస్థలు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడిన అధికారంలోని పెద్దలు పెట్టుబడులు, పరిశ్రమల రాక అంటూ ముద్దుపేర్లు తగిలించి తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో కొందరు రాజులు వలసవాదులకు మద్దతు ఇచ్చి దేశాన్ని వారికి ఎలా అప్పగించారో, ఆధునిక కాలంలో కొందరు పాలకులు వినాశకర పరిశ్రమలు, ఉత్పత్తులను అనుమతిస్తున్నారు.
ఉదాహరణకు ఇటలీలో మితేనీ రసాయన కర్మాగారంలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు తయారు చేశారు. దాని కాలుష్యంతో భూగర్భజలాలు కూడా కలుషితమయ్యాయి. సదరు ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లోటే పరశురామ్ అనే ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త ఫ్యాక్టరీ పేరుతో ఏర్పాటు చేసి అదే రసాయనాలను ఉత్పత్తి చేశారు. చైనాకు సైతం అలాంటి కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి. అయితే వాటి ముప్పును గ్రహించిన అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. పాతబడిన నౌకలను ధ్వంసం చేయటం, గ్రీన్ రీసైక్లింగ్ పేరుతో పశ్చిమ దేశాల్లో తయారైన వ్యర్థాలను 2018లో నిషేధించింది. కానీ మనవంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. గ్లైఫోసేట్ అనే కలుపు నివారణ రసాయనాన్ని అనేక దేశాల్లో నిషేధించినా మన దేశం అనుమతించింది. అది కలుపు మొక్కలతో పాటు పచ్చగా ఉండే ప్రతిదాన్నీ హరించడంతో పాటు దాన్ని కూడా తట్టుకొని బతికే కలుపు మొక్కలు విస్తరించటంతో చివరకు నిషేధించాల్సి వచ్చింది.
ఇటీవలి కాలంలో కాలుష్యకారక ఫ్యాక్టరీలు, ఉత్పత్తులతో పాటు డేటా సెంటర్లు కూడా పర్యావరణ సమస్యలను ముం దుకు తెస్తున్నాయి. దాంతో వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడి సర్కార్ విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో తలెత్తే పర్యావరణ ముప్పుపై ఎలాంటి నివేదికలు లేకుండా దొడ్డిదారిన దానికి అనుమతి ఇచ్చారు. అమెరికాను వదలి మనదేశానికి రావటం పెద్ద గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అసలు సంగతేమిటంటే అక్కడ ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో ఇక్కడకు వస్తున్నాయి తప్ప మన మీద ప్రేమ కాదు. డెమాక్రాట్లు లేదా రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు, పట్టణాలు-గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా ఆందోళనలు సాగుతున్నాయి. వాటి సమీప ప్రాంతాల్లోని వారిలో వ్యతిరేకుల సంఖ్య 42 నుంచి 75 శాతానికి పెరిగినట్లు ఆగస్టులో చేసిన ఒక సర్వేలో తేలింది. గాలప్ సర్వేలో 53 శాతం మంది అణు విద్యుత్ కేంద్రాల సమీపంలో నివసించటానికి మొగ్గు చూపగా, డేటా కేంద్రాల వద్ద ఉండేది లేదని 71 శాతం చెప్పటం గమనించాల్సిన అంశం. భూమితో పాటు ఆ కేంద్రాలను చల్లబరచేందుకు భారీ మొత్తంలో నీరు, విద్యుత్ అవసరం. గాలిలో కాలుష్యాన్ని పెంచుతాయి, వాతావరణం వేడెక్కుతుంది. అందుకే సమీపాల్లో నివసించేందుకు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు అవసరమైన అనుమతుల కోసం స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు అందిస్తున్నట్లు ఫుడ్ అండ్ వాటర్ వాచ్ సంస్థ రాజకీయ డిప్యూటీ డైరెక్టర్ థామస్ మేయర్ చెప్పాడు.
