Sunday, September 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబరితెగింపు!

బరితెగింపు!

- Advertisement -

‘నేను నేనే కొట్టాను, వాళ్లను చంపడమే నా పని. నా టార్గెట్ ఎవరో తెలుసా? ముస్లింలు, దళితవాదులు. వీళ్లను నిర్మూలించి, ముల్లా ముక్త్ భారత్‌ను సాధించడమే మా లక్ష్యం!’’ ఇదొక బహిరంగ ప్రకటన, బాజాప్తాగా, ఎంతో ధైర్యంతో, ముసిముసి నవ్వులు చిందిస్తూ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వతంత్ర భరద్వాజ్ చెప్పిన మాటలు. ఇవే కాదు, ఇంకా చాలానే చెప్పాడు. దేశమంతా ఈ వీడియో వైరల్ అవుతోంది. నన్ను ఎవరూ ఏమీ చేయరు, ఎందుకంటే, వాళ్లంతా నా సోదరులు. అని కూడా తన నమ్మకాన్ని వెల్లడించాడు. ఇదంతా ఢిల్లీ వేదికగా జరుగుతున్నది. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రసిద్ధి చెందిన భారత్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఏ దిశగా అధికారపు అడుగులు పడుతున్నాయో ఇట్టే చెప్పేయొచ్చు. ఈ దేశంలో మతాలను వినియోగించుకుని, కులాలనూ ఉపయోగించి తీవ్రవాదాన్ని, ఉగ్రవాద భావజాలాన్ని, ఆచరణను ఎలా వ్యాప్తిచేస్తున్నారో అర్థం చేసుకో వాలి. ఈ రకమైన బర్బరిక తీవ్రవాదంతో ఇక్కడి హిందూ మతావలం బకులకు, సామాన్య ప్రజానీకానికి ఏరకమైన సంబంధమూ లేదు. ఇది మతాన్ని తమ ప్రయోజనాలకు ఒక సాధనంగా ప్రయోగించే కుటిల రాజకీయ పన్నాగం మాత్రమే. ఇప్పుడిక భారత దేశం హిందూ పేర తాలిబన్ తీవ్రవాదానికి ఆశ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ జంతర్ మంతర్‌‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ చేసిన ధర్నా సందర్భంగా ని‌ఘా అనే ఒక మైనర్ విద్యార్థిని కూడా పాల్గొన్నది. ఆ నిఘా తండ్రిని అడ్డుకుని దాడి చేసి తల పగుల గొట్టాడు, ఈ గుండా స్వతంత్ర భరద్వాజ్. అతని తలకు అరవై కుట్లు పడి, చనిపోయే స్థితి నుండి బయటపడ్డాడు. అప్పుడు ఆ అమ్మాయి న్యాయం చేయాలని ధర్నా కూడా చేసింది. కానీ పోలీసులు ఏమీ పట్టించుకోలేదు. అరెస్టు చేసినట్టు చేసి వదిలేసారు. అదే విషయాన్ని ఇప్పుడు భరద్వాజ్ ఇంటర్వ్యూలో సెలవిచ్చాడు. నేనే తల పగలగొట్టానని, అరవై కుట్లు పడి కొద్దిలో బతికిపోయాడని చాలా తేలికగా చెప్పేసాడు. హత్యాయత్నం 307 సెక్షన్ కింద కేసు పెట్టాల్సి ఉండగా, కనీసం తనను అరెస్టు కూడా చేయలేక పోయారని చెప్పాడు. బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్, ప్రధాని మోడీ నాకు సపోర్ట్‌గా ఉన్నారని కూడా స్పష్టపరిచాడు. ఈ భరద్వా‌జ్‌కు మద్దతుగా మాట్లాడుతున్న యువత కూడా ఉన్నారు. ఈ గుండా సమూహాలను తయారు చేస్తున్నవా‌ళ్లెవరు? కొత్తగా వివరించాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే అసలయిన వింత ఏమిటంటే, కొన్ని రోజుల క్రితం, ఆరెస్సెస్‌ అధినేత మోహన్ భగవత్ అమెరికా మాడిస‌న్‌లో సభ పెట్టి ‘‘ముస్లిములను దేశంలో ఉండవద్దు అనుకునే వారు అసలు హిందువే కాదని’’ సూక్తి ముక్తావళిని వినిపించాడు.

అసలు హిందువు అయినవాడు ఏ మతాన్ని ద్వేషించడని ప్రవచించారు. ఇది జరిగిన మూడు రోజులకే భరద్వాజ్, ముల్లా ముక్త్ భారత్ మా లక్ష్యమని ప్రకటించాడు. కాషాయ కండువా ధరించి, నుదుట తిలకము దిద్దుకుని. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలో ఇంకా విశ్లేషించాల్సి ఉంది. ఒకవైపు నేతలు చెబుతూంటే గోతులు తవ్వేయడం ప్రత్యక్షంగా దర్శనమిస్తోంది. ఈ సంఘటన ఒకవైపు జరుగుతుండగానే, ఢిల్లీ వీధిలో మరో సంఘటన మతతత్వ విధానాన్ని బట్టబయలు చేసింది. గురువారం నాడు ఢిల్లీలో ఒక హాస్పిటల్‌‌లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు. దాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులను, ఢిల్లీ పోలీసులు నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. వాళ్లిద్దరూ షహీన్, నఫీసా ఖాన్‌. వాళ్ల పేర్లు తెలుసుకున్న పోలీసులు ఖాన్‌ శబ్దం వినగానే ముస్లింలని తెలుసుకోగానే విచక్ష‍ణా రహితంగా మహిళా జర్నలిస్టులపై దాడి చేశారని తెలియవస్తున్నది. ఈ విషయంపై పోలీసులు జవాబు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలూ ధర్నాకు దిగాయి.

ప్రభుత్వాలను ప్రశ్నించిన వారిని నిర్బంధించడం, వాళ్లు ముస్లింలయితే మరీ దాడులు చేసి గాయ పరచడం అత్యంత దారుణమైన విషయం. దేశ రాజధానిలోనే ఇలాంటిది జరిగితే, ఇక డబుల్ ఇంజన్ సర్కారులున్న రాష్ట్రాలలో మరింత దారుణంగా ఉంది. ఇటీవల బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి హిందూత్వ ఆచరణను బహిరంగంగానే మొదలు పెట్టాడు. ఈ దేశపు ప్రజాస్వామ్య లౌకిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నాడు. ఈ రెండు సంఘటనలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి. భరద్వాజ్ వల్ల తమకు నష్టం జరుగుతుందని భావిస్తే అతన్ని అరెస్టు చేసినట్టు ప్రవర్తించవచ్చు. కానీ అధినేతల అండదండలు, వారి బలం లేకుండా, వీళ్లు అలా ప్రవర్తించరు. ఇంత బహిరంగంగా, యథేచ్ఛగా చంపుతామని బెదిరించడం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ఎంతో ప్రమా దకరమైనది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మౌనంగా ఉండరాదు. ప్రతి ఒక్కరూ ఈ దుశ్చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -