విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ప్రదానం చేసే సంస్థలు కావు. అవి జ్ఞానాన్ని సృష్టించే కేంద్రాలు.. విమర్శనాత్మక ఆలోచనకు నిలయాలు.. సమాజాన్ని ప్రశ్నించే మేధావులను తీర్చిదిద్దే వేదికలు. అందుకే విద్యా, పరిపాలనా, ఆర్థిక అంశాల్లో వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. అయితే తెలంగాణలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ స్వయం ప్రతిపత్తి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగుల జీతాలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడం, విశ్వవిద్యాలయాల ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రభుత్వానికి బదిలీ చేయాలనే ప్రతిపాదనలు ఆర్థిక స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సహాయం అందించడం దాని బాధ్యతే. అయితే ఆ సహాయాన్ని పరిపాలనా నియంత్రణకు సాధనంగా మార్చడం మాత్రం ఉన్నత విద్యకు మేలు చేయదు. ఆర్థిక స్వయం ప్రతిపత్తి బలహీనపడితే క్రమంగా పరిపాలనా, అకాడమిక్ స్వేచ్ఛ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. రేపు రోజువారీ నిర్వహణ ఖర్చులకూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ శాఖలకు పొడిగింపులుగా మారే ప్రమాదం ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక సంఘాల ఎన్నికలు సంవత్సరాలుగా జరగకపోవడం కూడా ప్రజాస్వామ్య వాతావరణాన్ని బలహీనపరిచిందనే విమర్శలు ఉన్నాయి. సమస్యలపై అధ్యాపకులు సంఘటితంగా స్పందించే వేదికలు తగ్గడంతో ప్రశ్నించే గొంతుకలు కూడా బలహీన పడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజా ప్రయోజన అంశాలపై మాట్లాడే అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుంటు న్నారనే ఆరో పణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో చర్చల సంస్కృతికి బదులుగా మౌనం పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపక సంఘం (ఓయూటీఏ) ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఇవి కేవలం ఒక సంఘానికి నాయకత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలు కావు. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తి, అధ్యాపకుల హక్కులు, అకాడమిక్ స్వేచ్ఛ, ఉన్నత విద్య పరిరక్షణ కోసం గళమెత్తే నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియగా చూడాలి. గతంలో ఉస్మానియా అధ్యాపక సంఘం విశ్వవిద్యాలయ హక్కులు, అధ్యాపకుల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల కోసం అనేక సందర్భాల్లో ముందుండి పోరాడింది. ప్రస్తుతం కూడా అదే పోరాట స్ఫూర్తి అవసరం. బలమైన, స్వతంత్ర, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండే అధ్యాపక సంఘం ఉంటేనే విశ్వవిద్యాలయ సమస్యలపై సమర్థంగా స్పందించ గలదు. అధ్యాపకులు సంఘటితంగా మాట్లాడితేనే విశ్వవిద్యా లయ స్వయం ప్రతిపత్తిని కాపాడే బలమైన స్వరం వినిపిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్ర కూడా ఈ సందర్భంలో గుర్తుకు వస్తుంది. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు ఉస్మానియా క్యాంపస్ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. అన్యాయాన్ని ప్రశ్నించడం, సామాజిక న్యాయం కోసం గొంతెత్తడం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడటం ఆ క్యాంపస్ సంప్రదాయం. అలాంటి ఉద్యమ చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయంలో నేడు ప్రశ్నించే స్వరాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమే. విశ్వవిద్యాలయాల సొంత నిధులు, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వెళితే భవిష్యత్తులో పెన్షన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కూడా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన అధ్యాపకుల్లో ఉంది. స్టేషనరీ, తాగునీరు, ఇతర సాధారణ నిర్వహణ ఖర్చులకు కూడా ప్రభుత్వ అనుమతి అవసరమయ్యే పరిస్థితి వస్తే, అది స్వయం ప్రతిపత్తి క్షీణిస్తున్నదనే సంకేతంగా భావించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సహాయం అందించాలి. కానీ ఆర్థిక సహాయాన్ని నియంత్రణకు సాధనంగా మార్చకూడదు. స్వయం ప్రతిపత్తి, అకాడమిక్ స్వేచ్ఛ, విద్యార్థి సంఘాల ఎన్నికలు, అధ్యాపక సంఘాల ఎన్నికలే బలమైన విశ్వవిద్యాలయాల పునాదులు. ఈ పునాదులు బలహీనపడితే దాని ప్రభావం విద్యార్థులు, అధ్యాపకులు మాత్రమే కాకుండా మొత్తం సమాజంపై పడుతుంది. ఓయూటీఏ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం నేటి పరిస్థితుల్లో అత్యవసరం. తెలంగాణ ఉద్యమం మనకు నేర్పిన అన్యాయాన్ని ప్రశ్నించే స్ఫూర్తి విశ్వవిద్యాలయాల్లో సజీవంగా ఉండాలంటే, ముందుగా వాటి స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. ప్రశ్నించే విశ్వవిద్యాలయాలే బల మైన ప్రజాస్వామ్యానికి పునాదులు. వాటి స్వేచ్ఛను కాపాడటం సమాజం మొత్తం బాధ్యత.
తలారి శ్రీనివాసరావు, 9347488350
విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తికి సంకెళ్లా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