మరోవైపు కృత్రిమ మేథ(ఏఐ)తో వచ్చే ప్రయోజనాల గురించి కొందరు నేతలు ఊరిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఏఐ బుడగ పేలిపోయి జూలై నెలలో స్టాక్ మార్కెట్‌లో 2.18 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇలాంటి బుడగలు పేలితే మొత్తం ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమెరికాలో వందలాది సంస్థలతో “డేటా సెంటర్ల నిలిపివేత కూటమి” ఏర్పాటైంది. పర్యావరణ రక్షణ అంశంలో లోపభూయిష్టంగా ఉన్న అమెరికా ఏఐ చట్టాన్ని రక్షించాలంటూ డోనాల్డ్ ట్రంప్ మద్దతుతో కార్పొరేట్ సంస్థలు చేసిన యత్నాన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు వమ్ము చేశాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లోని చట్టసభ సభ్యులు డేటా సెంటర్ల ఏర్పాటును వాయిదా వేయాలని తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ దేశంలో తొలిసారి డేటా సెంటర్లు వద్దని తీర్మానం చేసిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో వీటి ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను గుర్తించారు. వీటి నిర్మాణానికి భారీ యంత్రాల వినియోగంతో ధ్వని కాలుష్యం పెరిగింది. డీజిల్ జనరేటర్లతో వేడి పెరుగుతున్నది, ఎయిర్ కండిషనర్లు నిరంతరం రొద పెడుతున్నాయి. ఈ కేంద్రాలలో రాత్రంతా వెలుగు ఉండటంతో పరిసరాల జనాల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని వెలుగు కాలుష్యం అంటున్నారు. కొన్ని కేంద్రాలు గ్యాస్‌తో నడుస్తూ కాలుష్యాలను విడుదల చేస్తున్నాయి.
ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని మొత్తం డేటా సెంటర్ల కారణంగా 2030 నాటికి ఆరు లక్షల మందిలో ఆస్మా లక్షణాలు కనిపిస్తాయని, 1,300 మంది ముందుగానే చనిపోతారని, ఏటా ఆస్మాతో మరణిస్తున్నవారి కంటే మూడోవంతు మరణాలు పెరుగుతాయని, ప్రజారోగ్య రక్షణకు ఏటా అదనంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తేలింది. ఒక పెద్ద సెంటర్‌లోని కంప్యూటర్ యంత్రాలను చల్లబరచేందుకు రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీరు(అమెరికా గాలన్ 3.8 లీటర్లకు సమానం) అవసరం. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గూగుల్ సంస్థ ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, మరో ఆరింటిని నిర్మిస్తున్నట్లు 2025 నివేదిక ఒకటి వెల్లడించింది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా అనే ప్రాంతంలో నాలుగు కేంద్రాల కారణంగా భూగర్భజలాల కొరత ఉందంటూ 2023లోనే కొత్తగా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేశారు. డేటా కేంద్రాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. వాటికోసం సరఫరా వ్యవస్థల నిర్మాణానికి ఖర్చు తడచిమోపెడు అవుతుంది. ఆ మొత్తాన్ని దామాషా ప్రకారం అయినా గృహ వినియోగదారుల మీద కూడా మోపుతారు, అది వారి మీద అదనపు బాదుడే. ఈ విధంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇరవై శాతం రేట్లు పెరిగాయి.
అంటే కార్పొరేట్ల లాభాల కోసం సాధారణ పౌరులు అదనపు భారం మోయాలి. పౌరుల నుంచి వ్యతిరేకత రావటంతో డేటా సెంటర్లు తమకు అవసరమైన విద్యుత్‌ను వారే ఉత్పత్తి చేసుకోవాలి లేదా స్థానికుల మీద భారం పడకుండా అదనపు చార్జీలు చెల్లించాలని రాష్ట్ర గవర్నర్ జోష్ షాప్రియో ప్రకటించాల్సి వచ్చింది. డేటా సెంటర్లు వద్దనే ఆందోళన ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్‌లోని జీవూల్డే అనే 22 వేల మంది ఉన్న పట్టణంలో మేటా 410 ఎకరాల ప్రభుత్వ భూమిలో 200 మెగావాట్ల కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఆ పట్టణం మొత్తం వినియోగించే విద్యుత్‌కు రెండు రెట్లు ఈ కేంద్రానికి అవసరమని తేలడంతో అక్కడి జనాలు దాన్ని వ్యతిరేకించారు. నెదర్లాండ్స్ ప్రభుత్వమే డేటా సెంటర్లు 70 మెగావాట్లకు మించి పెట్టరాదని నిర్ణయించడంతో మేటా కేంద్రం రద్దయింది. తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డేటా సెంటర్‌ను వ్యతిరేకించిన వారే గెలిచారు. ఐర్లండ్‌లో వ్యతిరేకత కారణంగా యాపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ల ప్రాజెక్టును రద్దు చేసుకుంది. జనాల అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అక్కడి డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం పదేండ్ల క్రితం దేశం మొత్తం వినియోగించే విద్యుత్‌లో కేవలం ఐదు శాతం ఉండగా, గతేడాది 23 శాతానికి చేరింది. 2034 నాటికి 31 శాతం కానుంది.
చిలీలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రంపై పర్యావరణ ప్రభావం గురించి తగిన నివేదిక ఇవ్వక పోవటంతో కోర్టు అడ్డుకున్నది. అదే గూగుల్ మరోచోట ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రాన్ని జనం అడ్డుకున్నారు. ధనిక దేశాల వారు వినోదం కోసం ఏఐ చిత్రాలను రూపొందించేందుకు మా నీటిని ఫణంగా పెట్టి డేటా కేంద్రాల నిర్మాణం అవసరం లేదని చిలీ నీటి హక్కుల సంస్థ ప్రతినిధి టానియా రోడ్రిగజ్ స్పష్టం చేశారు. ఉరుగ్వేలో గూగుల్ తలపెట్టిన కేంద్రానికి 20 లక్షల గ్యాలన్ల నీరు కావాలని తేలటంతో జనం వ్యతిరేకించారు. చివరకు చల్లబరిచేందుకు నీటిని వాడబోమంటూ చిన్న కేంద్రానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల్లో కూడా డేటా సెంటర్లకు వ్యతిరేకత పెరుగుతున్నది. డేటా సెంటర్లకు సంబంధించి కొన్ని అవాస్తవాలు-నిజాల గురించి చూద్దాం. అమెరికా అనుభవంలో నిర్మాణ సమయంలో ఉపాధి తప్ప పర్మినెంట్ ఉద్యోగాలు ఒక పెద్ద కేంద్రంలో 50 నుంచి 150 మందికి లభిస్తాయి. అవి కూడా భద్రతా సిబ్బంది, నిపుణులైన సాంకేతిక నిపుణులకే పరిమితం. అదనపు పెట్టుబడులు, అనుబంధ పరిశ్రమలు, ప్రభుత్వాలకు అదనపు పన్నులూ రావు, ప్రజల సొమ్ము వాటికి ఖర్చు చేస్తారు. స్థానిక వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. జార్జియా రాష్ట్రంలో 70 శాతం కేంద్రాలకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు.
ఈ కేంద్రాలను చల్లబరిచేందుకు ఉపయోగించే నీటిని తిరిగి విడుదల చేసినప్పుడు అవి వేడిగా ఉంటాయి. నీటి వనరులు, పర్యావరణాన్ని ప్రభావితం చేసే కొత్త సమస్యలను సృష్టిస్తాయి. చైనాలో కూడా పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయి. అందుకే చైనా సముద్రాల్లో 35 మీటర్ల లోతులో తేలియాడే వాటిని ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. షాంఘై తీరంలో రెండువేల సర్వర్లు ఉన్న కేంద్రాన్ని 115 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఏర్పాట్ల వలన 90 శాతం ఇంధనం ఆదా అవుతుంది, అవసరమైన విద్యుత్‌లో 97 శాతం సమీపంలోని ఉపరితల గాలి మరల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. బ్రిటన్‌లో మైక్రోసాఫ్ట్ జరిపిన ప్రయోగంలో భూమి మీద ఏర్పాటు చేసిన వాటి కంటే నీటిలో వాటి వైఫల్యాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అయినా వాణిజ్యపరంగా ముందుకు పోలేదు. భూమి మీద ఏర్పాటు చేసే డేటా సెంటర్ల ప్రాజెక్టు మొత్తం విద్యుత్‌లో చల్లబరిచేందుకే 40 శాతం అవసరం కాగా, సముద్రాల్లో వాటికి అది అవసరం ఉండదు. విద్యుత్ వినియోగ సామర్థ్యం సముద్రాల్లో ఎక్కువని తేలింది. నీటి అవసరం ప్రత్యేకంగా ఉండదు. చల్లబరిచేందుకు అవసరమైన వ్యవస్థల ఖర్చు సముద్రంలో తక్కువ, భూమి అవసరం 90 శాతం తక్కువ. ఉపాధి పేరుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి వారు భారీ మొత్తాల్లో అప్పనంగా సబ్సిడీలు ఇస్తున్నపుడు ఎవరైనా వాటిని ఎందుకు వదులుకుంటారు? ప్రత్యామ్నాయాల వైపు చూడటానికి వారేమైనా ప్రజల పక్షం వహించేవారా!
ఎం కోటేశ్వరరావు
8331013288



